హిందీ జాతీయ భాష అనటంతో పెద్ద ఎత్తున విమర్శలు

నారా లోకేష్. ఆంధ్ర ప్రదేశ్ విద్యా, ఐటి శాఖల మంత్రి. ఆయన్ను భవిష్యత్ నేతగా ప్రోజెక్టు చేసేందుకు ముక్యమంత్రి చంద్రబాబు దగ్గర నుంచి పార్టీ నాయకులు అంతా గత కొంత కాలంగా అలుపెరగని రీతిలో శ్రమిస్తున్నారు. అత్యంత కీలకమైన విద్యా శాఖ మంత్రి గా ఉన్నా నారా లోకేష్ ఇండియా టుడే టివీకి ఇచ్చిన ఇంటర్వ్యూ లో తన పరువు తానే తీసుకున్నారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియా లో పెద్ద వైరల్ గా మారింది. గత కొంత కాలంగా కేంద్రం తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) 2020 పై పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. పలు రాష్ట్రాలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వం కూడా త్రిభాషా విధానం దుమారం రేపటంతో ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు తప్పనిసరిగా హిందీ కూడా నేర్పించాలి అనే నిర్ణయం నుంచి వెనక్కి తగ్గింది. తమిళనాడు తో పాటు పలు ఇతర రాష్ట్రాలు కూడా ఈ ప్రతిపాదనను గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ తరుణంలో నారా లోకేష్ ఇండియా టుడే కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో హిందీ జాతీయ భాష అంటూ అడ్డంగా బుక్ అయ్యారు.
ఒక వైపు టీవీ యాంకర్ హిందీ జాతీయ భాష కాదు అని చెపుతున్నా కూడా లోకేష్ మాత్రం ఏ మాత్రం ఆగకుండా ఆయన ఇదే స్టాండ్ పై ఉంటూ హిందీ ని ప్రమోట్ చేయటంలో తప్పులేదు అంటూ చెప్పుకొచ్చారు. దేశంలోని ప్రజలందరి మధ్య అనుసంధాన భాష గా హిందీ ఉంటే తప్పేమి కాదు అని...ఎన్ని ఎక్కువ భాషలు నేర్చుకుంటే అంత ఎక్కువ లాభం ఉంటుంది అని చెప్పుకొచ్చారు. ఒక వైపు బీజేపీ పాలిత రాష్ట్రం అయిన మహారాష్ట్రలో కూడా హిందీ పై వెనక్కి తగ్గిన వేళ నారా లోకేష్ మాత్రం మోడీ సర్కారు తీసుకొచ్చిన విధానానికి జై కొట్టడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒక వైపు ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మరో వైపు నారా లోకేష్ లు ప్రధాని మోడీ, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ల దగ్గర ఎక్కువ మార్కులు కొట్టేసేందుకు అన్న చందంగా హిందీ విషయంలో పోటీలు పడీ మరి ప్రకటనలు చేస్తున్నారు. ఇటీవలే పవన్ కళ్యాణ్ హిందీ ని పెద్దమ్మ భాష ని విమర్శలు ఎదుర్కోగా..ఇప్పుడు నారా లోకేష్ హిందీ జాతీయ భాష అంటూ అడ్డంగా బుక్ అయ్యారు. దీంతో ఆయనపై సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున ట్రోలింగ్ సాగుతోంది. విద్యాశాఖా మంత్రి అయిన నారా లోకేష్ కు హిందీ అధికారిక భాషల్లో ఒకటి అని కూడా తెలియదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.



