Telugu Gateway
Andhra Pradesh

జ‌గ‌న్ కేసులో సీబీఐ దాగుడుమూత‌లు

జ‌గ‌న్ కేసులో సీబీఐ దాగుడుమూత‌లు
X

దేశంలోని అత్యున్న‌త విచార‌ణ సంస్థ అయిన సీబీఐ స్వ‌యంగా దాగుడుమూత‌లు ఆడ‌టం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు దాఖ‌లు చేసిన ఏపీ సీఎం జ‌గన్ బెయిల్ ర‌ద్దు పిటీష‌న్ పై గ‌త కొన్ని రోజులుగా సీబీఐ కోర్టులో విచార‌ణ సాగుతున్న విష‌యం తెలిసిందే. ఈ పిటీష‌న్ కు సంబంధించి త‌న వాద‌న విన్పించాల్సిన సీబీఐ ప‌లుమార్లు మాట మార్చి విమ‌ర్శ‌ల పాలైంది. తొలుత తాము చెప్పాల్సింది ఏమీలేద‌ని..కోర్టు స్వ‌యంగా మెరిట్ ఆధారంగా నిర్ణ‌యం తీసుకోవాల‌ని సూచించింది. దీనిపై ర‌ఘ‌రామ లాయ‌ర్లు అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. త‌ర్వాత సీబీఐ త‌న వాద‌న‌లు విన్పిస్తాన‌ని తెలిపింది. దీని కోసం ప‌లుమార్లు స‌మ‌యం తీసుకుంది. శుక్ర‌వారం నాడు సేమ్ సీన్ రిపీట్ అయింది. సీబీఐ నుంచి త‌మ‌కు ఎలాంటి స‌మాచారం రాలేదని..మ‌రింత స‌మ‌యం కావాల‌ని కోరింది.

దీనిపై అభ్యంత‌రం వ్య‌క్తం చేసిన ర‌ఘురామ లాయ‌ర్లు ఇవాళే సీబీఐ త‌న వాద‌న చెప్పాల‌ని కోర‌టంతో..కోర్టు కొంత సేపు విచార‌ణ‌ను వాయిదా వేసింది. త‌ర్వాత సీబీఐ న్యాయ‌వాది వ‌చ్చి తాము ఎలాంటి వాద‌న‌లు విన్పించటంలేద‌ని కోర్టు త‌న విచ‌క్షణ మేర‌కు నిర్ణ‌యం తీసుకోవాల‌న్నారు. దీంతో సీబీఐ కోర్టు కూడా వాద‌న‌లు ముగిశాయ‌ని..ఆగ‌స్టు 25న తీర్పు వెలువ‌రిస్తామ‌ని ప్ర‌క‌టించింది. ఈ కేసుకు సంబంధించి కొద్ది రోజుల క్రిత‌మే జగన్ తరపు న్యాయవాదులు, పిటిషనర్ రఘురామకృష్ణం రాజు లాయర్లు లిఖితపూర్వకమైన వాదనలు కోర్టుకు సమర్పించారు. ఈ మూడింటిని పరిగణలోకి తీసుకున్న అనంతరం ఆగస్టు 25న కోర్టు తీర్పును వెల్లడించ‌నుంది.

Next Story
Share it