Telugu Gateway
Andhra Pradesh

కొత్త రోడ్ల నిర్మాణానికి 6400 కోట్లు

కొత్త రోడ్ల నిర్మాణానికి 6400 కోట్లు
X

వ‌చ్చే వ‌ర్షాకాలం నాటికి రోడ్లు బాగు చేయాలి

అధికారుల‌కు ఆదేశాలు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంకు సహాయంతో రూ. 6,400 కోట్ల ఖర్చుతో కొత్తరోడ్లకు కార్యాచరణ సిద్ధం చేసిన‌ట్లు అధికారులు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి వివ‌రించారు. మండల కేంద్రాలనుంచి జిల్లా కేంద్రాలకు రెండు లేన్లతో మంచి రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్ట‌నున్నారు. ఈ ప్రాజెక్టు వివరాలను సీఎంకు అధికారులు తెలప‌గా...దీనిపై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ పెట్టాల్సిందిగా సీఎం జ‌గ‌న్ ఆదేశించారు. జ‌గ‌న్ సోమ‌వారం నాడు ఏపీలోని ర‌హ‌దారులు, ఓడ‌రేవులు, విమానాశ్ర‌యాల‌కు సంబందించిన అంశాల‌పై స‌మీక్ష నిర్వహించారు. వ‌ర్షాలు త‌గ్గుముఖం ప‌ట్టిన వెంట‌నే ముందు రోడ్ల‌ను బాగు చేయ‌టంపై దృష్టి పెట్టాల‌న్నారు. ఈ ప‌నులుఅన్నీ మ‌ళ్ళీ వ‌ర్షాకాలం వ‌చ్చేలోగా పూర్తి కావాల‌ని ఆదేశించారు. ఈ స‌మావేశంలో సీఎం జ‌గ‌న్ వ్యాఖ్య‌లు..'మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లపై ప్రత్యేక దృష్టిపెట్టాం. గత ప్రభుత్వంలో రోడ్లను పూర్తిగా విడిచిపెట్టారు. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఏడాదీ వర్షాలు మంచిగా పడ్డాయి. దేవుడి దయవల్ల వర్షాలు బాగా పడ్డం వల్ల రైతులు సంతోషంగా ఉన్నారు. వర్షాలు పడ్డం వల్ల మరోవైపు రోడ్లు కూడా దెబ్బతిన్నాయి. రోడ్లను బాగుచేయడనికి ఈ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది.

వనరుల సమీకరణలో అనేక చర్యలు తీసుకుంది. ఒక నిధిని కూడా ఏర్పాటు చేసింది.దురదృష్టవశాత్తూ ఒక్క చంద్రబాబుతోనే కాదు పచ్చమీడియాతోనూ మనం యుద్ధం చేస్తున్నాం. ముఖ్యమంత్రి పీఠంలో చంద్రబాబు లేకపోవడంతో వీరు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకనే ప్రతి విషయంలో వక్రీకరణలు చేస్తున్నారు. ఇవన్నీ ఉన్నాకూడా, నెగెటివ్‌ ఉద్దేశంతో ప్రచారం చేసినా.. మనం చేయాల్సిన పనులు చేద్దాం. మనం బాగా పనిచేసి పనులన్నీ పూర్తిచేస్తే... నెగెటివ్‌ మీడియా ఎన్నిరాసినా ప్రజలు వాటిని గమనిస్తారు' అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని పోర్టుల ప‌రిస్థితిని కూడా అధికారులు వివ‌రించారు. రామాయపట్నం పోర్టు నిర్మాణాన్ని 24 నెలల్లో పూర్తిచేస్తామని అధికారులు తెలిపారు. అక్టోబరు చివరి నాటికి భావనపాడు పోర్టుకు టెండర్ల ప్రక్రియ పూర్తవుతుందన్నారు. మచిలీపట్నం పోర్టుకు సెప్టెంబరు 14లోగా టెండర్ల ప్రక్రియ ముగుస్తుందని వివ‌రించారు. భోగాపురం విమానాశ్ర‌యంతోపాటు ప‌లు ఎయిర్ పోర్టుల‌పై కూడా సీఎం చ‌ర్చించారు. విశాఖపట్నం, తిరుపతి ఎయిర్‌పోర్టులనుంచి అంత‌ర్జాతీయ కనెక్టివిటీని అభివృద్ధిచేయాలని సీఎం అధికారుల‌కు సూచించారు.

Next Story
Share it