Telugu Gateway
Andhra Pradesh

లింగమనేని రమేష్ పేరు ఖరారు...పేరు ప్రకటనే పెండింగ్!

లింగమనేని రమేష్ పేరు ఖరారు...పేరు ప్రకటనే పెండింగ్!
X

జనసేన అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజ్యసభ విషయంలో ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నారా?. ఇదే విషయాన్ని టీడీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఆయన తెలియజేయనున్నారా?. అంటే అవుననే సమాధానం వస్తోంది జనసేన నేతల నుంచి. టీడీపీకి దక్కే స్థానాల కంటే కూడా జనసేన కు దక్కే ఫస్ట్ రాజ్యసభ సీటు విషయంపై సర్వత్రా ఆసక్తికి నెలకొని ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనే ఆసక్తి ఆ పార్టీ నేతలతో పాటు రాజకీయ వర్గాల్లో ఉంది. ఈ సీటు దక్కించుకోవటం కోసం చాలా మంది రేస్ లో ఉన్నారు. ముందు నుంచి విజయవాడకు చెందిన లింగమనేని రమేష్ పేరు ప్రముఖంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత మరో పారిశ్రామికవేత్త బండారు నరసింహారావు కూడా రేసులోకి వచ్చారు. వీళ్ళిద్దరితో పాటు ఒక రియల్ ఎస్టేట్ సంస్థ అధినేత, మరో ప్రముఖ నిర్మాత కూడా ఇదే పనిలో ఉన్నారు. జనసేన కు చెందిన అత్యంత విశ్వసనీయ వర్గాలు అందించిన సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ రాజ్యసభ సీటు కు లింగమనేని రమేష్ కు ఎంపిక చేసినట్లు చెపుతున్నారు.

ఎన్ని విమర్శలు వచ్చినా కూడా ఆయన ఈ విషయంలో వెనక్కి తగ్గకూడదు అనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ పార్టీ నేత ఒకరు వెల్లడించారు. అదేంటి అంటే పార్టీ గెలుపు, ఓటములతో సంబంధము లేకుండా లింగమనేని రమేష్ తమ వెంట ఉన్నారు అని...దశాబ్దానికి పైగా ఆయన తన వెన్నంటి ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు పవన్ కళ్యాణ్ స్పష్టం చేసినట్లు చెపుతున్నారు. మరో వైపు ఇప్పుడు రాజ్యసభ రేసులోకి వచ్చిన బండారు నరసింహారావు కేవలం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రమే జనసేన అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు దగ్గరయ్యే ప్రయత్నాలు మొదలు పెట్టారు అనే చర్చ కూడా జనసేన వర్గాల్లో ఉంది. మిగిలిన వాళ్ళ ప్రయత్నాలను పవన్ కళ్యాణ్ పెద్దగా ఎంటర్టైన్ చేయలేదు అని పార్టీ వర్గాలు చెపుతున్నాయి. రాజ్యసభకు లింగమనేని రమేష్ అభ్యర్థిత్వాన్ని జనసేన అధికారికంగా ప్రకటించిన తర్వాత పార్టీ నాయకుల స్పందన ఎలా ఉంటుందో చూడాలి.

Next Story
Share it