Telugu Gateway
Andhra Pradesh

ఆ ఫలితమే ఇది

ఆ ఫలితమే ఇది
X

వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఈ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయంపై ఇప్పటికైనా నిజాయతీగా ఆత్మవిమర్శ చేసుకుంటారా?. ఇదే ఇప్పుడు వైసీపీ నేతలను వేధిస్తున్న ప్రశ్న. గత ఐదేళ్ల కాలంగా జగన్ పార్టీ ని ఐ ప్యాక్ కు...ప్రభుత్వాన్ని సజ్జల రామకృష్ణారెడ్డికి అప్పగించేసి తాడేపల్లి లో సేదతీరటం వల్లే ఈ పరిస్థితి ఎదురైంది అని వైసీపీ నేతలు చెపుతున్నారు. ప్రభుత్వంలోని సీనియర్ మంత్రులను కూడా పక్కన పెట్టి జగన్ అన్ని విషయాల్లోనూ సజ్జలనే ముందు పెట్టారు. పేరుకు సామాజిక కోణంలో పలువురికి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చినా కూడా వాళ్లకు ఎలాంటి అధికారాలు లేవు అనే విషయం బహిరంగ రహస్యమే. బొత్స సత్యనారాయణ వంటి మంత్రులు రాజశేఖర్ రెడ్డి క్యాబినెట్ లో మంత్రులుగా పని చేసి ప్రభుత్వ నిర్ణయాలపై క్యాబినెట్ లో గట్టిగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. కానీ జగన్ దగ్గరకు వచ్చేటప్పటికి బొత్స లాంటి నాయకులకు కూడా జగన్ దగ్గర నోరు విప్పే ఛాన్స్ లేకుండా పోయింది. జగన్ ఐదేళ్ల పాలనలో తాను అనుకున్న పనులు చేయటం తప్ప...ప్రజలకు ఏమి కావాలి..వాళ్ళ అవసరాలు ఏంటి అన్న కోణంలో ఎక్కడా ఆలోచించిన దాఖలాలు లేవు. ఎన్నికల ప్రచారంలో జగన్ మీకు మంచి జరిగి ఉంటేనే ఓటు వేయండి అని పదే పదే కోరారు. ఫలితాలను చూసిన తర్వాత అయినా జగన్ కు మరి అసలు విషయం అర్ధం కావాలి. జగన్ మాటల్లోనే చెప్పాలంటే వైసీపీ పాలన వల్ల లాభపడిన వల్ల కంటే బాధ పడ్డ వారే ఎక్కువ అనే విషయం స్పష్టంగా కనిపిస్తోంది.

పాలన అంటే కేవలం బటన్లు నొక్కటం తప్ప మరొకటి ఉండదు అన్నట్లు సాగింది జగన్ తీరు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుక విధానంలో చేసిన తప్పులు ప్రజలపై తీవ్ర ప్రభావమే చూపాయి. చాలా చోట్ల కనీసం చేసుకుందాం అంటే పనులే లేక చాలా మంది వలస పోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. ఇక పార్టీ విషయానికి వస్తే అసలు జగన్ కు..పార్టీ కి కనెక్టవిటీ అన్నది లేకుండా పోయింది. ఐ ప్యాక్ చెప్పిన పనులు చేయటం... పార్టీ సమావేశాలు పెట్టిన సమయంలో కూడా తాను చెప్పాల్సిన మాటలు చెప్పి వెళ్ళిపోవటం తప్ప..జగన్ ఎప్పుడూ జిల్లా అధ్యక్షులతో కానీ..ఇతర కీలక నేతలతో సమావేశం అయింది అతి తక్కువ అనే చెప్పాలి. టికెట్ ల ఖరారు వంటి కీలక సమయాల్లో కూడా పార్టీ నేతల మాటల కంటే ఐ ప్యాక్ సూచించిన వాళ్ళకే ప్రాధాన్యత ఇచ్చినట్లు వైసీపీ వర్గాలు చెపుతున్నాయి. దీంతో అటు జగన్ పార్టీకి..ప్రజలకు డిస్ కనెక్ట్ అయ్యారు అని వైసీపీ నేతలు చెపుతున్నారు. ఓటమి అనంతరం ఇప్పటికే పార్టీ లో అసంతృప్తి స్వరాలు ఒక్కోటిగా బయటకు వస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు.

అధికారంలోకి వచ్చిన జగన్ అటు పార్టీ ని..ప్రజలను వదిలేసి తన పని తాను చేసుకోవటం తప్ప అటు పార్టీ కార్యక్రమాలు ...ఇటు ప్రభుత్వ వ్యవహారాలపై ఫోకస్ పెట్టింది లేదు ప్రభుత్వ కార్యక్రమం అంటే జగన్ దృష్టిలో నవరత్నాల బటన్ నొక్కటమే అన్నట్లు ఐదేళ్ల పాలన సాగింది. ఫలితాలు వెల్లడి అయిన తర్వాత జగన్ మీడియా ముందుకు వచ్చి మాట్లాడినట్లు ఇలా జరుగుతుంది అని...ఫలితాలు ఇలా వస్తాయని ఉహించను కూడా ఊహించలేదు. ఆశ్చర్యంగా కూడా ఉంది. అమ్మ ఒడి అందుకున్న 53 లక్షల మంది తల్లులకు మంచిచేసినాం. మరి అక్క చెల్లెమ్మలు ఓట్లు ఏమి అయ్యాయో తెలియదు. 66 లక్షల మంది అవ్వా, తాతలకు గతం లో ఎప్పుడు జరగని విధంగా మంచి చేశాం. కోటి ఐదు లక్షల పొదుపు సంఘాల అక్కా చెల్లెమ్మలు అన్నిరకాలుగా అండగా ఉన్నాం. మరి వీరి ప్రేమ అభిమానాలు ఏమి అయ్యాయో తెలియదు అంటూ నెపాన్ని వాళ్ళ మీదకే నెట్టి వేస్తారా?. జగన్ మాటలు చూస్తే తానేమి తప్పులు చేయలేదు..ఇంతగా ప్రజలకు మేలు చేసినా కూడా తనను ఓడించారు అన్న చందంగా ఉన్నాయనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తన పాలనలో కోట్ల మందికి మేలు చేశాం అని చెపుతున్న జగన్ ఐదేళ్లలో కొన్నిసార్లు అయినా బయటకు వచ్చి చూసి..ప్రజలతో మాట్లాడి ఉంటే వాస్తవాలు ఏంటో తెలిసి ఉండేవని ఆయన మాటలపై స్పందిస్తున్నారు.

Next Story
Share it