అప్పుడు 33 వేల ఎకరాలకు అభ్యంతరం..ఇప్పుడు 44 వేలకు ఓకేనా!

పవర్ లోకి వచ్చిన తర్వాత జనసేన అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సొంతంగా ఆలోచించటం మానేశారా?. ఎలాగూ అధికారంలో ఉన్నాం కదా ఇప్పుడు సొంత అభిప్రాయాలు చెప్పి ఉన్న పవర్ పోగొట్టుకోవటం ఎందుకు అనుకుంటున్నారా?. అందరిలో ఇప్పుడు ఇవే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే ఇదే పవన్ కళ్యాణ్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజధాని అమరావతికి 33 వేల ఎకరాలు తీసుకోవాలని ప్రతిపాదించినపుడు ఎన్ని విమర్శలు చేశారో లెక్కే లేదు. దీనిపై రకరకాల వాదనలు వినిపించారు. కానీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో అప్పటి నుంచి అంతా సైలెంట్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏది చెప్తే దానికి తందానా అన్నట్లు వ్యవహరిస్తున్నారు అనే విమర్శలు మూటకట్టుకుంటున్నారు. రాజధానికి అసలు 33000 వేల ఎకరాలు ఎందుకు అని ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు అమరావతి విస్తరణ కోసం మరో 44000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ విధానం కింద తీసుకోవాలని నిర్ణయించినా కూడా మౌనాన్ని ఆశ్రయించటం పలు అనుమానాలకు తావిస్తోంది.
మంగళవారం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రి వర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఒక్క భూమి విషయంలోనే కాదు...అమరావతి కాంట్రాక్టు లు..పవర్ ప్రాజెక్ట్ లు కూడా ఎంపిక చేసిన కంపెనీలకు మాత్రమే ...అది కూడా వేల కోట్ల రూపాయలు పనులను కూటమి ప్రభుత్వం అడ్డగోలుగా కట్టబెడుతున్నా కూడా పవన్ కళ్యాణ్ నోరు తెరిచి ఒక్కటంటే ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. పైగా తమ కూటమి ప్రభుత్వం మరో 15 నుంచి 20 సంవత్సరాలు అధికారంలో ఉంటుంది అని..తమ మధ్య ఎవరూ విభేదాలు సృష్టించలేరు అని కూడా చెపుతున్నారు. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ రాజధానికి అంత భారీ మొత్తంలో భూమి తీసుకోవటాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు ...తప్పుపట్టారు. కొద్ది రోజుల క్రితమే జనసేన కు చెందిన మంత్రి నాదెండ్ల మనోహర్ రైతులతో మాట్లాడుతూ రాజధాని ప్రాంతం అభివృద్ధి కోసం మరో 44 వేల ఎకరాలు సేకరిస్తున్నారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. దీంతో రైతులు చాలా ఆందోళన చెందుతున్నట్లు తమ దృష్టికి వచ్చింది అని... అలాంటి అనుమానాలు, అపోహలు ఉంటే మరిచిపోండి అన్నారు.
కూటమి ప్రభుత్వం కొత్తగా భూ సమీకరణపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అని ప్రకటించారు. తమ దృష్టి అంతా ప్రస్తుతం సేకరించిన 33 వేల ఎకరాల అభివృద్ధిపైనే ఉంది. భవిష్యత్ అవసరాల కోసం భూమి సేకరించాలని కొంతమంది మాట్లాడినా ముఖ్యమంత్రి ఎటువంటి నిర్ణయం గానీ, ఆదేశాలుగానీ ఇవ్వలేదు అన్నారు. కానీ సీన్ కట్ చేస్తే జూన్ 24 న జరిగిన మంత్రి వర్గ సమావేశంలో దీనిపై అధికారికంగా నిర్ణయం తీసుకున్నారు. మరి అటు పవన్ కళ్యాణ్ కానీ..ఇటు నాదెండ్ల మనోహర్ కానీ..రైతుల ఆందోళనలు పట్టించుకుంటారా లేక అలాగే చంద్రబాబు ఏది చెపితే దానికి ఓకే చెపుతూ ముందుకు వెళ్తారా అన్నది చూడాలి. అసలు గతంలో ఎప్పుడూ కూడా చంద్రబాబు అమరావతి విస్తరణ అన్న అంశం ప్రస్తావించలేదు. దేశ, విదేశాలకు చెందిన నిపుణులతో కలిసి అమరావతి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసినట్లు ప్రకటించారు. ఇక్కడ మరో కీలక అంశం ఏమిటి అంటే అమరావతి నుంచి సింగపూర్ కంపెనీ లు స్టార్ట్ అప్ ఏరియా ప్రాజెక్ట్ నుంచి వైదొలగటంతో దీనికోసం కేటాయించిన 1691 ఎకరాలు కూడా ప్రభుత్వానికి అదనంగా అందుబాటులోకి వచ్చింది.
కానీ చంద్రబాబు సర్కారు మాత్రం ఎప్పుడూ చెప్పని విస్తరణ ప్రాజెక్ట్ పేరుతో రైతుల దగ్గర నుంచి మరో 44000 ఎకరాల భూమి తీసుకోవటానికి సిద్ధం అవుతోంది. ఇప్పుడు అమరావతి ప్రాజెక్ట్ పూర్తి చేయటం కోసమే ప్రపంచ బ్యాంకు దగ్గర నుంచి ఇతర ఆర్థిక సంస్థల నుంచి వేల కోట్ల రూపాయల అప్పులు తెస్తున్నారు. మరి ఇప్పుడు కొత్తగా సేకరించే భూమి అభివృద్ధి కోసం ఎంత అవుతుందో...అది ఎప్పటికి అభివృద్ధి చెందుతుందో చూడాలి. అంతే కాదు ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు చెందిన సన్నిహితులు..బినామీలు ఇప్పటికే ఎయిర్ పోర్ట్ తో పాటు ఇతర కీలక ప్రాజెక్ట్ లకు భూమి కేటాయించే అవకాశం ఉన్న చోట పెద్ద ఎత్తున ల్యాండ్ బ్యాంక్ సమకూర్చుకున్నట్లు అధికార వర్గాలు చెపుతున్నాయి. ఇందులో కీలక స్థానాల్లో ఉన్న నేతలకు చెందిన మనుషులు అందరూ ఉన్నట్లు ప్రచారంలో ఉంది.



