Telugu Gateway
Andhra Pradesh

పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
X

ఏపీలోని అధికార వైసీపీపై జనసేన అధినేత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పీఠం కదులుతుందనే భయంతోనే జనసేనపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. భీమవరం ఎమ్మెల్యే ఓ అకు రౌడీఅని.. బ్యాంకును దోచిన వ్యక్తి అన్నారు. అతను అంతకంటే భిన్నంగా వ్యవహరిస్తారని ఆశించకూడదని వ్యాఖ్యానించారు. మున్సిపల్ వ్యాన్ వస్తుందని..పిచ్చికుక్కను తీసుకెళుతుంది అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పంచాయతీ ఎన్నికల్లో జనసేన పార్టీ విజయం చూసి ఓర్వలేక చాలా మంది వైసీపీ నాయకులు అనేక నియోజకవర్గాల్లో దాడులకు పాల్పడుతున్నారు. వైసీపీ నాయకుల డి.ఎన్.ఎ. ఎలా ఉందంటే... 151 మంది ఎమ్మెల్యేలు ప్రజలకు సేవ చేయాల్సింది పోయి వేరే పార్టీల ప్రత్యర్ధులను హింసించే పనిలో ఉన్నారు. వాళ్లు తప్ప ఎవరూ గెలవకూడదు. ప్రజాసేవ వాళ్లు చేయరు. ఎదుట వారిని చేయనివ్వరు. పరిస్థితి అలా ఉంది కాబట్టే ఇవాళ జనసేనను మత్స్యపురిలో సంపూర్ణంగా గెలిపించారు. 14 వార్డులకుగానూ 12 వార్డులను గెలిపించారు. ఒక దళిత మహిళా సర్పంచ్ వెళ్లి అంబేద్కర్ గారి విగ్రహానికి పూలదండ వేస్తుంటే ఆవిడ మీద దాడి చేయడం ఆవేదన కలిగించే అంశం.

స్థానిక వైసీపీ ఎమ్మెల్యే చాలా రకాలుగా బెదిరించడం, దుర్భాషలాడటం, సభ్య సమాజం తలదించుకునేలా బూతులు తిట్టడం, పైగా వ్యక్తిగతంగా నన్ను దూషించడం అనేది ఆయనకు రివాజుగా మారిపోయింది. కింద పీఠం కదులుతున్నప్పుడు భయమేస్తుంది. ఆ భయం నుంచి వచ్చే మాటలే అవి. స్థానిక భీమవరం వైసీపీ ఎమ్మెల్యే ఒక ఆకురౌడీ, స్థానిక కోపరేటివ్ బ్యాంకును దోచేసిన వ్యక్తి. చిన్నా చితకా వ్యాపారాలు చేసుకునే చిరు వ్యాపారులు, స్కూలు టీచర్లు, మధ్య తరగతి వారు తమ కష్టార్జితాన్ని కోపరేటివ్ బ్యాంకులో దాచుకుంటే... వాళ్ల కష్టాన్ని దోచేసిన వ్యక్తి అతను. ఆయన ఇలా కాకుండా ఇంకెలా ప్రవర్తిస్తాడు. ఒక ఆకు రౌడీ, బ్యాంకును దోచేసిన వ్యక్తి వేరేలా ప్రవర్తిస్తాడని మనం ఆశించకూడదు. దీనికి ఎలా సమాధానం చెప్పాలో మాకు బాగా తెలుసు. ప్రజా ప్రతినిధిగా బాధ్యతతోగానీ ఉండకపోతే దానిని ఎలా ఎదుర్కొవాలో బలంగా తెలిసినవాడిని.... మరిచిపోకండి. ప్రజాస్వామ్య పద్దతిలో మీ పరిధిలో మీరు ఉండండి. మా వాళ్లు ఏవైనా తప్పులు చేస్తే సరిదిద్దుకుంటాం. దాడులు చేసి ఇళ్ల మీదకు వస్తే మాత్రం చూస్తూ కూర్చొనే వ్యక్తులం మాత్రం కాదు. ఒళ్లు దగ్గర పెట్టుకొని ఉండండి.

డి.జి.పి. గౌతమ్ సవాంగ్ కు వ్యక్తిగతంగా తెలియజేస్తున్నాను... భీమవరంలో శాంతిభద్రతలు గతంలో కూడా అదుపు తప్పాయి. అలాంటి పరిస్థితులు మరలా ఉత్పన్నం కాకుండా ఉండాలంటే ప్రభుత్వానికి చెప్పి స్థానిక ఎమ్మెల్యే ఆగడాలను కట్టి పెట్టాల్సిందే. ఆయన దూకుడుకు కళ్లెం వేయకపోతే శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుంది. ఆ తరువాత దయచేసి మమ్మల్ని ఏమీ అనకండి. ఈ చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించే సంయమనం మాకు లేదు. అలాగే నాపై వ్యక్తిగతంగా దూషణలకు దిగినా, గత కొన్ని సంవత్సరాలుగా దూషిస్తున్న వైసీపీ ఎమ్మెల్యే భాషపై జనసైనికులు చాలా ఆగ్రహావేశాలకు గురవుతున్నారు. మీరు ఆగ్రహావేశాలకు లోనుకావొద్దు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎదుర్కొనే అంశం ఇది... ఆవేశాలకు లోనయ్యేది కాదు. మీకు ఒకటే మాట చెబుతున్నాను. మనం రోడ్డు మీద వెళ్లేటప్పుడు కొన్ని కుక్కలు అరుస్తాయి. కొన్ని పిచ్చి కుక్కలు కరుస్తాయి. పిచ్చి కుక్క కరిచింది కదా అని దానిని మనం తిరిగి కరవం కదా? మనం ఏం చేస్తాం. మున్సిపాలిటి వ్యాన్ వచ్చే వరకు వెయిట్ చేసి పిచ్చి కుక్కను మున్సిపాలిటి వ్యాన్ లో పడేస్తాం. అందరికీ మాట ఇస్తున్నాను మున్సిపాలిటి వ్యాన్ వస్తుంది. పిచ్చి కుక్కను పట్టుకెళ్లిపోతుంది. అప్పటి వరకు దయచేసి సంయమనం పాటించండి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Next Story
Share it