Telugu Gateway
Andhra Pradesh

విజయవాడ హత్య కేసులో కొత్త మలుపు

విజయవాడ హత్య కేసులో కొత్త మలుపు
X

కలకలం రేపిన ప్రేమోన్మాది హత్య ఉదంతం కొత్త మలుపు తిరిగింది. తొలుత తన ప్రేమను తిరస్కరించిందని...అందుకే ఇంజనీరింగ్ చదువుతున్న దివ్యను స్వామి అనే వ్యక్తి హత్య చేసినట్లు వార్తలు వెలువడ్డాయి. తర్వాత కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. దివ్య, స్వామి ఇద్దరూ ప్రేమలో ఉన్నారని...ఇంజనీరింగ్ చదువుతున్న తమ అమ్మాయి పెయింటర్ ను ప్రేమించటం ఆమె తల్లిదండ్రులకు ఏ మాత్రం నచ్చక వార్నింగ్ ఇఛ్చినట్లు చెబుతున్నారు. అయితే ఇప్పటికే దివ్య, స్వామి పెళ్ళి కూడా చేసుకున్నట్లు చెబుతున్నారు. దీనికి సంబంధించి కొన్ని ఫోటోలు కూడా వెలుగులోకి వచ్చాయి. బాధితురాలి సోదరుడు గురువారం మీడియాతో మాట్లాడుతూ.. స్వామి తమకు చిన్నప్పటి నుంచి తెలుసునన్నాడు. దివ్య, చినస్వామి మంచి స్నేహితులని, అతడెందుకు ఉన్మాదిలా ప్రవర్తించాడో తెలియడం లేదన్నాడు. తన చెల్లెలి చావుకు కారణమైన స్వామిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశాడు.

నగర కమిషనర్‌ బత్తిన శ్రీనివాసులు ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ వద్దకి చేరుకుని బాధితురాలి కుటుంబసభ్యులను కలిసి మాట్లాడారు. వారి వద్దనుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ''11.30 మధ్య దాడి జరిగిందని సమాచారం వచ్చింది. నిందితుడు నాగేంద్రబాబు అలియాస్‌ స్వామి దివ్య తేజస్విని గొంతుపై కత్తి దాడి చేశాడు. ఆ అమ్మాయి ఆసుపత్రిలో చనిపోయింది. అతడు కూడా కత్తితో పొడుచుకోవటంతో పరిస్థితి విషమంగా ఉంది. సంఘటన జరిగినప్పుడు ఎవరూ లేరు. అందరి దగ్గర స్టేట్ మెంట్ తీసుకుంటున్నమని తెలిపారు. దివ్య గదిలో ఫ్యాన్ కు టవల్ కట్టి ఉండటంతో కూడా పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బాదితురాలి తల్లి మాత్రం స్వామిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పెయింటర్ పనిచేస్తున్న అతనికి ఇంజనీరింగ్ చదువుతున్న తమ కూతురిని ఇఛ్చి ఎలా పెళ్లి చేస్తామని ప్రశ్నించింది.

Next Story
Share it