అక్టోబర్ 8 న షెడ్యూలు..నోటిఫికేషన్ ఖాయమా?!

బిసి రేజర్వేషన్ల విషయంలో టీడీపీ తో పాటు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్నది అంతా రాజకీయ డ్రామానేనా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున సాగుతోంది. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు ఖచ్చితంగా ఈ నెలలోనే జరుగుతాయి అని..ఇందులో ఎలాంటి అనుమానం అక్కరలేదు అని టీడీపీ కి చెందిన కీలక నేతలు చెపుతున్నారు. అక్టోబర్ 8 నే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ తో పాటు నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం ఉంది అని అత్యంత విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ముందు నుంచి అనుకున్నట్లు గానే ఫస్ట్ మున్సిపల్ ఎన్నికలు..తర్వాత జిల్లాపరిషత్, మండల పరిషత్ ఎన్నికలు జరుగుతాయి అని చెపుతున్నారు. బిసిలకు 34 శాతం రిజర్వేషన్స్ కల్పించేందుకు అని కూటమి ప్రభుత్వం తెచ్చిన జీవో లను కొట్టివేస్తూ ఆంధ్ర ప్రదేశ్ హై కోర్ట్ తీర్పు గురువారం నాడు తీర్పు వెల్లడించింది.
గతంలో సుప్రీం కోర్ట్ ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం రిజర్వేషన్స్ 50 శాతం దాటుతున్నందున ఇవి చెల్లవు అంటూ తీర్పు వెల్లడించింది. అలా తీర్పు వచ్చిందో లేదో...ఆ వెంటనే ప్రభుత్వం దీనిపై సుప్రీం కోర్ట్ లో అప్పీలు చేస్తుంది అని..బిసి లకు రిజర్వేషన్స్ విషయంలో ఏ మాత్రం వెనకడుగు వేసేదిలేదు అంటూ ప్రకటనలు చేశారు టీడీపీ నేతలు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తో పాటు ఆ పార్టీ నాయకుల నుంచి ఇదే తరహా ప్రకటనలు వచ్చాయి. ప్రభుత్వం హడావిడి చేస్తున్నా కూడా అసలు ప్రాథమిక దశలోనే ఈ బిసి రిజర్వేషన్స్ విషయంలో ప్రభుత్వం చేసే అప్పీలు ను సుప్రీం కోర్ట్ తిరస్కరించే అవకాశం ఉంది అని ఎక్కువ మంది నేతలు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే తన తీర్పును మళ్ళీ తానే సమీక్షించే అవకాశం ఉండదు కనుక. కాకపోతే బిసి ల రిజర్వేషన్స్ విషయంలో తాము ఎంతో గట్టిగా పోరాటం చేసినా కాలేదు అని చెప్పుకోవటానికి చేసే ప్రయత్నమే ఇది తప్ప..మరొకటి కాదు అనే చర్చ కూడా సాగుతోంది.
రేపు రేపు ఏదైనా కారణంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూటమికి దూరం అయినా కూడా ఒకప్పుడు టీడీపీ కి బలమైన ఓటు బ్యాంకు గా ఉన్న వాళ్ళను తమ వైపు పూర్తిగా తిప్పుకునేందుకు ఈ స్కెచ్ వేసినట్లు కనిపిస్తోంది అని ఒక నాయకుడు అభిప్రాయపడ్డారు. పార్లమెంట్ లో బిల్లు పాస్ అయినా లేకపోయినా కూడా 2029 ఎన్నికల్లో తాము మహిళలకు అటు అసెంబ్లీ తో పాటు లోక్ సభ సీట్లలోనూ 33 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. ఎన్నికల నాటికి ఎలాగోలా ఈ మహిళా రిజర్వేషన్స్ బిల్లును ఆమోదం పొందేందుకు కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు ప్రయత్నాలు చేస్తోంది.
అది తెలిసే నారా లోకేష్ ఈ ప్రకటన చేశారు అనే చర్చ కూడా అప్పటిలోనే టీడీపీ నేతల్లో సాగింది. ఇప్పుడు సుప్రీం కోర్ట్ లో కూడా బిసి రిజర్వేషన్స్ కేసు కొట్టేసిన తర్వాత పార్టీ పరంగా బిసి లకు ప్రతిపాదిత రిజర్వేషన్ లెక్కల ప్రకారమే సీట్లు కేటాయించే అవకాశం ఉంది అన్నది ఎక్కువ మంది నాయకులు చెపుతున్న మాట. పార్టీ పరంగా ఎవరికీ ఎన్ని సీట్లు కేటాయించుకున్నా అడిగే వారు ఉండరు. రాజకీయంగా దేశంలోనే అత్యంత సీనియర్ నేతగా ఉన్న చంద్రబాబు కు సుప్రీం కోర్ట్ లో ఈ కేసు ముందుకు సాగదు అనే విషయం తెలియదా...ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు ఆయనకు ఆ మాత్రం చెప్పకుండా ఉంటారా? అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. అయితే ఇది అంతా పొలిటికల్ గేమ్ లో భాగంగా సాగుతున్న వ్యవహారం కనుక అంతా గప్ చుప్ గా ఉంటున్నారు అని ఒక మంత్రి అభిప్రాయపడ్డారు.



