Telugu Gateway
Andhra Pradesh

హ‌త్య చేసిన వాళ్ల‌కు అన్ని మ‌ర్యాద‌లా?

హ‌త్య చేసిన వాళ్ల‌కు అన్ని మ‌ర్యాద‌లా?
X

ఏపీలో పోలీసుల తీరుపై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు. పోలీసులు స్వ‌తంత్రంగా వ్య‌వ‌హ‌రించి...చ‌ట్టాన్ని కాపాడాల‌ని అన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు రాజకీయ బాసుల మాటకు తలొగ్గవద్దు అని సూచించారు. నేరాలకు పాల్పడేవారికి వత్తాసు పలికేలా అధికార యంత్రాంగాన్ని పాలకులు వినియోగించుకొంటుంటే ఇక శాంతిభద్రతల గురించి ఆలోచన కూడా చేయలేమ‌ని వ్యాఖ్యానించారు. . కాకినాడలో ఎస్సీ యువకుడు సుబ్రహ్మణ్యం హత్య కేసులో పోలీసుల వ్యవహార శైలి, ఆ హత్య తానే చేశానని ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ ఒప్పుకొన్న తరవాత కూడా అధికారులు అతని పట్ల అత్యంత గౌరవమర్యాదలు కనబరిచిన తీరు చూస్తే విస్మయం కలుగుతోంద‌న్నారు. సామాన్యుల పట్ల కూడా ఇంతే సహృదయత కనబరుస్తారా? ఈ విధమైన తీరుకి పోలీసుల కంటే వారిపై ఆధిపత్యం చలాయిస్తున్న రాజకీయ బాసులే కారణం. కోడి కత్తి కేసులో ఆంధ్రప్రదేశ్ పోలీసులపై నమ్మకం లేదు అన్నవారే ఇప్పుడు ఆ శాఖకు దిశానిర్దేశం చేస్తున్నార‌ని ఎద్దేవా చేశారు. కోడి కత్తి కేసు పురోగతి ఏమిటో తెలియదు. పులివెందులలో వివేకానంద రెడ్డి హత్య కేసు వ్యవహారం గుండె పోటు నుంచి గొడ్డలి పోటు వరకు వెళ్లింది. ఇప్పటికీ సాగుతున్న విచారణలో అసలు దోషులెవరో తేలలేద‌న్నారు.

సోషల్ మీడియాలో పోస్టింగుల పేరుతో జనసేన కార్యకర్తలపై కేసులు బనాయిస్తూ, రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్నారు. ఇవి కేవలం కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఈ రాష్ట్రంలో దాడి చేసినా, హత్యలు చేసినా, అత్యాచారాలు చేసినా ఏం జరగదు అనే ధైర్యం నేరస్తులకు కలగడానికి కారణం- పాలకుల వైఖరే. కోడి కత్తి కేసు, వివేకానంద రెడ్డి హత్య కేసుల్లో అసలు నేరస్తులను పట్టుకొని చట్ట ప్రకారం కఠినంగా వ్యవహరించి ఉంటే, నేరం చేసేవాళ్ళకు పోలీసులపై చులకన భావన, ఏమీ కాదులే అనే ధైర్యం వచ్చి ఉండేవా? అని ప్ర‌శ్నించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణను వైసీపీ పాలకుల నుంచి ఏమీ ఆశించలేం. వారికే చిత్తశుద్ధి ఉంటే- హత్య చేశాను అని ఒప్పుకొన్న ఎమ్మెల్సీపై ఈపాటికే పార్టీపరంగాను, పెద్దల సభ నుంచి పంపేలా చర్యలకు ఉపక్రమించేవారు. కాబట్టి పోలీసు అధికారులే బాధ్యత తీసుకొని రాజకీయ బాసుల ఒత్తిళ్లకు తలొగ్గకుండా శాంతిభద్రతల పరిరక్షణలో స్వతంత్రంగా వ్యవహరించాలి. అప్పుడే ప్రజలకు పోలీసు వ్యవస్థపై, చట్టాలపై విశ్వాసం కలుగుతుందని సూచించారు.

Next Story
Share it