సీఎం, డిప్యూటీ సీఎం టూర్ వివరాలు దాచి డేటానా?!

సొంత పేజీ లో అన్ని నెగిటివ్ కామెంట్సే!
తెలుగు దేశం పార్టీ అధికారిక పేస్ బుక్ పేజీ లో గత కొంత కాలంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కంటే అయన తనయుడు, మంత్రి నారా లోకేష్ ను ఎక్కువ ఎలివేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అసలు రాష్ట్రం కోసం కష్టపడుతున్నది సీఎం చంద్రబాబు కంటే మంత్రి నారా లోకేషే అన్న చందంగా వీళ్ళ ప్రచారాలు ఉంటున్నాయి ఒక్కో సారి. పెట్టుబడుల సాధన దగ్గర నుంచి పలు విషయాల్లో చంద్రబాబు కంటే లోకేష్ నే ఎక్కువగా ఈ పేజీ లో తెగ ప్రమోట్ చేసుకుంటున్నారు. భవిష్యత్ నేత కాబట్టి ఇప్పటి నుంచే ఎక్కువ ఎలివేషన్స్ ఇస్తున్నారు. అయితే ఇది ఒక రేంజ్ వరకు ఉంటే ఒకే. అతి ప్రచారం చేస్తే అసలుకే మోసం వస్తుంది అన్నట్లు ఉంది ఈ వ్యవహారం. గత కొన్ని రోజులుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లు తరచూ స్పెషల్ ఫ్లైట్స్ లో...హెలికాప్టర్ లో తిరుగుతూ ప్రజాధనాన్ని పెద్ద ఎత్తున ఖర్చు పెడుతున్నారు అంటూ సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున పోస్ట్ లు దర్శనం ఇచ్చాయి. సాక్షి మీడియా లో కూడా దీనిపై వార్తలు వచ్చాయి.
అయితే ఈ ప్రచారం..లెక్కల విషయంలో ఎక్కడా క్లారిటీ లేదు. కాకపోతే టీడీపీ అధికారిక సోషల్ మీడియా పేజీ లో మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తన హయాంలో చేసిన ఖర్చు వివరాలు ప్రకటించారు. ఈ మొత్తం ఏకంగా 222 కోట్ల రూపాయలు ఉంది అన్నారు. ఇందులో హెలికాఫ్టర్లకు 87 కోట్ల రూపాయలు..ఫ్లైట్స్ తో పాటు ఇతర ఖర్చులు కలుపుకుని 135 కోట్ల రూపాయల వరకు ఖర్చుపెట్టినాలు తెలిపారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 18 నెలల్లో మంత్రిగా నారా లోకేష్ పర్యటనల కోసం వినియోగించిన హెలికాప్టర్/స్పెషల్ ఫ్లైట్ల కోసం ప్రభుత్వం నుంచి రూపాయి కూడా తీసుకోలేదు అని ఆ పోస్ట్ లో స్పష్టం చేశారు. ప్రభుత్వం నుంచి తీసుకోలేదు అంటే ఈ బిల్లులు ఎవరూ చెల్లించారు అనే ప్రశ్న కూడా ఉదయించక మానదు. నారా లోకేష్ ను సొంత పార్టీ కి చెందిన ఎంపీలు..లేదా ఇతరులు ఆ పర్యటనల ఖర్చు భరించారా అన్న చర్చ కూడా తెర మీదకు వస్తోంది. జగన్ హయాంలో పెట్టిన లెక్కలు అధికారిక లెక్కలే అనుకుందాం. కానీ ఇక్కడ చూపించాల్సింది ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు ఉంటే గింటే నారా లోకేష్ లెక్కలు కూడా పెట్టాలి.
కానీ గత ముఖ్యమంతి జగన్ మోహన్ రెడ్డి లెక్కలు పెట్టి ..చాలా కన్వీనెంట్ గా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లెక్కలు మాత్రం దాచిపెట్టారు. ఇది అంతా చూస్తుంటే నారా లోకేష్ ను ఏదో ముఖ్యమంత్రి స్థాయికి ఎలివేట్ చేసే ప్రయత్నం తప్ప..మరొకటి కాదు అనే విషయం స్పష్టంగా తేలిపోతోంది. టీడీపీ అధికారికంగా పెట్టిన పోస్ట్ పై ఎక్కువ శాతం నెగిటివ్ కామెంట్స్ మాత్రమే ఉన్నాయి. అసలు సీఎం గా పనిచేసిన జగన్ హయాంలో లెక్కలకు....మంత్రి నారా లోకేష్ లెక్కలకు ఎలా పోలిక పెడతారు అంటూ ప్రశ్నిస్తున్నారు . మరి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లెక్కలు ఎందుకు దాచి పెట్టారు అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఇది అంతా చూస్తే టీడీపీ ఏదో చేయాలనుకుంటే..ఏదో అయినట్లు అయింది పరిస్థితి. ఈ కామెంట్స్ చూసి తెలుగు దేశం నేతలు కూడా అవాక్కు అవుతున్నారు. ఎవరైనా సరే తప్పుడు ప్రచారం చేస్తే కౌంటర్ ఇవ్వాలి కానీ..ఇలా సీఎం, డిప్యూటీ సీఎం లెక్కలు దాచిపెట్టి జనంతో తిట్టించుకోవటం ఎందుకో అర్ధం కావటం లేదు అని టీడీపీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు.



