పవన్..నాదెండ్ల, సత్యకుమార్ లకు ఇది తెలియదా?!

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి గురించి టీడీపీ మంత్రులు ప్రశ్నిస్తే వెంటనే వాళ్ళ పదవులు పోతాయి. అందుకే వాళ్ళు ఎప్పుడూ అంత సాహసం చేయరు. ఏదైనా ఉంటే ప్రైవేట్ సంభాషణల్లో మాట్లాడతారు తప్ప..అధికారికంగా మాట్లాడే ప్రయత్నం చేయరు. మాట్లాడి ఎవరు పదవులు పోగొట్టుకుంటారు. కానీ కూటమిలో భాగస్వాములుగా ఉన్న జనసేన అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రభుత్వంలో జరిగే అన్ని విషయాలపై అవగాహన ఉన్న మరో జనసేన మంత్రి నాదెండ్ల మనోహర్ లు కళ్ళ ముందే క్యాబినెట్ లో ప్రభుత్వం అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటుంటే ఎందుకు మౌనంగా ఉంటున్నట్లు?. దీని వెనక ఉన్న కథ ఏంటి. అన్ని విషయాల్లో అందరూ కూటమిగా..అవినీతికి కూడా ఓకే చేస్తున్నారా అన్న చర్చ అధికార వర్గాల్లో సాగుతోంది. ఒక్క జనసేన మాత్రమే కాదు...బీజేపీ తరపున మంత్రివర్గంలో ఉన్న మంత్రి సత్యకుమార్ కూడా జనసేన, టీడీపీ మంత్రుల తరహాలోనే చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వ తీసుకునే నిర్ణయాలు అన్నిటికి ఓకే చెపుతున్నారా అన్న చర్చ కూడా సాగుతోంది.
ప్రధానంగా ఇటీవల జరిగిన ఆంధ్ర ప్రదేశ్ మంత్రి వర్గ సమావేశంలో తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు పెద్ద దుమారం రేపుతోంది. చంద్రబాబు తొలి టర్మ్ లోనే సగానికిపైగా పూర్తి అయిన ఏపీ సిఆర్ డీఏ భవనం కోసం 160 కోట్ల రూపాయలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. భూమి ఖర్చు లేకుండా రెండున్న లక్షల చదరపు అడుగుల్లో ఒక భవన నిర్మాణానికి ఎలా చూసుకున్నా కూడా ఇంత వ్యయం కాదు అని...గతంలో ఈ భవనంపై చేసిన ఖర్చు కూడా చూసుకుంటే ఇది అవినీతిలో ఒక కొత్త రికార్డు అనే చర్చ అధికార, ఇంజనీరింగ్ వర్గాల్లో సాగుతోంది. మున్సిపల్ శాఖ తాజాగా విడుదల చేసిన జీవోలోనే ఎంతో స్పష్టంగా 160 కోట్ల రూపాయలను అర్చిటెక్చరల్ వర్క్స్ తో పాటు అంతర్గత ఫినిషింగ్ వర్క్స్, మెకానికల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ వర్క్స్ , ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వర్క్స్, సిఆర్ డీ ఏ ఆఫీస్ వెలుపల అభివృద్ధి పనుల కోసం ఈ మొత్తం కేటాయిస్తున్నట్లు స్పష్టంగా పేర్కొన్నారు.
మరి ఇంతటి కీలక విషయంలో క్యాబినెట్ సమావేశంలో అసలు చర్చ జరిగిందా...లేక అంత కలిసి మమ అనిపించి ఈ భారీ అవినీతికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా అన్న చర్చ సాగుతోంది. అమరావతి లో పనుల కేటాయింపు దగ్గర నుంచి అంచనాల పెంపు విషయంలో కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు...విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు అలాంటిది ఒక సిఆర్ డీ ఏ భవనం కోసం ఏకంగా మొత్తం కలిపి రెండు వందల కోట్ల రూపాయల పైన ఖర్చు పెట్టడం అవినీతిలో చరిత్రలో ఒక రికార్డు గా నిలుస్తుంది అనే చర్చ సాగుతోంది. ఈ విషయంలో టీడీపీ మంత్రులు ఏమి మాట్లాడలేదు అంటే ఓకే. కానీ మాట్లాడితే నిజాయతి, నిబద్దత గురించి మాటలు చెప్పే పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, బీజేపీ మంత్రి సత్య కుమార్ లు కూడా ఎందుకు దీనికి ఓకే చెప్పారు అన్నదే ఇప్పుడు కీలకంగా మారింది.



