సడన్ గా ఎందుకింత ప్రాధాన్యత!

తెలుగు దేశంలో ఒకప్పుడు పార్టీ కోసం పని చేసిన వాళ్లకు పదవులు దక్కేవి. ఇప్పుడు మోడల్ పూర్తిగా మారిపోయింది. కొత్తతరం రాకతో ఇప్పుడు అన్నీ కొత్త పోకడలు వస్తున్నాయి. ఒక వ్యక్తి పార్టీ కోసం ఎంత కష్టపడ్డాడు...పార్టీ కోసం ఏమి చేశాడు అన్నది ఏ మాత్రం సంబంధము లేకుండా ఇప్పుడు పదవుల కేటాయింపు జరుగుతోంది అనే చర్చ టీడీపీ నాయకుల్లో పెద్ద ఎత్తున సాగుతోంది. అది రాజ్య సభ సభ్యత్వాలు అయినా. ఇతర కీలక పోస్ట్ ల భర్తీలోనూ అదే మోడల్ సాగుతోంది అని చెపుతున్నారు. కొత్తతరం నాయకులు ముఖ్యంగా తాము పదవులు ఇవ్వాలనుకున్న వాళ్ళు తమకు గతంలో ఎలా ఉపయోగపడ్డారు...భవిష్యత్ లో ఎలా ఉపయోగపడతారు అనే కోణంలో ఆలోచించే నిర్ణయం తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది అనే చర్చ పార్టీ నేతల్లో బలంగా సాగుతోంది. గ్లోబల్ ఎన్ఆర్ఐ చీఫ్ గా డాక్టర్ పీ. గురురాజా ను ఇటీవల టీడీపీ నాయకత్వం నియమించింది. విచిత్రం ఏమిటి అంటే ఈ గ్లోబల్ కమిటీలో నియమించిన సభ్యుల్లో సగంమందికి ఆయన ఎవరో తెలియదు అని ఒక సీనియర్ మంత్రి వెల్లడించారు.
ఇక్కడ మరో కీలక విషయం ఏమిటి అంటే ఆయన ఇంత సడన్ గా ఇంత కీలక పదవి దక్కించుకోవటం వెనక చాలా కథ నడిచింది అనే ప్రచారం కూడా పార్టీ వర్గాల్లో బలంగా ఉంది. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ప్రస్తుతం ప్రభుత్వంలో అంతా తానై చక్రం తిప్పుతున్న ఒక కీలక నేత అమెరికా పర్యటనకు వెళ్ళినప్పుడు ఆయన్ను ప్రత్యేక విమానాల్లో తిప్పటంతో పాటు ఆయనపై ప్రత్యేక దృష్టి పెట్టి ఆ పర్యటనలో అంతా తానే చూసుకోవటంతోనే ఆయనకు ఇప్పుడు కీలక పదవి దక్కింది అనే ప్రచారం కూడా టీడీపీ మంత్రుల్లో ఉంది. ఇప్పుడు కొంత మందికి పదవులు ఇచ్చారు కానీ...పదవి ఇవ్వకముందు నుంచే కొంత మంది ఎన్ ఆర్ఐ ల కు చెందిన టీంలు ఆంధ్ర ప్రదేశ్ లో ఇసుక దందాలు చేయటంతో పాటు కీలక బదిలీల వ్యవహారంలో జోక్యం చేసుకుంటూ కోట్ల రూపాయలు వెనకేసుకుంటున్నట్లు ఒక సీనియర్ మంత్రి వెల్లడించారు. దీంతో పాటు ఎన్ఆర్ ఐ కమిటిలోని కొంత మందిని ఆ కీలక నాయకుడు తన అవినీతి సొమ్మును పార్క్ చేసుకునేందుకు కూడా వాడుకుంటున్నారు అని టీడీపీ నాయకుల్లోనే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
ఇక్కడ మరో కీలక విషయం ఏమిటి అంటే ఇప్పుడు గ్లోబల్ ఎన్ఆర్ఐ కమిటీలో కీలక స్థానాలు దక్కించుకున్న వాళ్ళు కొంత మంది ఇప్పటికే ఆ కీలక నేతకు సన్నిహితంగా ఉన్న ఏపీఎన్ఆర్ టి లో ఉన్న వాళ్ళతో కలిసి వ్యాపారాలు కూడా చేస్తున్నట్లు చెపుతున్నారు. ఇది అంతా కూడా ఆ కీలక నాయకుడి కనుసన్నల్లోనే సాగుతోంది చెపుతున్నారు. ఇక్కడ మరో కీలక విషయం ఏమిటి అంటే ఇటీవల టీడీపీ అధిష్ఠానం టీడీపీ గ్లోబల్ కమిటి ని ప్రకటించింది. ఈ విషయంలో ఎన్ఆర్ఐ గా ఉండి టీడీపీ లో చేరి గుంటూరు ఎంపీ గా గెలిచి..ప్రస్తుతం కేంద్ర మంత్రి గా ఉన్న పెమ్మసాని చంద్రశేఖర్ ను మాట మాత్రంగా కూడా ఎవరూ ఈ విషయంలో సంప్రదించలేదు అని పార్టీ వర్గాలు చెపుతున్నాయి. ఆయన పార్టీకి ఆర్థికంగా..అన్ని విధాలుగా సహకరించినా కూడా ఎన్ ఆర్ఐ కమిటి విషయంలో మాటమాత్రం గా కూడా అయన తో మాట్లాడలేదు అని టీడీపీ సీనియర్ నేతలు చెపుతున్నారు. పదవులు ఎవరికీ ఇవ్వాలన్నది పూర్తిగా అధిష్ఠానం నిర్ణయమే అయినా కూడా కొన్ని కొన్ని విషయాల్లో గతం లో ఉండే పద్ధతులు ఇప్పుడు పూర్తిగా మారిపోయాయి అని ఎక్కువ మంది టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. గతంలో కొంత మంది ఎన్ఆర్ఐ లు టికెట్ లు ఆశించి పార్టీకి ఆర్థికంగా అండదండలు అందించటంతో పాటు ఎన్నికల సమయంలో కూడా కొంత పని చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు కొంత మంది ఎన్ ఆర్ఐ లు కీలక నేతలతో కలిసి అక్రమ దందాలు చేస్తూ కోట్లు గడిస్తున్నారు అని...ఇది అంతా కూడా ప్రభుత్వంలో ఉండే పెద్దలకు తెలిసే జరుగుతుంది అని టీడీపీ వర్గాలు చెపుతున్నాయి.



