Telugu Gateway
Andhra Pradesh

భావప్రకటనా స్వేచ్ఛ అంటే దూషణలు కాదు

భావప్రకటనా స్వేచ్ఛ అంటే దూషణలు కాదు
X

సోషల్ మీడియా వ్యవహారంపై జనసేన అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అవసరం అయితే సోషల్ మీడియా దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కొత్త లెజిస్లేషన్ తీసుకురావటానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని ప్రకటించారు. వాక్ స్వాతంత్రం… సోషల్ మీడియా దుర్వినియోగంపై పవన్ కళ్యాణ్ బుధవారం సాయంత్రం ఒక వీడియో విడుదల చేశారు. ఇందులోనే ఆయన ఈ ప్రత్యేక చట్టం అంశాన్ని ప్రస్తావించారు. పవన్ కళ్యాణ్ వీడియో సందేశంలో ముఖ్యమైన అంశాలు ఇలా ఉన్నాయి. భావ ప్రకటన స్వేచ్ఛ అనేది రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని.. ఆ హక్కును తాను గౌరవిస్తాను అన్నారు... తమ ప్రభుత్వం కూడా గౌరవిస్తుంది. కానీ మనం గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఉంది. భావ ప్రకటన స్వేచ్ఛ అనేది పూర్తిగా అపరిమితమైన హక్కు కాదు. దానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. ఒకరి హక్కులను మరొకరు ఉల్లంఘించే స్థాయికి వెళ్లినప్పుడు, చట్టపరమైన పరిణామాలు తప్పవు అని హెచ్చరించారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(2) ప్రకారం దేశ సమగ్రత, జాతీయ భద్రత, ప్రజా శాంతి, మర్యాద, నైతిక విలువలు, పరువు నష్టం, నేరాలకు ప్రేరేపించడం వంటి అంశాల్లో చట్టపరమైన పరిమితులు ఉన్నాయి అని తెలిపారు.

సింపుల్ గా చెప్పాలంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఫ్రీడమ్ టూ అబ్యూజ్ కాదు. ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు మీకు ఉంది. మమ్మల్ని ప్రశ్నించే హక్కు మీకు ఉంది. మా నిర్ణయాలతో విభేదించే హక్కు మీకు ఉంది. అదే ప్రజాస్వామ్యం... దాన్ని మేము స్వాగతిస్తాము కానీ ఒకరిని తిట్టడం, ప్రాణ భయానికి గురి చేస్తూ బెదిరింపులకు పాల్పడటం, ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం, మహిళలను టార్గెట్ చేయడం, మత విశ్వాసాలను అవమానించడం, ఒక వ్యక్తి గౌరవాన్ని దెబ్బతీయడం, హింసకు ప్రేరేపించడం... ఇవన్నీ రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛలోకి రావు. ఇవి చట్టపరంగా నేరాలు అన్నారు. చివరకు ⁠దేవుళ్లు, దేవతలపై కూడా ఉద్దేశపూర్వకంగా అవమానకర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది భావ ప్రకటన స్వేచ్ఛ కాదు, ఆరోగ్యకరమైన విమర్శ కాదు. ఇది ప్రజాస్వామ్యయుతం అంతకంటే కాదు అని.. ⁠నిర్మాణాత్మక విమర్శలు, ఫెయిర్ కామెంట్స్, సెటైర్స్ , విభిన్న అభిప్రాయాలను వ్యక్తం చేసే హక్కును తాము పూర్తిగా గౌరవిస్తాము అని.. ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారాలు చేయడం, ద్వేషపూరిత ప్రసంగాలు, నేరపూరిత బెదిరింపులు, సైబర్ వేధింపులు , దూషణలు, ఒకరి పరువును ఉద్దేశపూర్వకంగా దెబ్బతీయాలనే ప్రయత్నాలు... ఇవన్నీ భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో సమర్థించబడవు అని స్పష్టం చేశారు.

నేరానికి కులం లేదు ... మతం లేదు... రాజకీయ పార్టీ లేదు. తప్పు చేసిన తర్వాత కులం, మతం, ప్రాంతం లేదా రాజకీయాల వెనుక దాక్కోవాలని ఎవరూ ప్రయత్నించకండి. చట్టం ముందు ప్రతి పౌరుడు సమానమే. నేరం చేసిన ప్రతి ఒక్కరిపై చట్టప్రకారం చర్యలు తీసుకోబడతాయి అని ప్రకటించారు. మన మాటల్లో బాధ్యత ఉండాలి. మన భాషలో గౌరవం ఉండాలి. మన స్వేచ్ఛకు జవాబుదారీతనం ఉండాలి. సోషల్ మీడియా మనుషులను కలిపే వేదిక కావాలి... విడదీసే వేదిక కాకూడదు. మమ్మల్ని ప్రశ్నించండి. విమర్శించండి. మీ అభిప్రాయాన్ని చెప్పండి. కానీ గౌరవంతో చెప్పండి. బాధ్యతతో చెప్పండి. చట్టాన్ని గౌరవిస్తూ చెప్పండి. అప్పుడే మన ప్రజాస్వామ్యం మరింత బలపడుతుంది అన్నారు.

Next Story
Share it