కొత్త అధ్యక్షుడి రాకతో గొంతు సవరిస్తున్న నేతలు!

ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హడావుడి అంతా ప్రధాన పార్టీ లు అయిన టీడీపీ, జనసేన లదే. బీజేపీ కూడా కూటమిలో భాగస్వామిగా ఉన్నా ఆ పార్టీ ఏడాది కాలంలో ఎక్కడా పెద్దగా హంగామా చేసిన దాఖలాలు లేవు అనే చెప్పొచ్చు. ప్రభుత్వంలో పెద్ద ఎత్తున అవినీతి...అడ్డగోలు వ్యవహారాలు సాగుతున్నా కూడా ఎవరూ నోరు తెరిచి మాట్లాడిన పరిస్థితి లేదు. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా మాధవ్ రాకతో బీజేపీ నేతల సౌండ్ పెరిగే అవకాశం ఉందా అన్న చర్చ తెరమీదకు వస్తోంది. మంగళవారం నాడు నూతన అధ్యక్షుడిగా మాధవ్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలోనే విశాఖపట్నం నార్త్ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ కనుక కూటమిలో కలిసి ఉండకపోతే పరిస్థితులు ఏ విధంగా ఉండేవో రాష్ట్ర ప్రభుత్వానికి తెలియాలి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకరు తమ బలం 80 శాతం అని...మరో పార్టీ బలం 15 శాతం అని...బీజేపీ కి కేవలం ఐదు శాతం బలం ఉంది అంటున్నారు అని..ఇది హాస్యాస్పదం అన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో అంత మేర సీట్లు ఇస్తామంటే కుదరదు అని..ఈ విషయంలో పార్టీ ప్రెసిడెంట్ మాధవ్ గట్టిగా చెప్పాలంటూ కోరారు. తమ బలం ఐదు శాతం కాదు అని..అంత కంటే ఎన్నో రేట్లు ఎక్కువ అంటూ వ్యాఖ్యానించారు విష్ణుకుమార్ రాజు.
సహజంగా మాధవ్ ది దూకుడుగా వెళ్లే స్వభావం కాదు అని ఎక్కువ మంది నేతలు చెపుతున్నారు. కాకపోతే మరీ పురందేశ్వరి ఉన్నప్పుడు ఉన్నంత ఈజీ గా పరిస్థితులు ఉండవన్నది ఎక్కువ మంది నేతల అభిప్రాయం. మాధవ్ బాధ్యతలు స్వీకరించిన తోలి రోజే ఒక వైపు విష్ణు కుమార్ రాజు...మరో వైపు ఎంపీ పాకా సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేయటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ నుంచి రాజ్య సభకు ఎన్నికైన పాకా సత్యనారాయణ కూడా మంగళవారం నాడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర ప్రదేశ్ లో బీజేపీ బలం ఒక పార్టీ ని అధికారంలో నుంచి దించేంత..మరోక పార్టీ అధికారంలో కూర్చోబెట్టేంత అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొద్ది రోజుల క్రితం జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా నలభై ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీ ని తాము నిలబెట్టామని చెప్పగా..ఇప్పడు బీజేపీ నేతలు కూటమిలో తాము లేకపోతే పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోవాలి అని చెపుతుండటం విశేషం. అయితే తాజా పరిణామాలపై బీజేపీ లోని మరి కొంత మంది నేతలే కొంత మంది నేతలు వ్యక్తిగత ఎజెండా తో మాట్లాడుతున్నారు అని అభిప్రాయపడుతున్నారు.