Telugu Gateway
Andhra Pradesh

వరస కేసులు..టార్గెట్ చంద్రబాబు

వరస కేసులు..టార్గెట్ చంద్రబాబు
X

జగన్ సర్కార్ లిక్కర్ విధానంపై ఆరోపణలు. తెలుగు దేశం అధినేత చంద్రబాబు పై కేసు. అది ఎలా సాధ్యం అంటారా?. ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. ఇది కూడా అలాంటిదే. జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆంధ్ర ప్రదేశ్ లో అమ్ముతున్న మద్యంపై పెద్ద ఎత్తున విమర్శలు ఉన్నాయి. ప్రతిపక్ష టీడీపీ అయితే జె బ్రాండ్స్ తో ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్నారు అంటూ విమర్శలు చేస్తోంది. ఈ బ్రాండ్స్ ద్వారా జగన్ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నట్లు కూడా విమర్శలు చేసింది. తర్వాత తర్వాత జనసేన, బీజేపీ లు కూడా ఈ విషయంలో టీడీపీ తరహాలోనే జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వస్తున్నాయి. తాజాగా ఆంధ్ర ప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అయితే ఆంధ్ర ప్రదేశ్ లోని లిక్కర్ స్కాం పై సిబిఐ తో విచారణ జరిపించాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా కు వినతి పత్రం అందచేశారు. ఆంధ్ర ప్రదేశ్ లో సాగుతున్న లిక్కర్ అమ్మకాలపై బీజేపీ తాజాగా దూకుడు పెంచింది. రాష్ట్రంలోని విపక్షాలు అన్నీ ఆంధ్ర ప్రదేశ్ లో జగన్ సర్కారు పెద్ద ఎత్తున లిక్కర్ స్కాం కు పాల్పడుతోంది అని ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వమే మద్యం అమ్ముతూ ఓన్లీ నగదు లోనే లావాదేవీలు మొత్తం నిర్వహించటంపై కూడా విమర్శలు చాలానే ఉన్నాయి. అసలు గుట్టు అంతా ఇందులోనే ఉంది అనే ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఈ తరుణంలో అకస్మాత్తుగా తెలుగు దేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై మరో కేసు నమోదు అయింది. గత ప్రభుత్వ హయాంలో మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారు అనే అభియోగాలపై ఈ కేసు నమోదు చేశారు.

ఈ ఎఫ్ఐఆర్ లో చంద్రబాబు ను ఏ 3 గా పెట్టారు. ఏ 1 గా ఐ ఎస్ నరేష్, ఏ 2 గా మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఉన్నారు. ఇది కూడా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ బ్రేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ, డిస్టిలరీస్ అండ్ బ్రూవరీస్ కమిషనర్ డీ. వాసుదేవ రెడ్డి ఫిర్యాదు ఆధారంగా సిఐడి తాజా కేసు నమోదు చేసింది. అక్టోబర్ 11 న ఫిర్యాదు అందగా..దీనిపై ఎఫ్ఐఆర్ అక్టోబర్ 28 న నమోదు చేసి...ఏసీబీ కోర్ట్ కి నివేదించారు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్ మెంట్ కేసు లో అరెస్ట్ అయి జైలు లో ఉన్నారు. ఈ కేసు తర్వాత చంద్రబాబుపై వరసగా ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ గ్రిడ్, అసైన్ మెంట్ ల్యాండ్స్ కేసు లు నమోదు చేశారు. ఇప్పుడు కొత్తగా మద్యం కంపెనీలకు, బ్రాండ్స్ కు అక్రమంగా అనుమతులు ఇచ్చారు అంటూ మరో కేసు నమోదు చేశారు. మరి ఈ కొత్త కేసు వ్యవహారం ఎన్ని మలుపులు తీసుకుంటుందో వేచిచూడాల్సిందే. ఆంధ్ర ప్రదేశ్ లో ప్రతిపక్షాలు అన్ని అన్ని ఒక్కటై జగన్ సర్కారు మద్యం వ్యవహారంపై తీవ్ర విమర్శలు చేస్తున్న తరుణంలో ఈ కేసు నమోదు చేయటం ఆసక్తికరంగా మారింది. జగన్ అధికారంలోకి వచ్చిన నాలుగున్నర సంవత్సరాల తర్వాత ఈ విషయాన్నీ గుర్తించటం మరో విశేషంగా చెప్పుకోవచ్చు. చంద్రబాబు పై వరస కేసు ల దాడి చూస్తుంటే ఇది అంతా పక్కా పొలిటికల్ టార్గెట్ గానే చేస్తున్నట్లు కనిపిస్తుంది అనే చర్చ సాగుతోంది.

Next Story
Share it