Telugu Gateway
Andhra Pradesh

అవసరానికో మాట..ఇదేనా క్రెడిబిలిటీ!

అవసరానికో మాట..ఇదేనా క్రెడిబిలిటీ!
X

తమిళనాడు లో సంస్కృతాన్ని తిడుతున్నారు. దక్షిణాదిపై హిందీని రుద్దుతున్నారు అని మాట్లాడుతున్నారు. అలాంటప్పుడు తమిళ్ సినిమాలను హిందీ లో డబ్ చేయవద్దు. మీకు డబ్బులేమో ఉత్తర ప్రదేశ్, బీహార్ రాష్ట్రాల నుంచి కావాలా?. హిందీ మాత్రం వద్దా. ఇదేమి న్యాయం. ఇవీ జనసేన అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శుక్రవారం నాడు పిఠాపురంలో జరిగిన జనసేన జయకేతనం సభలో చేసిన వ్యాఖ్యలు. తమిళనాడులో డీఎంకె, ముఖ్యమంత్రి స్టాలిన్ డిమాండ్స్ లో న్యాయం..హేతుబద్దత ఉందా లేదా అన్న సంగతి ఇక్కడ డిబేట్ చేయటంలేదు. ఇదే పవన్ కళ్యాణ్ 2017 ఏప్రిల్ 23 న ఆంధ్ర జ్యోతి పత్రికలో హిందీ గోబ్యాక్ అంటూ చలసాని నరేంద్ర రాసిన ఆర్టికల్ ను ఇంగ్లీష్ లోకి ట్రాన్స్ లేట్ చేసి మరీ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.

ఉత్తరాది రాజకీయ నాయకత్వం మన దేశంలోని సాంస్కృతిక వైవిధ్యాన్ని అర్ధం చేసుకుని గౌరవించాలి అంటూ ట్వీట్ చేశారు. ఈ ఆర్టికల్ లో ప్రధానంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం హిందీ భాషను రాష్టాలపై బలవంతంగా రుద్దుతోంది అనే అంశంపైనే వ్యాసకర్త రాశారు. రాష్ట్రాలపై హిందీని రుద్దే ప్రయత్నం చేస్తే ఏభై ఏళ్ళ క్రితం చెలరేగిన బాషా విద్వేషాలను మళ్ళీ రెచ్చగొట్టినట్లు అవుతుంది అని అందులో పేర్కొన్నారు.

గతంలో హిందీని రాష్ట్రాలపై రుద్దటం తప్పు అన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు బీజేపీ తో కలిసి ఉన్నారు కాబట్టి రివర్స్ గేర్ వేశారు. తనకు ఏ రాష్ట్రం పోయినా ఆదరణ దక్కుతోంది అని ఆయన నిన్నటి సభలో చెప్పుకున్నారు పవన్ . అందులో భాగంగానే అయన త్వరలో జరగనున్న తమిళ నాడు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ కి ప్రచారం చేయటానికి సిద్ధం అవుతున్నారు. దీని కోసమే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. అందుకే జనసేన సభను డీఎంకే ను టార్గెట్ చేయటానికి వాడుకున్నారు. కానీ శనివారం ఉదయం నుంచి పవన్ కళ్యాణ్ గతంలో చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

Next Story
Share it