Telugu Gateway
Andhra Pradesh

నిజమా...అవునా..అయితే ఓకే !

నిజమా...అవునా..అయితే ఓకే !
X

తెలుగు దేశం నాయకులు కట్టుతప్పినప్పుడల్లా మీడియాలో ఒక వార్త వస్తుంది. ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీరియస్ అని... ఇక నుంచి పార్టీ లైన్ దాటే వాళ్ళను ఉపేక్షించేది లేదు అంటూ. చంద్రబాబు సీరియస్ అని మీడియాలో వచ్చింది అంటే అది కామెడీనే అని ఆ పార్టీ సీనియర్ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఎందుకంటే ఇలాంటివి జరిగినప్పుడల్లా చంద్రబాబు మీడియాకు లీక్ లు ఇచ్చి చంద్రబాబు సీరియస్ గా ఉన్నారు...కఠిన చర్యలు తప్పవు అంటూ కవరింగ్ ఇస్తారు. ఫైనల్ గా ఎక్కడా ఏమీ ఉండదు అని ఆ పార్టీ నేతలు చెపుతున్న మాట. తాజాగా కూడా అలాంటి పరిణామమే ఒకటి చోటు చేసుకుంది. టీడీపీ తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిపై సీరియస్ ఆరోపణలు చేశారు. ఇవిగో సాక్ష్యాలూ అంటూ కొన్ని పేపర్లు కూడా బయటపెట్టారు. కొలికపూడి శ్రీనివాసరావు పార్టీ ని ఇరకాటంలోకి నెట్టింది ఇది మొదటి సారి కాదు. ఇప్పటికే పలు మార్లు ఆయన అధికార పార్టీ ని తన దూకుడు వైఖరితో పలు మార్లు ఇబ్బందుల్లోకి నెట్టారు.

తాజా వివాదంపై విజయవాడ ఎంపీ, తిరువూరు ఎమ్మెల్యేలను ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ పిలిచిమాట్లాడాల్సిన అవసరం లేదు అని...తానే నేరుగా ఈ వ్యవహారం చూస్తాను అని చంద్రబాబు చెప్పినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. గతంలో కూడా ఇలాగే కొలికపూడి తీరుపై చంద్రబాబు పలు మార్లు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు మీడియాలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఎన్ని సార్లు ఇలాంటి వార్తలు వచ్చినా చంద్రబాబు సీరియస్ అని పేపర్లో వార్తలు రాసుకోవటానికి పనికివస్తుంది తప్ప అంతకు మించి ఏమీ జరగదు అని ఆ పార్టీ నేతలే చెపుతున్నారు. ఎందుకంటే చంద్రబాబు ఒక నిర్ణయం తీసుకోవాలంటే దాని తర్వాత వచ్చే పరిణామాలు...అది ఎన్ని మలుపులు తీసుకుంటుంది వంటి లెక్కలు ఎన్నో వేస్తారు. అందుకే ఎక్కువగా ఈ సీరియస్ ప్రకటనలు పేపర్లకు పరిమితం అయి పోతాయని ఒక సీనియర్ నేత వెల్లడించారు.

Next Story
Share it