Telugu Gateway
Andhra Pradesh

వైసీపీది కుట్ర‌పూరిత ఆలోచ‌న‌

వైసీపీది కుట్ర‌పూరిత ఆలోచ‌న‌
X

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కళ్యాణ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అధికార వైసీపీది కులాల కుంప‌టి రాజేసి చ‌లి కాచుకునే ప్ర‌య‌త్నం అని మండిప‌డ్డారు. కోన‌సీమ జిల్లాకు అంబేద్క‌ర్ పేరు పెట్ట‌డంలో జాప్యం చేయ‌టం వెన‌కే కుట్ర‌పూరిత ఆలోచ‌న ఉంద‌ని ఆరోపించారు. రాష్ట్ర మంత్రుల‌కు గొడవలు పెంచాలనే తాపత్రయం ఉన్నట్లుందని విమర్శించారు. ప‌వ‌న్ కళ్యాణ్ బుధ‌వారం నాడు మంగ‌ళ‌గిరిలో మీడియా స‌మావేశంలో మాట్లాడారు. జిల్లా పేరు మార్పున‌కు సంబంధించి కోనసీమ ప్రజల నుంచి రెఫరెండం తీసుకోండి అని డిమాండ్ చేశారు. క‌డప జిల్లాకు కూడా అంబేద్కర్ గారు పేరు పెట్టే ఆలోచన చేయవచ్చుగా అని సూచించారు. మీడియా స‌మావేశంలో ప‌వ‌న్ వ్యాఖ్య‌లు ఆయ‌న మాట‌ల్లోనే..' వైసీపీ ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలో భాగంగానే అమలాపురంలో అల్లర్లు చెలరేగాయి. వైసీపీ ప్రభుత్వంపై ఎస్సీల్లో పెరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేకతను పక్కదారి పట్టించాలనే ఉద్దేశంతోనే కోనసీమలో గొడవలు రేపారు . కుల ఘర్షణలు రావణకాష్టం లాంటివని, ఒక్కసారి అంటుకుంటే దేశమంతా కాలిపోయే ప్రమాదం ఉంది. వైసీపీ మంత్రివర్గం నోటికి వచ్చినట్లు మాట్లాడి గొడవలు పెంచే ప్రయత్నం చేయడం తప్ప, తగ్గించే ప్రయత్నాలు చేయడం లేదు. కొత్తగా జిల్లాలు ఏర్పాటు చేసినప్పుడు వెలువడిన గెజిట్ లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పెట్టకుండా, ఇప్పుడు హడావుడిగా కోనసీమ జిల్లాకు ఆ పేరు పెట్టడం వైసీపీ రాజకీయ కుట్రలో భాగమేనన్న అనుమానం వ్యక్తమవుతోంది.

పాలన సౌలభ్యం కోసమని వైసీపీ ప్రభుత్వం ఏప్రిల్ 4న కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. కొత్త జిల్లాల్లో కొన్నింటికి శ్రీ సత్యసాయి, అన్నమయ్య, అల్లూరి సీతారామరాజు వంటి వారి పేర్లతో నామకరణం చేసింది. అదే రోజు అన్ని జిల్లాలతోపాటు కోనసీమ జిల్లాకు కూడా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు పెట్టేస్తే ఈ రోజు ఇలాంటి పరిస్థితి వచ్చేదే కాదు. కావాలని జాప్యం చేయడంలో వైసీపీ ఉద్దేశం ఏంటి? నోటిఫికేషన్ జారీ చేసి అభ్యంతరాలు ఉంటే 30 రోజుల్లోగా వినతులు ఇవ్వాలని కోరడం వెనక ఆంతర్యం ఏమిటి? గొడవలుపడాలనే వీళ్లు కోరుకుంటున్నారు. పేరు మార్పులపై కొన్ని జిల్లాల్లో ఇలానే అభ్యంతరాలు వస్తే వాళ్లకు సమయం ఇవ్వకుండా ఇక్కడ మాత్రమే 30 రోజులుపాటు సమయం ఇచ్చారంటే దీని వెనకనున్న దురుద్దేశం ఏమిటో స్పష్టంగా తెలుస్తోంది. రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం ఏర్పాటు చేసిన కమిషన్లు ప్రతి జిల్లాకు వెళ్లి వాళ్ల వాళ్ల అభ్యంతరాలు తెలుసుకునేవి. ఇప్పుడు మాత్రం సమూహంగా కాకుండా వ్యక్తులుగా కలెక్టర్ కార్యాలయానికి వచ్చి వినతులు ఇవ్వాలని అడగడం చూస్తుంటే ప్రభుత్వానికి ఏదో దురుద్దేశం ఉందనే అర్థమవుతోంది.సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్క పోస్టు పెడితేనే రకరకాల పోలీసు కేసులు పెట్టి వేధిస్తున్నారు. అలాంటిది 30 రోజులు గడువును ప్రభుత్వం ఇచ్చిందంటే ఇక్కడ గొడవలు జరుగుతాయని ముందే తెలుసు.

అల్లర్లు జరగాలని కోరుకుంటోంది కాబట్టే.. ఘర్షణ వాతావరణం కల్పించి భావోద్వేగాలను రెచ్చగొట్టింది. మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే సతీష్ నివాసాలకు నిరసనకారులు నిప్పుపెట్టడం ఇందులో భాగమే. మంత్రిది సొంత ఇల్లు కాదు అద్దె ఇల్లు. దాడికి ముందే మంత్రి కుటుంబీకులను పోలీసులు అక్కడ నుంచి తరలించారు. ఇవన్ని చూస్తుంటే ముందస్తు ప్రణాళికలో భాగంగానే దాడులు జరిగాయని తెలుస్తోంది. గతంలో కాకినాడకు చెందిన ఒక ఎమ్మెల్యే నన్ను వ్యక్తిగతంగా దూషించి, నిరసన తెలిపిన జనసేన నాయకులపై దాడులకు పాల్పడితే వారిని కేవలం పరామర్శించడానికి వెళ్తేనే 144 సెక్షన్ విధించి నా పర్యటన పూర్తయ్యే వరకు పోలీసులు చాలా అలర్ట్ గా ఉన్నారు. అలాంటిది నెల రోజులుగా కోనసీమ ప్రాంతంలో భావోద్వేగాలు చెలరేగే అవకాశం ఉన్నపుడు ఇంకెంత అప్రమత్తంగా ఉండాలి? అలా కాకుండా మంత్రి, ఎమ్మెల్యే ఇళ్లు తగలబడుతుంటే పోలీసులు ప్రేక్షకపాత్ర వహించడం చూస్తుంటే ఇది ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరిగిందని అర్ధమవుతోంది. పోలీస్ వ్యవస్థను మీ చేతుల్లో పెట్టుకొని దాడులకు జనసేన కారణమని మాట్లాడటం సిగ్గుచేటు. కేంద్ర మంత్రి రాందాస్ అథావలే బీఎస్సీ నాయకులు అడిగిన ప్రశ్నకు చెప్పిన లెక్కల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో దక్షిణ భారత దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉందని చెప్పారు. రాష్ట్రంలో మొత్తం 5,857 దుర్ఘటనలు జరిగాయి. తూర్పుగోదావరి జిల్లా, సీతానగరంకు చెందిన వరప్రసాద్ అనే ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన యువకుడు వైసీపీ నాయకుల వేధింపులకు, శిరోముండనం చేశారన్న కోపంతో ఏకంగా రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ కి నక్సల్స్ లో చేరేందుకు అనుమతి కోరుతూ లేఖ రాసిన పరిస్థితి. ప్రకాశం జిల్లా, కొండేపి గత నెలలో రామబ్రహ్మం అనే అతని మీద వైసీపీ నాయకులు అటాక్ చేశారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు కొత్త ఎత్తుగడ మొదలు పెట్టారు. ఎమ్మెల్సీ అనంతబాబు దగ్గర పని చేసిన డ్రైవర్ హత్యోదంతం అందరిలోనూ కలకలం రేపింది. ఆ మర్డర్ కేసును పక్కదారి పట్టించాలనే దురుద్దేశంతోనే కోనసీమ చిచ్చుకు అధికార పక్షం తెరలేపింది.

రాష్ట్ర హోంమంత్రిని అడుగుతున్నాను.. కోడికత్తి ఘటన కేసు ఏమైంది? దాని విచారణ ఎంత వరకు వచ్చింది? వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఏమయ్యింది? ఒక రోజు గుండెపోటు వచ్చిందన్నారు. తర్వాత లేదు చంపేశారన్నారు. గుండెపోటు నుంచి గొడ్డలి పోటు వరకు పట్టుకొచ్చారు. ఇవన్నీ వారు చెప్పిన కథనాలే. విశాఖలో సీఐఎస్ఎఫ్ ఆధీనంలో ఉన్న ఎయిర్ పోర్టులో ఇప్పుడున్న ముఖ్యమంత్రి మీద దాడి జరిగితే ఆ రోజున ఏం మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ పోలీసుల్ని నమ్మలేము.. తెలంగాణ పోలీసులు కావాలి అన్నారు కాదా. ఈ రోజు అదే పోలీసు వ్యవస్థను శాసించే స్థితిలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు కోడికత్తి కేసు మీద విచారణ ఎందుకు జరగడం లేదు. నిందితులకు ఎందుకు శిక్ష పడలేదు. విచారణ జరగకపోగా వారికి సంబంధించిన వారికి పదవులు ఇచ్చారని విన్నాను. వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత మా తండ్రి మరణం అనుమానాస్పదం, ఎవ్వరూ పట్టించుకోవడం లేదంటూ ఢిల్లీ వరకు వెళ్తే ఇప్పటి వరకు తేల్చలేకపోయారు. ఇన్ని తప్పులు మీ దగ్గర పెట్టుకుని మీ మీద మీరే దాడులు చేయించుకుని సానుభూతి పెంచుకునే స్థాయిలో మీరుండి మమ్మల్ని అనడం భావ్యమా? అలాగే ఒక ఆడ బిడ్డ మానమర్యాదలకు భంగం వాటిల్లితే తల్లి పెంపకం సరిగా లేదని మాట్లాడం ఎంత వరకు సబబు? ' అని ప్ర‌శ్నించారు.

Next Story
Share it