Telugu Gateway
Andhra Pradesh

ఏపీలో రాత్రి క‌ర్ఫ్యూ..థియేట‌ర్ల‌లో 50 శాతం సామ‌ర్ధ్యానికే అనుమ‌తి

ఏపీలో రాత్రి క‌ర్ఫ్యూ..థియేట‌ర్ల‌లో 50 శాతం సామ‌ర్ధ్యానికే అనుమ‌తి
X

ఏపీ స‌ర్కారు కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. క‌రోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న వేళ రాత్రి క‌ర్ఫ్యూ అమ‌లుకు సీఎం జ‌గ‌న్ ఆదేశాలు జారీ చేశారు. సోమ‌వారం నాడు ఆయ‌న వైద్య శాఖ అధికారుల‌తో కోవిడ్‌ పరిస్థితులపై సమీక్ష నిర్వ‌హించారు. ఈ క‌ర్ఫ్యూ రాత్రి ప‌ద‌కొండు గంట‌ల నుంచి ఉద‌యం ఐదు గంట‌ల వ‌ర‌కూ అమ‌ల్లో ఉండ‌నుంది. రాత్రి క‌ర్ఫ్యూతోపాటు ప‌లు నిబంధ‌న‌లు అమ‌ల్లోకి తేవాల‌ని నిర్ణ‌యించారు. అందులో భాగంగా థియేట‌ర్ల‌లో 50 శాతం సామ‌ర్ధ్యాన్ని మాత్ర‌మే అనుమ‌తించ‌నున్నారు. దీంతోపాటు బహిరంగ ప్రదేశాల్లో 200 మంది, ఇన్‌డోర్స్‌లో 100 మంది మించకుండా చూడాలని ఆదేశించారు. మాస్క్‌తప్పనిసరి చేయాలని నిర్ణ‌యించారు.

దేవాలయాలు, ప్రార్థనా మందిరాల్లో కూడా భౌతిక దూరం పాటించేలా, మాస్క్‌ ధరించేలా చూడాలని అధికారుల‌కు సూచించారు. ఒమిక్రాన్ వేరియంట్ లో స్వ‌ల్ప ల‌క్షణాలు మాత్ర‌మే ఉంటున్నాయ‌ని అధికారులు తెలిపారు. అయితే ఈ అంశంపై వైద్యనిపుణులతో సంప్రదించి ఇవ్వాల్సిన మందులను సిద్ధంచేయాలన్నారు. 104 కాల్‌ సెంటర్‌ను మ‌రింత బ‌లోపేతం చేసి అందుబాటులో ఉంచాల‌ని కోరారు. కోవిడ్ కేర్ సెంట‌ర్ల‌ను రెడీ చేయ‌టంతోపాటు నియోజ‌క‌వ‌ర్గానికి ఒక సెంట‌ర్ ఉండేలా చూడాల‌ని ఆదేశించారు.

Next Story
Share it