Telugu Gateway
Andhra Pradesh

మీడియాలో కొత్త కాన్సెప్ట్...కాంట్రాక్ట్ ఛాన‌ళ్లు!

మీడియాలో కొత్త కాన్సెప్ట్...కాంట్రాక్ట్ ఛాన‌ళ్లు!
X

కాంట్రాక్ట్ ఫార్మింగ్ త‌ర‌హాలో ఇప్పుడు కాంట్రాక్ట్ ఛాన‌ళ్లు కూడా పుట్టుకొచ్చాయి. ఛాన‌ళ్లు..మీడియా పార్టీల కొమ్ముకాయ‌టం ఇవాళ కొత్త‌గా పుట్టుకొచ్చింది ఏమీ కాదు. ఇది కొన్ని ద‌శాబ్దాలుగా సాగుతూనే ఉంది. దేశంలో..రాష్ట్రాల్లో మీడియా పార్టీల వారీగా చీలిపోయింది. చ‌దివే పాఠ‌కుల‌కు తెలుసు ఆ ప‌త్రిక ఎవ‌రికి మ‌ద్ద‌తు ఇస్తుంద‌నేది.చూసే ప్రేక్షకుల‌కు తెలుసు ఆ ఛాన‌ల్ ఎవ‌రి కోసం ప‌నిచేస్తుందో. త‌ట‌స్థంగా ఉండే ప‌త్రిక‌లు..ఛాన‌ళ్ల కోసం వెత‌క‌టం అంటే ఇది ఇప్పుడు పెద్ద స‌వాల్ తో కూడుకున్న ప‌నే చెప్పొచ్చు. ఏపీలో తాజాగా చోటుచేసుకుంటున్న పరిణామాలు మ‌రింత ఆస‌క్తిక‌రంగా మారాయి. ఓ కీల‌క ఛాన‌ల్ అధిరార పార్టీకి కాంట్రాక్ట్ ఛాన‌ల్ గా మారింద‌నే విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కొంటోంది. ఏ మీడియా ఛాన‌ల్ అయినా పార్టీల ప్రముఖులు..నేత‌ల మీడియా స‌మావేశాల‌కు పిలిచిన‌ప్పుడు హాజ‌ర‌వుతుంటారు. కానీ ఈ ఛాన‌ల్ ప్ర‌త్యేక‌త ఏమిటంటే ఆ పార్టీ ఎప్పుడైనా అటెన్ష‌న్ డైవ‌ర్ష‌న్ చేయాలనుకుంటే వెంట‌నే త‌మ కాంట్రాక్ట్ ఛాన‌ల్ ప్ర‌తినిధికి క‌బురంపుతుంది. అంతే వాళ్లు కూడా క్షణాల్లో వాలిపోయి త‌మ ప‌ని తాము చేసి వెళ్లిపోతారు.

స‌హ‌జంగా మార్కెట్లో అది కీలక ఛాన‌ల్ కావ‌టంతో కొంత రీచ్ ఎక్కువ‌గానే ఉంటుంది. ఆ పార్టీ టార్గెట్ రీచ్ అవుతుంది. ఇలా పెయిడ్ న్యూస్ పోయి ఇప్పుడు కొత్త‌గా ఏకంగా కాంట్రాక్ట్ ఛాన‌ళ్ళే పుట్టుకొచ్చాయ‌ని చెబుతున్నారు. అంతే కాదు..రాష్ట్రంలో టాప్ ఛానళ్లు..ప‌త్రిక‌లు త‌మ‌కు అస్మ‌దీయులైన బ‌డాబ‌డా కాంట్రాక్ట‌ర్లకు చెందిన వార్త‌లు అస‌లు క‌న్పించ‌నీయ‌కుండానే చేస్తారు. కాంట్రాక్ట‌ర్లే కాదు..రాజ‌కీయ నేత‌ల విష‌యంలోనూ ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. తాము మోస్తున్న పార్టీ నేత‌ల‌కు సంబంధించి పెద్ద వ్య‌తిరేక వార్త‌లు వ‌చ్చినా వారు వాటిని చూసీ చూడ‌నట్లుగానే వ‌దిలేస్తున్నారు. ఇలాంటి వాటికి చాలాసార్లు సోష‌ల్ మీడియానే ఆయుధంగా మారుతోంది. సోష‌ల్ మీడియాలో ఉండే అరాచ‌కం ఉన్నా కూడా లూటీ చేస్తున్న నేత‌లు..కాంట్రాక్ట‌ర్ల‌కు సంబంధించిన అక్ర‌మాలు ఇక్క‌డ మాత్ర‌మే వెలుగుచూస్తున్నాయి. అయితే మీడియాను త‌మ‌కు అనుకూలంగా వాడుకోవ‌టంలో ఏ పార్టీ కూడా త‌క్కువేమీ కాదనే చెప్పొచ్చు.మిగిలిన ఛాన‌ళ్లు కూడా ఎవ‌రి ఏజెండా ప్ర‌కారం వాళ్లు ముందుకు సాగుతున్నారు. అంతిమంగా అంద‌రూ క‌ల‌సి చేసేది ప్ర‌జ‌ల ఏజెండాను వ‌దిలేసి..పార్టీల ఏజెండాల‌ను మోయ‌ట‌మే.

Next Story
Share it