Telugu Gateway
Andhra Pradesh

రాష్ట్రంలో అంతా అధికారుల పాలనే

రాష్ట్రంలో అంతా అధికారుల పాలనే
X

స్పీకర్ కు ఎమ్మెల్యేలఫిర్యాదులు

ప్రభుత్వానికి స్పీకర్ లేఖ

ఆంధ్ర ప్రదేశ్ లో పొలిటికల్ పాలన నడుస్తుందా..అధికారుల పాలన నడుస్తుందా అంటే కొంత మంది ఎమ్మెల్యేలు మాత్రం అధికారుల పాలనే అనే చెపుతున్నారు. పొలిటికల్ పాలన రాజకీయ నాయకులు ఏది చెపితే అది చేయమని కాదు. ఎన్నికైన ప్రజాప్రతినిధులు చెప్పే మాటలు విని...అవి ప్రజలకు ఉపయోగపడేవి అయితే ఆ దిశగా అధికారులు పని చేయాలి. కానీ విచిత్రంగా ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి సర్కారు గతంలో ఎన్నడూ లేని రీతిలో ఏకంగా 164 మంది ఎమ్మెల్యే ల తో అత్యంత బలంతో ఉంది. గత ఎన్నికల్లో ఏకంగా 151 సీట్లు దక్కించుకున్న వైసీపీ ఇప్పుడు పదకొండు సీట్లకు పరిమితం అయిన విషయం తెలిసిందే. ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి సర్కారు ఇంత బలంగా ఉన్నా కూడా పలు జిల్లాల్లో కొంత మంది అధికారులు అసలు ఎమ్మెల్యేలను ఏ మాత్రం పట్టించుకోవటం లేదు అట. అంతే కాదు..ఏకంగా అధికారులను కలవటం కోసం ఎన్నికైన ప్రజాప్రతినిధులు గంటల తరబడి వేచిచూడాల్సి వస్తోంది. ఇవి ఎవరో చెప్పిన మాటలు కావు. కొంత మంది ఎమ్మెల్యేలు ఇదే విషయంపై శాసన సభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడికి ఫిర్యాదు చేస్తే ...స్పీకర్ ఇదే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారించాల్సిదిగా కోరారు.

ప్రజాప్రతినిధులు పలు జిల్లాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా అధికారుల దృష్టికి తీసుకు వెళ్లలేక పోతున్నారు అని...ఏకంగా ఎమ్మెల్యేలను కలవటానికి కూడా వాళ్ళు సమయం ఇవ్వటం లేదు అన్నారు. అంతే కాకుండా అధికారులను కలవటానికి కొన్ని సార్లు గంటల కొద్దీ ప్రజా ప్రతినిధులు వేచిఉండాల్సి వస్తోంది అని పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు ప్రజలకు సంబంధించిన సమస్యలపై మంత్రులు...కొంత మంది అధికారులకు ఇచ్చిన విన్నపాలను అసలు పట్టించుకోవటం లేదు కదా..కనీసం వాటికి సమాధానం కూడా రావటం లేదు అని తెలిపారు. స్పీకర్ ఈ అంశాలతో ప్రభుత్వానికి మార్చి 26 న లేఖ రాయగా...అధికారులతో పాటు జిల్లా కలెక్టర్లు, ఇతర జిల్లా అధికారులు కచ్చితంగా ప్రోటోకాల్ పాటించటంతో పాటు అన్ని నిబంధనలు విడిగా ఫాలో కావాలి అని..లేకపోతే కఠిన చర్యలు ఉంటాయి అంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ పేరుతో ఈ మే 9 న ఒక మెమో జారీ అయింది. ఎంపీలు, ఎమ్మెల్యే లతో పాటు ఎమ్మెల్సీ ల విషయంలో అధికారులు అనుసరించాల్సిన విధివిధానాలు ఎప్పటి నుంచో అమలు లో ఉన్నాయి. ఇక్కడ సమస్య అంతా వాటిని పాటించే విషయంలో అధికారుల తీరు వల్లే సమస్యలు వస్తున్నాయని ఒక ఐఏఎస్ అధికారి వెల్లడించారు. రాష్ట్ర స్థాయిలో కూడా కొంత మంది ఐఏఎస్ లు వివిధ కారణాలతో మంత్రులను ఏ మాత్రం లెక్క చేయకుండా వ్యవహరిస్తున్నారు అనే చర్చ అధికార వర్గాల్లో ఉంది.

Next Story
Share it