Telugu Gateway
Andhra Pradesh

ప‌వ‌న్ క‌ళ్యాణ్ 'అందులో మాత్రం స‌క్సెస్'!

ప‌వ‌న్ క‌ళ్యాణ్  అందులో మాత్రం స‌క్సెస్!
X

దేశంలోని దిగ్గ‌జ పారిశ్రామిక సంస్థ‌లు కూడా ప్ర‌చారానికి సెల‌బ్రిటీల‌ను డ‌బ్బులిచ్చి మ‌రీ తెచ్చుకుంటాయి.టాప్ సెల‌బ్రిటీల‌కు అయితే ఈ చెల్లింపులు కోట్ల‌లోనే ఉంటుంది.ఈ సోష‌ల్ మీడియా యుగంలో అయితే ఇన్ స్టాగ్రామ్..ఫేస్ బుక్ ల వంటి వాటిలో పోస్టులు పెట్టినందుకూ డ‌బ్బులు వ‌సూలు చేస్తారు. సినిమా న‌టులు రాజ‌కీయాల్లోకి వ‌స్తే వాళ్ల‌కు ఒక విష‌యంలో మాత్రం కొంత సౌలభ్యం ఉంటుంది. ఫ‌క్తు రాజ‌కీయ పార్టీల త‌ర‌హాలో ప్ర‌జ‌ల‌ను స‌మీక‌రించేందుకు అంత‌గా క‌ష్ట‌ప‌డాల్సిన ప‌ని ఉండ‌దు. కానీ రాజ‌కీయంగా ఫ‌లితాలు మాత్రం అందుకు భిన్నంగానే ఉంటాయి. మీటింగ్ ల‌కు అయితే జ‌నం వ‌స్తారు...చూస్తారు..వింటారు వెళ‌తారు. అయితే వీరు చెప్పే విష‌యాల మాత్రం జ‌నంలోకి బాగా వెళ‌తాయి. రాజ‌కీయ నాయ‌కులు చెప్పే వాటి కంటే పాపుల‌ర్ హీరోలు చెప్పే మాట‌లు మ‌రింత వేగంగా ప్ర‌జ‌ల్లోకి దూసుకెళ‌తాయి. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ విష‌యంలో కూడా గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ అదే జ‌రిగింది. జ‌న‌సేన గ‌త ఎన్నిక‌ల్లో ఒంట‌రిగానే బ‌రిలోకి దిగింది..ఒక్క‌టంటే ఒక్క సీటు ద‌క్కించుకుంది. కానీ ఎన్నిక‌ల‌కు ముందు అప్ప‌టి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు, టీడీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ ల‌పై చేసిన ఇసుక దందా విమ‌ర్శ‌ల‌తోపాటు రాజ‌ధానిపై ఆయ‌న చేసిన విమ‌ర్శ‌లు ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా వెళ్లాయి. ఆ ప్ర‌భావం ఆ ఎన్నిక‌ల్లో బాగానే ప‌డింది. వైసీపీ చేసిన విమ‌ర్శ‌ల కంటే ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేసిన విమ‌ర్శలు తీవ్ర ప్ర‌భావం చూపించాయి.

ఇది అంతా పాత విష‌యం. తాజాగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికార వైసీపీకి 45 నుంచి 67 సీట్లు మాత్ర‌మే వ‌స్తాయంటూ స‌ర్వేలు చెబుతున్నాయ‌ని వ్యాఖ్యానించి క‌ల‌క‌లం రేపారు. ఇది ఖచ్చితంగా వైసీపీకి రాజ‌కీయంగా డ్యామేజ్ చేసే అంశమే. ఎందుకంటే ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌ల రీచ్ ఎక్కువ‌గా ఉంటుంది..ఎక్కువ‌గా చ‌ర్చనీయాంశంగా మారుతుంది. అయితే ఆయ‌న వ్యాఖ్య‌ల ప్ర‌భావం జ‌న‌సేన‌కు లాభిస్తుందా..లేక తెలుగుదేశం పార్టీకి లాభం చేకూర్చిపెడుతుందా అంటే అది ఎన్నిక‌ల స‌మ‌యంలోనే తేలుతుంది. అదే స‌మ‌యంలో సీఎం జ‌గ‌న్ రాజ‌ధానిపై మాట‌లు మార్చిన...మోసం చేసిన‌ అంశాన్ని కూడా ప‌వ‌న్ కళ్యాణ్ గట్టిగానే విన్పించారు. ప‌వ‌న్ పాపుల‌ర్ హీరో కావ‌టంతో ఇవి ప్ర‌జ‌ల్లోకి చాలా వేగంగా వెళ‌తాయి. టీడీపీ చేసే ప్ర‌చారం కంటే ప‌వ‌న్ వ్యాఖ్య‌లు ప్ర‌జ‌ల‌కు త్వ‌ర‌గా చేరువ అవుతాయ‌ని చెప్పొచ్చు. అందుకే అలా ప‌వ‌న్ వైసీపీ సీట్ల గురించి ప్ర‌స్తావించిన వెంటనే మాజీ మంత్రి పేర్ని నాని రంగంలోకి దిగి కౌంట‌ర్ ఇచ్చారు. కొత్త రాజ‌కీయ చిల‌క అంటూ వైసీపీ సీట్లు స‌రే..ఈ జోస్యం చెప్పిన చిల‌క జ‌న‌సేన ఎన్ని సీట్ల‌లో పోటీచేస్తుందో చెప్ప‌లేదా అంటూ ఎద్దేవా చేశారు. లేక చంద్ర‌బాబు ఎన్ని ఇస్తే అన్ని సీట్ల‌లో పోటీచేస్తారా అంటూ కౌంట‌ర్ ఇచ్చారు. మొత్తానికి ప‌వ‌న్ క‌ళ్యాణ్ చెప్పిన సీట్ల లెక్క ఏపీలో రాజ‌కీయంగా హాట్ టాపిక్ గా మారింద‌నే చెప్పాలి.

Next Story
Share it