మోడీ ఫోటో మిస్ కొట్టడం వెనక కథ ఏంటి!

తెలుగు దేశం పార్టీ పేస్ బుక్ పేజీ లో ఎప్పటికప్పుడు హెడర్స్ (శీర్షికలు) మారుస్తూ ఉంటారు. కొద్ది రోజుల క్రితం వరకు ఆ పేజీ హెడర్ గా తిరంగా యాత్ర ఫోటో ఉండేది. ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం కొలువుతీరి ఏడాది పూర్తి అయిన సందర్భంగా ఈ పేజీ లో కొత్త హెడర్ పెట్టారు. ఇది ఎప్పుడూ జరిగేది అయినా కూడా ఇందులో ఉన్న ఫోటో ఒకటి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సహజంగా టీడీపీ పేజీ లో పార్టీ నిర్వహించే ఈవెంట్స్ తో పాటు చంద్రబాబు, నారా లోకేష్ లు ఇతర పార్టీ ల నాయకులను కలిసినా ఆ వివరాలు అందులో షేర్ చేస్తారు.. ఇది అందరూ చేసే పనే. కానీ అధికార టీడీపీ చేసిన పని ఇప్పుడు విచిత్రంగా ఉంది. పేస్ బుక్ పేజీ హెడర్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ల ఫోటో లు ప్రముఖంగా పెట్టారు. ఇది ఎప్పుడూ ఉండేది. కాకపోతే ఈ సారి ఇందులో టీడీపీ ఆంధ్ర ప్రదేశ్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస రావు తో పాటు జనసేన అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటో కూడా టీడీపీ పేస్ బుక్ పేజీ హెడర్ లో పెట్టడం చూసి సొంత పార్టీ నాయకులు కూడా అవాక్కు అవుతున్నారు.
పవన్ కళ్యాణ్ ముందు ఎంతో చరిత్ర ఉన్న టీడీపీ మరీ ఇంతగా సాగిలపడాలా అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఏడాది కాలంలో ప్రభుత్వం విజయాలను ప్రస్తావిస్తూ ఇది పెట్టారు. అయితే ఇక్కడ మరో విశేషం ఏమిటి అంటే కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీ నుంచి ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో పెట్టకపోవడం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పార్టీ పేజీ హెడర్ లో పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టడమే తప్పు అయితే...పవన్ ఫోటో పెట్టి మోడీ ఫోటో పెట్టకపోవడం మరింత దారుణం అనే విమర్శలు వినిపిస్తున్నాయి.
కొద్ది నెలల క్రితం జరిగిన జనసేన ఆవిర్భావ సభలో కూడా పవన్ కళ్యాణ్ మొన్నటి ఎన్నికల్లో తాను నిలబడటమే కాకుండా నలభై ఏళ్ళ చరిత్ర ఉన్న టీడీపీ ని నిలబెట్టానని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. పార్టీని డ్యామేజ్ చేసేలా పవన్ కళ్యాణ్ మాట్లాడినా కూడా అటు చంద్రబాబు, ఇటు నారా లోకేష్ లు నోరు తెరిచి దీనిపై స్పందించిన దాఖలాలు లేవు. ఇప్పుడు ఎన్నడూలేని రీతిలో ఏకంగా టీడీపీ పేస్ బుక్ పేజీ హెడర్ లో పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టడం టీడీపీ క్యాడర్ కు ఏ మాత్రం రుచించటం లేదు. పోనీ హెడర్ లో ప్రధాని నరేంద్ర మోడీ పెట్టడం సరికాదు అని భావించినా కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురేందేశ్వరి ఫోటో అయినా కూడా పెట్టి ఉండాలి కదా అన్న సందేహాన్ని ఆ పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మధ్య ఇస్తున్న ప్రభుత్వ యాడ్స్ లో మాత్రం పవన్ కళ్యాణ్ తో పాటు అయన శాఖకు సంబంధం ఏ మాత్రం సంబంధము లేకపోయినా కూడా నారా లోకేష్ ఫోటో కూడా జత చేస్తున్నారు. ఇది అంతా కూడా అటు ప్రభుత్వంలో...ఇటు పార్టీ నారా లోకేష్ ను నెంబర్ టూ గా ప్రాజెక్ట్ చేసే వ్యవహారం అని పార్టీ నేతలే చెపుతున్నారు.



