అతి తక్కువ సమయంలో ఎంత మార్పో!
‘కుటుంబ పాలన నాకు ఇష్టం లేదు. నిజంగా కుటుంబము అంతా సేవ చేయాలంటే వెనక ఉండి చేయవచ్చు. చాలా సేవ చేయోచ్చు. అందరూ చట్ట సభల్లోకి రావాల్సిన అవసరం లేదు. దాని బదులు చాలా మంది కొత్తవాళ్లు రావొచ్చు. మీలాంటి దేశం కోసం పాటు బడిన యువకులను ఎంతో మందిని రాజకీయాల్లోకి తీసుకురావొచ్చు. ఎంతసేపూ నా ఇంట్లో వాళ్లే. నా కూతురు. నా కొడుకు. నేను, మా మేనళ్ళుల్లు అంటే కుదరదు. ’ ఇవీ ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గతంలో ఒక బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలు. కానీ ఇదే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆయన తన అన్న నాగబాబు కు ఎమ్మెల్సీ అవకాశం కలిపించారు. ఎమ్మెల్సీ గా ఎన్నికైన తర్వాత ఆంధ్ర ప్రదేశ్ క్యాబినెట్ లో ఆయన మంత్రి కూడా కాబోతున్న విషయం తెలిసిందే.
బహిరంగ వేదికలపై అప్పటి అవసరాల కోసం ఏదో ఒకటి చెప్పటం....ఆ తర్వాత పూర్తిగా వాటికి భిన్నమైన నిర్ణయాలు తీసుకోవటంలో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముందు వరసలో ఉంటారు. ఇప్పుడు ఆయనతో కలిసి కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు స్కూల్ లో చేరిపోయినట్లే కనిపిస్తోంది. అందుకే ఆయన గతంలో చేసిన ప్రకటనలకు పూర్తి భిన్నంగా ఇప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. వాస్తవానికి నాగబాబు ను రాజ్య సభకు పంపించాలని నిర్ణయించగా సీట్ల సర్దుబాటులో భాగంగా అది సాధ్యం కాలేదు. దీంతో చంద్రబాబు ఏకంగా ఎమ్మెల్సీ చేసి..మంత్రి పదవి కూడా ఇస్తానని టీడీపీ లెటర్ హెడ్ మీద ప్రకటించాల్సి వచ్చింది.
తన అన్నకు ఎమ్మెల్సీ, మంత్రి పదవి అంశంపై గతంలో ఒక సారి మీడియా తో మాట్లాడిన పవన్ కళ్యాణ్ పార్టీ కోసం ఎంతో కష్టపడినందునే ఆయనకు అవకాశం కలిపిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. జనసేన లో కష్టపడింది అంటే ఒక్క పవన్ కళ్యాణ్...నాగబాబులేనా..ఇతరులు ఎవరూ లేరా అన్న ప్రశ్న తలెత్తక మానదు. అంతే కాదు..పదవులు అన్ని కుటుంబ సభ్యులకు ఇవ్వటం సరికాదు...వారసత్వ రాజకీయాలను ఒక్క దెబ్బతో కూల్చినందునే తనకు మోడీ అంటే ఎంతో ఇష్టం అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ ఇప్పుడు అన్నను ఎమ్మెల్సీ చేయటంతో పాటు మంత్రిని చేయటానికి కూడా రెడీ అవుతున్నారు. అతి తక్కువ సమయంలోనే పవన్ కళ్యాణ్ మాటలు మార్చటంతో పాటు ...చంద్రబాబు మోడల్ రాజకీయాలను బాగా ఒంటబట్టించుకున్నారు అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.