విజయాల కంటే విమర్శలే ఎక్కువ!

గత ఏడాది జరిగిన ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన ఒక సంచలనం. పోటీ చేసిన 21 సీట్లలో 21 సీట్లు గెలిచి వందకు వంద శాతం స్ట్రైక్ రేట్ తో దేశ రాజకీయాల్లో ఒక చరిత్ర సృష్టించారు పవన్ కళ్యాణ్. ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ లు కూటమిగా పోటీ చేసిన సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్...మొన్నటి ఎన్నికల్లో తొలి సారి పిఠాపురం నుంచి ఎమ్మెల్యే గా గెలవటమే కాకుండా ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అత్యంత కీలకమైన పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్ మెంట్ శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మరి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా సక్సెస్ అయ్యారా?. ఆయన పని తీరు ఎలా ఉంది? అన్న చర్చ జరగటం సహజం. ఏ ప్రభుత్వంలో అయినా కూడా పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు ఎంతో కీలకం.
ఈ కీలక శాఖల బాధ్యతలు చూస్తున్న పవన్ కళ్యాణ్ రాష్ట్రంలోని 13,326 గ్రామ పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించి పలు అభివృద్ధి పనులకు ఆమోదం పొందేలా చేయటం ద్వారా ప్రపంచ రికార్డు సృష్టించారు. దీంతో పాటు పలు గిరిజన తండాల్లో ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్లు వాళ్లకు రహదారి సౌకర్యం కల్పించటంలో కూడా విజయవంతం అయ్యారు. ఇలా కొన్ని విజయాలు ఉంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పని తీరుపై విమర్శలే ఎక్కువ ఉన్నాయని చెప్పొచ్చు. ఈ ఏడాది కాలంలో ఆయన నికరంగా మూడు నెలలు పని చేసి ఉంటే గొప్పే అన్న అభిప్రాయం కొంత మంది జనసేన నేతల్లోనే ఉంది. వివిధ కారణాలతో ఆయన అసెంబ్లీ సమావేశలకు ..క్యాబినెట్ సమావేశాలకు..కలెక్టర్ల సమావేశాలకు కూడా డుమ్మాకొట్టి వార్తల్లో నిలిచారు. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ వంటి కీలక శాఖ చూసే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికార పార్టీ ఎమ్మెల్యేలకు కూడా ఈ ఏడాది కాలంలో ఏ మాత్రం అందుబాటులో లేరు అనే ఫిర్యాదు ఉంది. ఎమ్మెల్యేలు ఎవరైనా ఈ శాఖలో ఎలాంటి పని ఉన్నా అధికారులతో మాట్లాడుకోవాలి కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో మాట్లాడటం జరిగే పని కాదు అని కూటమిలో ప్రధాన భాగస్వామిగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలు కూడా చెపుతున్నారు.
ఒక్క టీడీపీ ఎమ్మెల్యేలే కాదు..జనసేన కు చెందిన సొంత పార్టీ ఎమ్మెల్యేలకు కూడా ఆయన సమయం ఇచ్చింది లేదు అని ఒక జనసేన కీలక నేత వెల్లడించారు. మరో వైపు పవన్ కళ్యాణ్ శాఖకు చెందిన వేల కోట్ల రూపాయల పనుల వ్యవహారాల్లో బయటి వ్యక్తుల ప్రమేయం ఎక్కువ ఉంది అనే ప్రచారం అధికార వర్గాల్లో కూడా ఉంది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు కూడా వెల్లువెత్తాయి. బయట ఆఫీస్ లు పెట్టి మరీ ఈ శాఖ వ్యవహారాల్లో ప్రైవేట్ వ్యక్తుల తలదూరుస్తున్నట్లు ఎప్పటి నుంచో విమర్శలు ఉన్నాయి. కొద్ది నెలల క్రితం ఉప ముఖ్యమంత్రి గా ఉన్న పవన్ కళ్యాణ్ ఒక సారి హోమ్ మంత్రి అనిత పని తీరుపై బహిరంగంగా విమర్శలు చేసి..ఇలాగే ఉంటే తాను హోమ్ మంత్రిత్వ శాఖ తీసుకోవాల్సి ఉంటుంది అని వ్యాఖ్యానించి పెద్ద దుమారానికి కారణం అయిన సంగతి తెలిసిందే.
ఈ ఏడాది కాలంలో ఆయన క్యాంపు కార్యాలయంలో ఉండటం తప్ప..సచివాలయంలో తన ఛాంబర్ కు వచ్చి విధులు నిర్వహించిన దాఖలాలు అతి తక్కువే అని చెప్పొచ్చు. జిల్లా పర్యటనలు..శాఖా సమీక్షలు కూడా ఎప్పుడో తనకు నచ్చినప్పుడు అన్నట్లు సాగుతున్నాయని ఆ శాఖ వర్గాలు చెపుతున్నాయి. మరో కీలక అంశం ఏమిటి అంటే పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్న తీరు ఒక ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిలాగా కాకుండా ...తన సామ్రాజ్యం తనదే అన్నట్లు ఉంది అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.