Telugu Gateway
Andhra Pradesh

అవసరానికి మించి వరల్డ్ ట్రేడ్ సెంటర్...సత్వా కు అప్పగింతలు

అవసరానికి మించి వరల్డ్ ట్రేడ్ సెంటర్...సత్వా కు అప్పగింతలు
X

అమెరికా లోని న్యూ యార్క్ సిటీలోనే వరల్డ్ ట్రేడ్ సెంటర్ ( డబ్ల్యూటిసి) మొత్తం 16 ఎకరాల్లో విస్తరించి ఉండేది. ఇందులో ఐకానిక్ ట్విన్ టవర్స్ తో పాటు ఎన్నో ఇతర భవనాలు ఉండేవి. 2001 సెప్టెంబర్ 11 న విమానాలతో ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో ఈ టవర్స్ కుప్పకూలిన విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పాపులర్ అయిన అమెరికా వరల్డ్ ట్రేడ్ సెంటర్ మొత్తం పదహారు ఎకరాల్లో ఉంటే...ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వైజాగ్ లోని ఎండాడ లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ కోసం అంటూ ఏకంగా వందల కోట్ల రూపాయల విలువ చేసే 30 ఎకరాలు కేటాయించటానికి నిర్ణయం తీసుకుంది. ఎకరం కోటిన్నర రూపాయల లెక్కన ఈ భూమి కేటాయించటానికి గురువారం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు అద్యక్షతన జరిగిన మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ ఎకరా ధర తక్కువలో తక్కువ 30 కోట్ల రూపాయల పైనే ఉంటుంది. కానీ ప్రభుత్వం మాత్రం కోటిన్నర కే బివిఎం ఎనర్జీ అండ్ రెసిడెన్సీ సంస్థకు కేటాయించటానికి నిర్ణయం తీసుకుంది.

ఈ కంపెనీ 1250 కోట్ల రూపాయల పెట్టుబడితో ఇక్కడ వరల్డ్ ట్రేడ్ సెంటర్ డెవలప్ చేసి పదిహేను వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించబోతుంది అని చెపుతున్నారు. ఇది కపిల్ గ్రూప్ కు చెందిన కంపెనీ. అయితే వైజాగ్ లాంటి నగరంలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ పేరుతో ఈ కంపెనీకి ఏకంగా 30 ఎకరాలు కేటాయించడంపై విస్మయం వ్యక్తం అవుతోంది. ప్రపంచంలోనే రెండవ సంపన్న ఆర్థిక వ్యవస్థ అయిన చైనాలోని బీజింగ్ లోనే వరల్డ్ ట్రేడ్ సెంటర్ 43 ఎకరాల్లో ఉంది. కానీ వైజాగ్ లో ఒకే సారి ఇలాంటి ఇంత భూమి....అది కూడా ఇలాంటి ప్రాజెక్ట్ లు అమలు చేయటంలో అంతగా ట్రాక్ రికార్డు లేని కంపెనీకి కేటాయించటం వెనక ఏదో గోల్ మాల్ ఉంది అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో పాటు బెంగళూర్ కేంద్రంగా ఉన్న సత్వ డెవలపర్స్ కు కూడా ప్రభుత్వం వైజాగ్ లోని మధురవాడ ఐటి హిల్ లో ఎకరా కోటిన్నర రూపాయల లెక్కన 30 ఎకరాలు కేటాయించటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఏపీ క్యాబినెట్. ఇది కూడా అచ్చం ఇలాంటి వ్యవహారమే. ఇది రియల్ ఎస్టేట్ తో పాటు ఐటి స్పేస్ తో పాటు వివిధ పరిశ్రమల అవసరాలకు అవసరమైన స్పేస్ డెవలప్ చేసే కంపెనీ. ఈ కంపెనీ కి కూడా ప్రభుత్వం కారు చౌక గా వైజాగ్ లో భూములు కేటాయించటానికి నిర్ణయం తీసుకుంది.

ఇక్కడ దారుణమైన విషయం ఏమిటి అంటే వేలు..వందల కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూములను కారు చౌకగా ప్రైవేట్ సంస్థలకు ఆఫర్ చేస్తూ పారిశ్రామికవేత్తలకు పెద్ద ఎత్తున ప్రయోజనం కల్పించేలా నిర్ణయం తీసుకుంటున్నారు. అటు వరల్డ్ ట్రేడ్ సెంటర్ ప్రాజెక్ట్ తో పాటు సత్వా కు వైజాగ్ లో ఒక్కొక్కరికి 30 ఎకరాల లెక్కన చొప్పున భూమి కేటాయించటం ఏ మాత్రం సరికాదు అని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఒక వైపు ప్రభుత్వ భూములను అడ్డగోలుగా కారు చౌక రేట్లకు కట్టబెట్టి తాము రాష్ట్రానికి పెట్టుబడులు సాధించాం..ఉద్యోగ అవకాశాలు కల్పించబోతున్నాం అని ఊదరగొడుతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ లు. కానీ వీటికి ఉన్న అవసరాలు..కేటాయించే మొత్తాలు చూస్తుంటే దీని వెనక ఏదో భారీ గోల్ మాల్ జరుగుతున్నట్లు కనిపిస్తోంది అని ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి కూడా అభిప్రాయపడ్డారు. పెట్టుబడులు....ఉపాధి అవకాశాల పేరుతో అవసరానికి మించి ప్రైవేట్ సంస్థలకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం గత కొంత కాలంగా ఇష్టానుసారం భూములు కేటాయింపు చేస్తోంది అని అధికారులు చెపుతున్నారు.

Next Story
Share it