నారా లోకేష్...ఏపీ భవిష్యత్ ముఖ్యమంత్రి!
ఆంధ్ర ప్రదేశ్ కు పెట్టుబడుల సాధనే లక్ష్యంగా ఐటి, మానవనరుల శాఖ మంత్రి నారా లోకేష్ గత కొన్ని రోజులుగా అమెరికాలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా అయన పలు దిగ్గజ సంస్థల సీఈఓ లతో భేటీ అయ్యారు. ఆంధ్ర ప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టాలని కోరారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ నారా లోకేష్ అమెరికా టూర్ కు సంబదించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో హల్చల్ చేస్తోంది. అదేంటి అంటే...ఆంధ్ర ప్రదేశ్ భవిష్యత్ ముఖ్యమంత్రి కి స్వాగతం అంటూ ఒక ఫ్లెక్సీని బుల్లి విమానానికి కట్టి తిప్పారు. అందులోదే పైన కనిపించే ఫోటో. సహజంగా కొత్త సినిమాల ప్రొమోషన్స్ సమయంలో ఆయా హీరోల ఫాన్స్ ఇలాంటి ప్రచారాలు చేస్తుంటారు. కానీ ఇప్పుడు నారా లోకేష్ ను ఏపీ ఫ్యూచర్ సీఎం అంటూ ఇలా ప్రచారం చేసింది తెలుగు దేశం శ్రేణులా..లేక లోకేష్ అభిమానులా అన్న సంగతి తేలాల్సి ఉంది.
ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్యాబినెట్ సమావేశాల దగ్గర నుంచి ప్రతి మీటింగ్ లోనూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు సమానంగా నారా లోకేష్ కు చోటు కలిపిస్తున్న విషయం తెలిసిందే. నారా లోకేష్ కు కూడా ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలనే విషయంలో చంద్రబాబుపై అటు కుటుంబ సభ్యుల నుంచి ..పార్టీ లో కొంత మంది నాయకుల నుంచి ఒత్తిడి ఉన్నట్లు టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలో నారా లోకేష్ భవిష్యత్ ముఖ్యమంత్రి అని ఇప్పుడే ప్రచారం చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అన్నదే కీలకంగా మారింది. సహజంగా చంద్రబాబు తర్వాత టీడీపీ సారధ్య బాధ్యతలు అయినా...టీడీపీ లో సీఎం పదవి అయినా లోకేష్ కే దక్కుతుంది. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానాలు లేవు. కానీ ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో టీడీపీ, జనసేన, బీజేపీ లు కలిసి కూటమిగా ప్రభుత్వం ఏర్పాటు చేసి ఉన్న తరుణంలో ఈ తరహా ప్రచారాలు కొత్త సమస్యలు తెచ్చిపెట్టే అవకాశం ఉంది అనే అభిప్రాయాన్ని కొంత మంది నాయకులు వ్యక్తం చేస్తున్నారు.