ఒక ఖనిజం ఎంపీకి..మరో ఖనిజం బెంగళూరు కాంట్రాక్టర్ కు
మాకొద్దు బాబోయ్ కూటమి సర్కారు?!
గనుల లీజు హోల్డర్ల గగ్గోలు
ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం కొలువు తీరి నిండా ఇంకా ఏడాది కూడా కాలేదు. కానీ నెల్లూరు జిల్లాలో మైనింగ్ లీజ్ దారులు మాత్రం బాబోయ్ ఈ కూటమి ప్రభుత్వం మాకొద్దు అని గగ్గోలు పెడుతున్నారు. వైసీపీ ప్రభుత్వమే ఎన్నో అరాచకాలు చేసింది అనుకుంటే...ఇప్పుడు పరిస్థితి అంత కంటే దారుణంగా ఉంది అని మైన్ లీజ్ దారులు వాపోతున్నారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే అంతా సర్దుకుంటుంది అని భావిస్తే సీన్ రివర్స్ అయింది అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మైనింగ్ లీజ్ ల విషయానికి వస్తే గని లీజు వారిదే అయినా కూడా యువమంత్రి చెప్పిన వాళ్లకు ఆ ఖనిజం అప్పగించాల్సిందే. అంతే తప్ప వాళ్ళు తమకు నచ్చిన చోట, నచ్చిన ధరకు అమ్ముకోవటానికి కూడా ఛాన్స్ లేదు అన్నది కొంత మైనింగ్ లీజ్ దారులు చెపుతున్న మాట. నెల్లూరు జిల్లా లో పెద్ద ఎత్తున ఉన్న క్వార్ట్జ్ మైనింగ్ లీజ్ ల వ్యవహారం ఒక ఎంపీకి, సిలికా లీజ్ ల వ్యవహారం మరో బెంగళూరు కాంట్రాక్టర్ కు అప్పగించినట్లు టీడీపీ వర్గాలే చెపుతున్నాయి.
వీళ్ళిద్దరూ ఈ రెండు కీలక ఖనిజాల లీజు దారుల నుంచి ఖనిజాలు తీసుకుని దందా సాగిస్తున్నారు. అటు క్వార్ట్జ్ అయినా..ఇటు సిలికా అయినా ఇప్పుడు వాళ్ళు చెప్పిన వాళ్లకు...వాళ్ళు చెప్పిన రేట్ కు ఇస్తే ఓకే. లేదు అంటే గనుల శాఖ నుంచి పర్మిట్స్ రావు. పర్మిట్స్ కోసం కొంత మంది లీజ్ దారులు ఏకంగా కోర్టు ను ఆశ్రయించాల్సి వచ్చింది అంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు. కోర్టు చెప్పినా కూడా కొద్ది రోజులు పాటు ఏవో కొన్ని పర్మిట్స్ ఇచ్చి...తర్వాత మళ్ళీ యధావిధిగానే పాత మోడల్ నే ఫాలో అవుతున్నట్లు చెపుతున్నారు. పర్మిట్స్ లేకుండా ఎంత పెద్ద మైనింగ్ లీజు ఉన్నా ఉపయోగం ఉండదు. దీంతో లీజ్ దారులు తమ తమ మైన్స్ లో ఖనిజాలు తవ్వాలంటే యువ మంత్రి చెప్పిన వాళ్లకు..చెప్పిన రేట్ కు మినరల్స్ ఇవ్వాల్సిందే.
వాస్తవానికి ఆ మంత్రికి గనుల శాఖతో ఏ మాత్రం సంబంధము లేకపోయినా అక్కడ అంతా ఆయన హవానే నడుస్తోంది. ఈ మొత్తం వ్యవహారంతో అధికారంలో ఉన్న వాళ్ళు వందల కోట్ల రూపాయల దందా సాగిస్తున్నట్లు చెపుతున్నారు. అనధికారికంగా..అక్రమంగా సంపాధించిన డబ్బును వైట్ గా మార్చుకునేందుకు మరి కొంతమందితో కలిసి ఈ ఖనిజాలు ఉన్న ప్రాంతంలోనే ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా ఏర్పాటు చేసేందుకు వేగంగా పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఈ ఏడాది ఫిబ్రవరి 20 న కేంద్ర ప్రభుత్వం క్వార్ట్జ్ , మైకా, ఫెల్స్ ఫర్, బెరైటీస్ ఖనిజాలను మైనర్ మినరల్స్ నుంచి మేజర్ మినరల్స్ గా మార్చుతూ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో ఇక నుంచి కొత్తగా ఈ ఖనిజాల లీజ్ లు జారీ చేసే అధికారం కేంద్రం చేతుల్లోకి వెళుతుంది. అయినా కూడా రాష్ట్రంలో ఉన్న ఏ ఖనిజం తవ్వి వెలికితీయాలన్న గనుల శాఖ కు రాయల్టీ కట్టి పర్మిట్స్ తీసుకోవాల్సిందే. నెల్లూరు జిల్లా లో వందల సంఖ్యలో క్వార్ట్జ్, సిలికా మైన్స్ ఉండటంతో యువ మంత్రి అధికారంలోకి వచ్చిన వెంటనే వీటిపై ఫోకస్ పెట్టి అంతా తనకు అనుకూలంగా వ్యవహారాన్ని సెట్ చేసుకున్నట్లు చెపుతున్నారు.