Telugu Gateway
Andhra Pradesh

పవన్ కళ్యాణ్ కు తన శాఖలు నచ్చటం లేదా?

పవన్ కళ్యాణ్ కు  తన శాఖలు నచ్చటం లేదా?
X

జనసేన అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హోం శాఖ బాధ్యతలు తీసుకుంటే ఆంధ్ర ప్రదేశ్ లో నేరాలు ఆటోమేటిక్ గా ఆగిపోతాయా?. ఆంధ్ర ప్రదేశ్ లో నమోదు అవుతున్న రేప్ ఘటనలపై పవన్ కళ్యాణ్ ఆందోళన అర్ధం చేసుకోదగిందే. అయితే ఈ విషయంలో ఆయన పబ్లిక్ గా హోం మంత్రి అనిత...డీజీపీలపై విమర్శలు చేయటం...తాను హోం శాఖ తీసుకుంటే పరిస్థితులు వేరుగా ఉంటాయని వ్యాఖ్యానించటంతో రాజకీయ దుమారం మొదలైంది. ఇక్కడ మరో కీలక విషయం ఏమిటి అంటే వంగలపూడి అనిత హోం మంత్రి అయినా కూడా లా అండ్ ఆర్డర్ సబ్జెక్టు ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గరే ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బహిరంగంగా మాట్లాడుతూ హోం మంత్రి, డీజీపీ లు సరిగా వ్యవహరించకపోవటం వల్లే ఈ పరిస్థితి ఉంది అనే సంకేతాలు పంపారు. తాను హోం మంత్రి అయితే పరిస్థితి మరోలా ఉంటుంది అని..తన దగ్గర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ శాఖలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ అలా హోం మంత్రి పై విమర్శలు చేశారో లేదో వెంటనే వైసీపీ సోషల్ మీడియా వేదికగా కూటమి సర్కారు పై ఎటాక్ ప్రారంభించింది.

ఈ మొత్తం వ్యవహారం చూసిన వాళ్ళు పవన్ కళ్యాణ్ తన శాఖలపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు కనిపిస్తోంది అనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. లా అండ్ ఆర్డర్ సీఎం దగ్గర ఉంటే....హోం మంత్రి అనితను టార్గెట్ చేయటం వల్ల ప్రయోజనం ఏమి ఉంటుంది అని అధికారులు కూడా సందేహం వ్యక్తం చేస్తున్నారు. మరో కీలక విషయం ఏమిటి అంటే పలు కీలక శాఖల మంత్రుల అధికారాలు కూడా కేంద్రీకృతంగా ఉన్న విషయం ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్ కు తెలియదా అని ప్రశ్నిస్తున్నారు. మరో వైపు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ లాగా ఉంటేనే సిస్టం సరిగా పని చేస్తుంది అని చెప్పటం ద్వారా ఆయన చంద్రబాబు తీరును కూడా తప్పుపట్టినట్లు అయింది అని...మొత్తానికి ఆంధ్ర ప్రదేశ్ లో బీజేపీ మోడల్ అమలుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేస్తున్నారు అనే చర్చ కూడా తెరమీదకు వస్తోంది. పవన్ కళ్యాణ్ తాజాగా చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందిస్తారా..లేక తనదైన శైలిలో కాలానికే వదిలేస్తారా అన్నది వేచిచూడాల్సిందే.

Next Story
Share it