Telugu Gateway
Andhra Pradesh

పవన్ కళ్ళల్లో ఆనందం కోసం...వర్మపై వేటు!

పవన్ కళ్ళల్లో ఆనందం కోసం...వర్మపై వేటు!
X

ఎమ్మెల్సీ హామీ హుళక్కి...ఇప్పుడు ఇంచార్జి పోస్ట్ కూడా!

తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయం జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కళ్ళల్లో ఆనందం చూడటం కోసం తీసుకున్నారా?. లేక పార్టీ ప్రయోజనాల కోణంలో తీసుకున్నారా?. ఇదే ఇప్పుడు తెలుగు దేశం శ్రేణుల్లో సాగుతున్న చర్చ. ఎందుకంటే పిఠాపురం వర్మకు తెలుగు దేశం అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం నాడు బిగ్ షాక్ ఇచ్చారు. ఆయన్ను పిఠాపురం నియోజకవర్గ ఇంచార్జి బాధ్యతల నుంచి తప్పించారు. పొత్తులో భాగంగా పిఠాపురం సీటు ను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కేటాయించిన విషయం తెలిసిందే. ఆ సమయంలోనే చంద్రబాబు వర్మకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల సమయంలో కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా తన గెలుపు బాధ్యతను అంతా వర్మపై పెడుతున్నట్లు వ్యాఖ్యానించారు. గెలిచిన తర్వాత పవన్ నేరుగా ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోయినా అయన సోదరుడు..ఎమ్మెల్సీ నాగబాబు మాత్రం పిఠాపురం టీడీపీ ఇంచార్జి గా ఉన్న వర్మపై ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ పిఠాపురం గెలుపులో కీలకం పవన్ కళ్యాణ్..ఇక్కడి ఓటర్లు, జనసైనికులు అని...అలా కాకుండా తామే పవన్ కళ్యాణ్ ను గెలిపించాం అనుకుంటే వాళ్ళ ఖర్మ అంటూ వర్మ ను టార్గెట్ చేసుకుని విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఇది అప్పటిలో పెద్ద దుమారం రేపింది.

చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చిన విధంగా వర్మకు ఎమ్మెల్సీ పోస్ట్ ఇవ్వకపోగా ...ఇప్పుడు ఏకంగా ఆయన్ను పిఠాపురం ఇంచార్జి బాధ్యతల నుంచి తప్పించారు. పిఠాపురారం పార్టీ వ్యవహారాల కోసం ఒక కమిటీని ఏర్పాటు చేయబోతున్నట్లు చెపుతున్నారు. ఇటీవల పిఠాపురం లో ఫ్లెక్సీ ల విషయంలో వివాదం రేగిన సంగతి తెలిసిందే. దీనిపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు మీడియా లో వార్తలు కూడా వచ్చాయి. జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను సంతృప్తి పరచటం కోసమే చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది అనే విమర్శలు టీడీపీ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. చంద్రబాబు నిర్ణయాలు ఎప్పుడైనా ఇలాగే ఉంటాయి అని...పార్టీ కోసం పనిచేసిన వాళ్ళ కంటే తనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవటాని కే అయన ప్రాధాన్యత ఇస్తారు అని ఒక టీడీపీ సీనియర్ నేత వ్యాఖ్యానించారు.

ఇక్కడ మరో కీలక విషయం ఏమిటి అంటే తన గెలుపులో సహకరించిన వర్మకు ఎమ్మెల్సీ పదవి ఇప్పించే విషయంలో పవన్ కళ్యాణ్ కూడా మాట మాత్రం కూడా సాయం చేయలేదు అనే విమర్శలు ఉన్నాయి. చంద్రబాబే పట్టించుకోకపోతే పవన్ కళ్యాణ్ ఎందుకు పట్టించుకుంటాడు అనే వ్యాఖ్యలు కూడా టీడీపీ వర్గాల నుంచే వినిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందరూ తనలా...పవన్ కళ్యాణ్ లా కలిసి మెలిసి ఉండాలి అంటూ చెపుతున్న్నారు. దీనికి ప్రధాన కారణం పలు చోట్ల జనసేన నాయకులు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తమను ఏ మాత్రం పట్టించుకోవటం లేదు అనే అసంతృప్తితో ఉన్నారు. ప్రధానంగా కీలక స్థానాల్లో ఉన్న వాళ్ళు ఎవరి వ్యవహారాలు వాళ్ళు చూసుకుంటున్నారు కానీ పార్టీ కోసం పని చేసిన వాళ్ళను పట్టించుకోవటం లేదు అనే కారణంతోనే ఎక్కువ మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Next Story
Share it