పవన్..సోము వీర్రాజు కీలక భేటీ
తిరుపతి లోక్ సభ సీటు వ్యవహారం బిజెపి, జనసేనల మధ్య దూరం పెంచుతోంది. ఈ విషయాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల తిరుపతిలో చేసిన వ్యాఖ్యలు బహిర్గతం చేశాయి. ఈ సీటులో బరిలోకి దిగాలని జనసేన బలంగా పట్టుబడుతోంది. మరో వైపు బిజెపి నేతలు మాత్రం తామే బరిలో ఉంటామని ప్రకటిస్తున్నారు. ఈ తరుణంలో జనసేన బిజెపి తీరుపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేసింది. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల నేఫథ్యంలో బిజెపి ఏపీ ప్రెసిడెంట్ సోము వీర్రాజు ఆదివారం నాడు హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ తో భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. వీరి భేటీ అనంతరం జనసేన ఓ ప్రకటనలో విడుదల చేసింది. అందులోని ముఖ్యాంశాలు...'తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో జనసేన – బీజేపీ... ఉభయపార్టీల అభ్యర్ధి విజయం సాధించే దిశగా అనుసరించాల్సిన ప్రణాళికపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చర్చించారు. తిరుపతి ఉప ఎన్నిక, ప్రస్తుత రాష్ట్ర రాజకీయ పరిస్థితులు చర్చకు వచ్చాయి.
ఏ పార్టీ నుంచి పోటీ చేసినా ఉభయ పార్టీల అభ్యర్థిగానే భావించి విజయానికి వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. 2024లో బీజేపీ, జనసేన లు సంయుక్తంగా అధికారంలోకి రావడమే లక్ష్యంగా పని చేయాలని, ఇందుకు తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక విజయంతో నాంది పలికే విధంగా ఇరుపార్టీల శ్రేణులను సమాయత్తం చేస్తారు. ఎక్కడైనా చిన్నపాటి గ్యాప్స్ ఉన్నా ఎప్పటికప్పుడు చర్చల ద్వారా వాటిని చక్కదిద్దాలని నిర్ణయం తీసుకున్నారు. తద్వారా సమన్వయ లోపం లేకుండా ఇరుపార్టీలు ముందుకు వెళ్లేలా కార్యక్రమాల్ని సిద్ధం చేస్తారు. అన్ని వర్గాల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.' అని తెలిపారు.