Telugu Gateway
Andhra Pradesh

దుబ్బాక ఉప ఎన్నికపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు

దుబ్బాక ఉప ఎన్నికపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు
X

చిరంజీవి సీఎంఅయ్యేవారు

సీమెంట్ ఫ్యాక్టరీ కోసం..ఇసుక అమ్ముకోవటానికి సీఎం అవ్వాలనుకోలేదు

ఏపీలో నివర్ తుఫాన్ బాధిత రైతులను పరామర్శిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దుబ్బాక ఉప ఎన్నికకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు రైతులకు ప్రభుత్వం నుంచి ఎంతో కొంత సాయం అందుతుంది. కానీ కౌలు రైతులకు మాత్రం అలాంటి సాయం అందడం లేదు. తెలంగాణలో దుబ్బాక ఉప ఎన్నికల్లో ప్రభుత్వం ఓడిపోవడానికి ఒక కారణం కూడా కౌలు రైతులను విస్మరించడమే. క్షేత్రస్థాయి పర్యటనలు చేసినప్పుడు చాలా మంది కౌలు రైతులు నా దగ్గరకు వచ్చి ప్రభుత్వాలు మమ్మల్ని పట్టించుకోవడం లేదని వాపోయారు. భవన నిర్మాణ కార్మికులకు జనసేన పార్టీ ఎంత అండగా నిలిచిందో అదే విధంగా చివరి కౌలు రైతుకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తుందని తెలిపారు. లక్షల ఎకరాల్లో రైతులు పంటలు నష్టపోతే రూ. 5 వేలు, రూ. 10 వేలు ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకోవాలని చూస్తోంది. అది సరైన పద్దతి కాదు. ప్రభుత్వం దగ్గర చాలా నిధులు ఉన్నాయి. మద్యం, ఇసుక వ్యాపారం ప్రభుత్వమే చేసి ఇబ్బడి ముబ్బడిగా సంపాదిస్తోంది.

మరి.. అన్నం పెట్టే రైతులకు నష్టపరిహారం ఇవ్వడానికి ఎందుకు ఆలోచిస్తోంది? పంట నష్టపోయిన రైతుకు ఎకరాకు రూ. 35 వేలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాం. ఈ డిమాండ్ రాజకీయ లబ్ధి కోసం చేసింది కాదు. క్షేత్రస్థాయి పర్యటన చేసినప్పుడు ఎకరా పంట వేయడానికి రూ. 40 నుంచి రూ. 50 వేలు పెట్టుబడి అవుతుందని రైతులు చెప్పారు. అందుకే నష్టపరిహారం రూ. 35 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాం. 48 గంటల్లో కనీసం రూ. 10 వేలు ముందస్తు సాయం అందించాలని కోరాం. రూ. 10 వేలు ఇవ్వాలని అడగడం వెనక కూడా కారణం ఉంది. ప్రభుత్వం డిసెంబర్ 25 తర్వాత నష్టపరిహారం అందిస్తామని చెబుతోంది. ఇప్పటికే నలుగురు రైతులు ఆత్మహత్యలు చేసుకొని చనిపోయారు. రైతుల ఆత్మహత్యలు ఆగాలంటే ముందస్తుగా పంట నష్టపోయిన ప్రతి రైతుకు రూ. 10 వేలు అందించాలని కోరాం. అంతకు ముందు కార్యకర్తల సమావేశంలో పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 'చిరంజీవి ఇప్పటికీ రాజకీయాల్లో ఉండి ఉంటే.. ఇప్పుడు ముఖ్యమంత్రి అయి ఉండేవారు. అధికారం మనకు బాధ్యత, అలంకారం కాదు. అజమాయిషీ చేయటానికి అధికారం అని ఇప్పుడు అనుకుంటున్నారు. వైసీపీకి ఓటు వేసిన ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి.

భవిష్యత్తులో అలాంటి తప్పులు జరగకుండా చూసుకోవాలి. సిమెంటు ఫ్యాక్టరీ కోసమో, ఇసుక అమ్ముకోవటానికో, మద్యం అమ్ముకోవటానికో నేను సీఎం అవ్వాలనుకోలేదు' అని చెప్పారు. 'పవన్ సెల్ఫీ తీసుకోక పోతే ఓటు వేయనని నన్ను బెదిరించకండి. నేను మీ కోసం వచ్చాను. నన్ను పని చేసుకోనివ్వండి. ఫొటో తీసుకోలేదని నాపైన కోపం చూపించకండి. మిగిలిన వారు 25 కేజీలు బియ్యం ఇవ్వాలని చూస్తున్నారు. నేను 25 సంవత్సరాల భవిష్యత్తును ఇవ్వాలని చూస్తున్నాను. రైతు విలువ తెలియాలంటే ప్రతి ఒక్కరు ఒక గింజను నాటి మొక్కను సంరక్షించి చూడాలి. రైతుల కోసం, అమరావతి రైతు కోసం లాఠీలు విరివిగా ముందుకు వెళ్లటానికి సిద్ధంగా ఉన్నాను. రైతు కోసం, కౌలు రైతు కోసం జై కిసాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. కార్యాచరణను త్వరలో ప్రకటిస్తాం. మిగిలిన రాజకీయ నేతల్లా నాకు సిమెంట్ ఫ్యాక్టరీలు లేవు. మీడియా సంస్థలు లేవు. అందుకే సినిమాల్లో నటిస్తున్నాను' అని పవన్ వెల్లడించారు.

Next Story
Share it