కాపుల ఓట్లను చంద్రబాబుకు అమ్మేందుకు పవన్ ప్రయత్నం
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సీఎం జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గత కొంత కాలంగా పదే పదే దత్తపుత్రుడు అంటున్న జగన్ ఇప్పుడు కాపుల ఓట్లను మూట కట్టి చంద్రబాబుకు అమ్మే ప్రయత్నం చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. కాకినాడలో జరిగిన వైఎస్ఆర్ కాపునేస్తం నిధుల విడుదల సందర్భంగా సీఎం జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు పాలనలో 'డీపీటీ' అంటే.. దోచుకో.. పంచుకో.. తినుకో స్కీమ్ అమలు అయితే తమ ప్రభుత్వం డీబీటీ ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తోందని చెప్పారు. చంద్రబాబు హయాంలో ఉన్న దోచుకో, పంచుకో, తినుకో కావాలా?..అని ప్రజలను ప్రశ్నించారు. చంద్రబాబు, పవన్, ఎల్లోమీడియాకు తెలిసింది అవినీతి మాత్రమే.
చంద్రబాబు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు. హుద్‌హుద్ వచ్చినప్పుడు 11 రోజుల పాటు తానే స్వయంగా ఉత్తరాంధ్రలో తిరిగానని, ఆ సమయంలో పాచిపోయిన పులిహోర ప్యాకెట్లను బాధితులకు పంచాడు ఆయన అంటూ ఎద్దేవా చేశారు. తమ హయాంలో విపత్తు వస్తే బాధితులను సక్రమంగా ఆదుకుంటున్నామని తెలిపారు. వరద బాధితులు ఏ ఒక్కరికీ ఇబ్బందులు లేకుండా రేషన్‌తో పాటు ప్రతీ ఇంటికి రూ.2 వేలు ఇస్తున్నాం. చంద్రబాబు తన పాలనలో ఒక్క రూపాయి ఇవ్వలేకపోయారు. అలాగే.. జగనన్న పాలనలో లబ్ధి జరగలేదని చంద్రబాబు ఏ ఒక్కరినీ చూపలేకపోయారు. అబద్దాల మార్క్ చంద్రబాబు కావాలా? ఎలాంటి వివక్ష లేకుండా పారదర్శకంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్న ఈ ప్రభుత్వం కావాలా?.. ఎవరి పాలన కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలని సీఎం జగన్ కోరారు.