Telugu Gateway
Andhra Pradesh

కీలక నేత ఫ్యామిలీ ట్రస్ట్ కు బదలాయింపు!

కీలక నేత ఫ్యామిలీ ట్రస్ట్ కు బదలాయింపు!
X

ఆంధ్ర ప్రదేశ్ లోని చినకాకానిలో ఉన్న ఎన్ఆర్ఐ హాస్పిటల్ చేతులు మారబోతుందా?. అంటే అవుననే సమాధానం వస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా ఇది వివాదాల్లో ఇరుకున్న విషయం తెలిసిందే. వీటిని ఆసరా చేసుకుని ఆంధ్ర ప్రదేశ్ లో అధికారంలో ఉన్నఒక పార్టీకి చెందిన ఫ్యామిలీ ట్రస్ట్ పూర్తిగా దీన్ని కైవసం చేసుకునే పనిలో ఉన్నట్లు అత్యంత విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఇక్కడ మరో కీలక విషయం ఏమిటి అంటే వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం గా ఉన్న సమయంలో దేశ వ్యాప్తంగా హవా చెలాయిస్తున్న ఒక కంపెనీ దీన్ని దక్కించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేసింది. కానీ ఈ ఎన్ఆర్ఐ హాస్పిటల్ డైరెక్టర్లు చాలా మంది ఈ ప్రయత్నాలను గట్టిగా అడ్డుకొన్నారు అప్పటిలో. ఇప్పటికీ ఆ కంపెనీ ప్రతినిధులు ఇందులో వాటాదారుగా ఉన్నా కూడా ఇప్పుడు అధికార పార్టీ కి చెందిన ఫ్యామిలీ ట్రస్ట్ కు ఈ హాస్పిటల్ బదలాయించటానికి ఆ కంపెనీ పెద్దలు కూడా సిద్ధపడినట్లు చెపుతున్నారు.

ఏపీ ప్రభుత్వ పెద్దలకు...ఈ కంపెనీ అధినేతకు మధ్య ఎప్పటి నుంచే బలమైన లావాదేవీలు ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వంలో కూడా ఆ సంస్థకు వేల కోట్ల రూపాయల పనులు కేటాయించారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ కంపెనీ ఏది అడిగితే అది ఇవ్వటానికి ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అందుకే ఇప్పుడు ఆ కంపెనీ కూడా ప్రభుత్వ పెద్దలు అడిగిన మేరకు ఈ హాస్పిటల్ లో వాటాలు బదలాయించటానికి సిద్ధపడినట్లు టీడీపీ వర్గాలు చెపుతున్నాయి. అంటే ఆ కంపెనీ....ప్రభుత్వ పెద్దల మధ్య బంధం ఎంతగా పెనవేసుకుపోయిందో ఈ పరిణామం చెపుతుంది అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా వివాదాల్లో చిక్కుకున్న ఈ హాస్పిటల్ ను ప్రభుత్వంలో పెద్దలు ఏకంగా తమ ఫ్యామిలీ ట్రస్ట్ కు బదలాయించుకోవటానికి సిద్ధపడ్డారు అంటే వీళ్ళు ఈ సారి ఎంతగా బరితెగించారో అర్ధం అవుతోంది అని ఒక సీనియర్ మంత్రి వ్యాఖ్యానించారు. ఈ బదలాయింపు వ్యవహారం త్వరలోనే పూర్తి అయ్యే అవకాశం ఉంది. ఈ దిశగా వేగంగా పావులు కదులుతున్నాయి. ప్రస్తుతం ఈ సంస్థ యాజమాన్యం అడ్మినిస్ట్రేటర్ చేతిలో ఉంది.

2026 ఏప్రిల్ 30 లోపు సొసైటీ అసాధారణ సర్వ సభ్య సమావేశం నిర్వహించి కొత్త పాలక మండలిని ఎన్నుకోనుంది. అయితే ఏప్రిల్ ఐదున ఈ సమావేశం నిర్వహించే అవకాశం ఉంది అని చెపుతున్నారు. దీని కోసం సొసైటీ లో సభ్యులుగా ఉన్న 30 మందికి ఈమెయిల్, వాట్సాప్ తో పాటు నేరుగా కూడా సమావేశం ఎజెండా వివరాలు పంపనున్నారు. ఈ సమావేశం మంగళగిరి మండలంలోని చినకాకానిలో ఉన్న ఎన్ఆర్ఐ హాస్పిటల్స్ సమావేశ మందిరంలో నేరుగా సభ్యులు పాల్గొనటానికి అవకాశం కల్పిస్తారు.అదే సమయంలో హైబ్రిడ్ మోడ్ లో కూడా అనుమతి ఇస్తారు. ఈ సమావేశం ఎలాంటి గందరగోళాలు లేకుండా శాంతియుతంగా జరిపేందుకు అన్ని చర్యలు తీసుకోవటంతో పాటు వీడియో రికార్డింగ్ కూడా చేయించనున్నారు. ఈ ఎన్నికలో ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ లను ఎన్నుకోవాల్సి ఉంటుంది.ఈ ఎన్నిక తప్ప ఇతర ఎలాంటి ఎజెండా చేపట్టరు. ఈ కార్యవర్గం ఎన్నిక పూర్తి అయిన తర్వాత అంటే 2026 మే 31 లోగా అడ్మినిస్ట్రేటర్ సొసైటీ పూర్తి బాధ్యతలను కమిటీ కు అప్పగించి వైదొలగాల్సి ఉంటుంది.

అప్పటి నుంచి హాస్పిటల్ తో పాటు మెడికల్ కాలేజీ నిర్వహణ కూడా ఈ కమిటీ కిందకు వస్తుంది. ఎన్ ఆర్ఐ అకాడమీ ఆఫ్ సైన్సెస్ లో చట్టపరంగా...అర్హులైన సభ్యుల వివరాలు ఇలా ఉన్నాయి. డాక్టర్ ఉపేంద్రనాథ్ నిమ్మగడ్డ, డాక్టర్ మణి అక్కినేని, డాక్టర్ రామకృష్ణ పిన్నమనేని, డాక్టర్ బుచ్చయ్య కొండ్రగుంట, డాక్టర్ బసవేశ్వర రావు యలమంచిలి, డాక్టర్ జితేంద్ర కాటినేని, డాక్టర్ కృష్ణ ప్రసాద్ సూరపనేని, డాక్టర్ రాఘవరావు పోలవరపు, డాక్టర్ ప్రతాప్ అర్వపల్లి,డాక్టర్ సుబ్రహ్మణ్యం నాయుడు కె, డాక్టర్ రాజు ఎన్ మంతెన, డాక్టర్ సురేంద్ర బి ఆవుల, డాక్టర్ కృష్ణ కుమార్ గన్నమనేని, డాక్టర్ సుమతి ముక్కముల, మాధవి నిమ్మగడ్డ, రూప అక్కినేని, ప్రసాద్ బిఆర్ నీరుకొండ, సోము కృష్ణ మూర్తి, డాక్టర్ కోనేరు శ్రీధర్, అర్జున లెంకే, మురళి కృష్ణ, కుద్రవల్లి, బాపిరెడ్డి కె, పీ. సుధారాణి, మంజలి పీ రెడ్డి, పీ. మేఘా రెడ్డి, డాక్టర్ చెక్క పెద సుబ్బయ్య, తిరుపతిరావు నడిపినేని, శ్రీనివాసరెడ్డి బి ఉన్నారు. ప్రసుతం రెండు అధికార పార్టీల దగ్గర హవా చెలాయిస్తున్న ఒక పవర్ బ్రోకర్ కు చెందిన వాటాలనే జగన్ హయాంలో ఒక కాంట్రాక్టు సంస్థ కొనుగోలు చేసినట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి.

Next Story
Share it