Telugu Gateway
Andhra Pradesh

ఏపీ లో బీజేపీ సైలెంట్ ఆపరేషన్ !

ఏపీ లో బీజేపీ సైలెంట్ ఆపరేషన్ !
X

రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ప్రస్తుతానికి కేంద్రంలో అధికారంలో చెలాయిస్తున్న బీజేపీకి...ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ కి జనసేన అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎంతో సన్నిహితంగా ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ముఖ్యమంత్రి చంద్రబాబు కంటే పవన్ కళ్యాణ్ కే మోడీ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు అనే సంకేతాలు పంపుతున్నారు అనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో ఉంది. మిత్రపక్షాలుగా ఉన్నంత మాత్రాన అటు టీడీపీ అధినేత చంద్రబాబు, ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు సంబదించిన కీలక సమాచారం తమ దగ్గరకు వేస్తే ఏ మాత్రం వద్దు అనరు. అంతే కాదు...ఆ సమాచారాన్ని దగ్గర పెట్టుకుని అవసరం వచ్చినప్పుడు వాడుకుంటారు కూడా. గత పదేళ్లకు పైగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఇదే మోడల్ ను ఫాలో అవుతూ కీలక నేతలను తమ చెప్పు చేతల్లో పెట్టుకున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారంలో ఉంది.

ఇది ఇలా ఉంటే ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున పవర్ ప్రాజెక్ట్ లకు అనుమతి మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఇందులో పెద్ద ఎత్తున గోల్ మాల్ జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆంధ్ర ప్రదేశ్ లో పవర్ షేరింగ్ మాత్రమే కాదు...పవర్ ప్రాజెక్ట్ ల్లో కూడా ఇద్దరు కీలక నేతల మధ్య షేరింగ్ జరిగింది అంటూ బీజేపీ కి చెందిన ఎంపీ ఒకరు పలు వివరాలతో కూడిన నివేదికను పార్టీ పెద్దలకు అందచేసినట్లు అత్యంత విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ముఖ్యంగా జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో ఎంతో సన్నిహితంగా ఉంటున్న లింగమనేని రమేష్ బంధువులకు చెందినవి గా చెపుతున్న కంపెనీ లకు అనుమతి మంజూరు చేయటం..మళ్ళీ ఆ కంపెనీ తన కు దక్కిన అనుమతులను ఇతర సంస్థలకు బదిలీ చేయటం వెనక పెద్ద ఎత్తున గోల్ మాల్ జరిగింది అనే విషయాన్ని ఆయన నివేదించినట్లు చెపుతున్నారు.

కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఎస్ఐపీబి క్లియర్ చేసిన ప్రాజెక్ట్ లు కొన్ని చూస్తే లింగమనేని రమేష్ బంధువులకు సంబంధించినవి ఉండటం విశేషం. అయితే తెర ముందు వీళ్ళను పెట్టి తెర వెనక లింగమేని రమేష్ ఉండి ఈ కథ అంతా నడిపిస్తున్నారు అనే అనుమానాలు స్థానిక బీజేపీ నేతల్లో కూడా వ్యక్తం అవుతున్నాయి. తాజాగా అనుమతులు దక్కించుకున్న కంపెనీ ల్లో డైరెక్టర్లు గా వాళ్లే ఉండటం..పలు కంపెనీల లావాదేవీలు అనుమానాస్పదంగా ఉండటంతో వీళ్ళు కూడా వీటిపై దృష్టి సారించారు. అందులో భాగంగానే తమ దగ్గర ఉన్న ..సేకరించిన సమాచారాన్ని సదరు ఎంపీ పెద్దలకు చేరవేశారు. ఇది ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామంగానే చెప్పుకోవచ్చు. కూటమిలో టీడీపీ, జనసేన, బీజేపీ లు కీలక భాగస్వాములుగా ఉన్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ తన వివాదాస్పద వ్యాఖ్యలతో పలు మార్లు వార్తల్లో నిలిచారు కానీ..బీజేపీ మాత్రం ఎక్కడా వివాదాలకు ఛాన్స్ లేకుండా సైలెంట్ గా ఉంది. అయితే చేరికల విషయంలోనే టీడీపీ, బీజేపీ ల మధ్య కొంత మేర విభేదాలు తలెత్తాయి. అయితే వాళ్ళు తమ పనిని సైలెంట్ గానే చేస్తున్నారు అని..ఇక్కడ జరిగే వ్యవహారాలను ఎప్పటికప్పుడు ఢిల్లీ పెద్దలకు పంపుతున్నారు అని చెపుతున్నారు. అయితే ఈ ఎంపీ ఫిర్యాదు తో ఇప్పటికిప్పుడు ఏదో అవుతుంది అని ఎవరూ ఆశించటం లేదు అని..కానీ ఎవరు...ఎవరితో కలిసి ఏమీ చేస్తున్నారో మాత్రం వాళ్ళు ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నారు అనే చర్చ సాగుతోంది.

Next Story
Share it