Telugu Gateway
Andhra Pradesh

హరి హర వీర మల్లు సినిమా టికెట్ రేట్లు పెంచుకునేది అలాగే !

హరి హర వీర మల్లు సినిమా టికెట్ రేట్లు పెంచుకునేది అలాగే !
X

జనసేన అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అసలు విషయం చెప్పేశారు. తన కొత్త సినిమా టికెట్ రేట్లు పెంచుకునే మోడల్ ఏంటో కూడా ఆయనే అధికారికంగా వెల్లడించారు. తన సినిమా అయినా సరే టికెట్ ధరల పెంపు కావాలంటే ఫిల్మ్ ఛాంబర్ ద్వారానే ప్రభుత్వాన్ని సంప్రదించాలి అన్నారు. రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తుంది అని వెల్లడించారు. అంటే హరి హర వీర మల్లు సినిమా టికెట్ రేట్లు ఎలా పెంచుకోబోతున్నది ఆయన క్లారిటీ ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ థియేటర్లు మూసివేస్తున్నారు అనే వార్తలు వచ్చిన వెంటనే ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ టాలీవుడ్ రిటర్న్ గిఫ్ట్ కు థాంక్స్ అంటూ స్పందించిన విషయం తెలిసిందే. అదే సమయంలో ఇక నుంచి వ్యక్తిగత సంప్రదింపులకు ఛాన్స్ ఉండదు అని ప్రకటించారు. తన సినిమాకు నేరుగా రేట్లు పెంచుకుంటే విమర్శలు వస్తాయనే పవన్ కళ్యాణ్ ఇక నుంచి పరిశ్రమ తరపున అధికారికంగా వస్తేనే రేట్లు పెంచుతాం అనే మోడల్ ను సడన్ గా తెరమీదకు తెచ్చారు.

ఇదే విషయాన్ని టాలీవుడ్ వర్గాలు వెల్లడిస్తే..తెలుగు గేట్ వే . కామ్ సోమవారం నాడే..అమ్మ పవనా..ఇంత ప్లాన్ ఉందా అంటూ అసలు విషయాన్ని బహిర్గతం చేసింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అదే విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. మంగళవారం నాడు ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ఇదే అంశంపై ఒక ప్రకటన విడుదల చేసింది. అందులోని విషయాలు ఇలా ఉన్నాయి. ‘ కొత్త చిత్రాలు విడుదల సందర్భంలో టికెట్ ధరల పెంపు నిమిత్తం నిర్మాతలు, వారికి సంబంధించినవారు వ్యక్తిగత హోదాలో కాకుండా తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి ద్వారానే ప్రభుత్వాన్ని సంప్రదించే విధానాన్ని అమలు చేయాలని పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ సినిమాలు హాళ్ల బంద్ ప్రకటనలు, ఈ క్రమంలో తమ శాఖ ద్వారా చేపట్టిన చర్యలను, తాజా పరిణామాలను ఉప ముఖ్యమంత్రికి వివరించారు.

రాష్ట్రంలో సినిమా హాళ్ల నిర్వహణను పకడ్బందీగా చేపట్టడం ద్వారా ప్రేక్షకులకు మెరుగైన సేవలు అందించాలని... ఆ దిశగా సంబంధిత ప్రభుత్వ శాఖలు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. టికెట్ ధర కంటే సినిమా హాల్లో పాప్ కార్న్ లాంటి తినుబండారాలు, శీతల పానీయాలు, చివరకు మంచి నీళ్ల సీసాల ధరలు సైతం భారీగా ఉండటంపై ఈ సందర్భంగా చర్చించారు. వాస్తవంగా వాటి ధరలు ఎంత ఉంటున్నాయి, ఎంతకు విక్రయిస్తున్నారు, అసలు వాటిలో ఉండే నాణ్యత ప్రమాణాలు ఏమిటనేది కూడా సంబంధిత శాఖల అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి ధరల నియంత్రణ కూడా చేపట్టాలని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మల్టీప్లెక్సులు, సింగిల్ స్క్రీన్స్ లో ఆహార పదార్థాలు, శీతల పానీయాల వ్యాపారంలోను గుత్తాధిపత్యం సాగుతోందనే విషయం కూడా ప్రభుత్వ దృష్టికి వచ్చినందున దీనిపై విచారణ చేపట్టాలని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రికి సూచించారు. ప్రేక్షకులు కుటుంబ సమేతంగా సినిమా హాలుకు రావాలంటే తినుబండారాలు, పానీయాల ధరలు చూసి వెనుకంజ వేసే పరిస్థితి రాకూడదని ఉప ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.’ అని తెలిపారు.

Next Story
Share it