లోకేష్ జూమ్ మీటింగ్ లోకి కొడాలి నాని..వల్లభేని వంశీ
టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జూమ్ మీటింగ్ లో కలకలం. ఈ సమావేశంలోకి మాజీ మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, వైసీపీ నేత దేవేందర్ రెడ్డి ఎంట్రీ ఇచ్చారు. ఈ పరిణామం టీడీపీ వర్గాలను షాక్ కు గురిచేసింది. పదవ తరగతి విద్యార్ధులతో లోకేష్ సమావేశం నిర్వహిస్తుండగా ఈ పరిణామం జరిగింది. అయితే జూమ్ సమావేశంలో వైసీపీ నేతలు కన్పించటంతో సమావేశాన్ని అర్ధాంతరంగా ఆపేశారు. వైసీపీ నేతలు లోకేష్ తో మాట్లాడేందుకు ప్రయత్నించారు. అయితే జూమ్ లో కాదని..వైసీపీ నేతలతో నేరుగా మాట్లాడతానని లోకేష్ ఆ తర్వాత ఛాలెంజ్ విసిరారు. పదవ తరగతి పరీక్షల్లో ఏకంగా రెండు లక్షల మంది విద్యార్ధులు ఫెయిల్ కావటంతో దీనిపై రాజకీయ దుమారం రేగుతోంది. ఇది ప్రభుత్వ వైఫల్యమే అని టీడీపీ, జనసేన ఆరోపిస్తున్నాయి.
లేదు టీచర్లు పక్కాగా పేపర్లు దిద్దినందునే ఇలా జరిగింది..కోవిడ్ కూడా ఓ కారణం కావొచ్చు అంటూ ప్రభుత్వం సమర్ధించుకుంటోంది. అయితే తాము 8,9వ తరగతి పరీక్షలు రాయలేదని..క్లాస్ లు కూడా జరగలేదని విద్యార్ధులు వాపోతున్నారు. నేరుగా పదవ తరగతి పరీక్షలు రాయటం వల్ల కొంత ఇబ్బంది వచ్చిందని..తమకు గ్రేస్ మార్కులు ఇవ్వాలని ఫెయిల్ అయిన విద్యార్ధులు కోరుతున్నారు. విద్యార్దుల పేరుతో వారి వారి కార్యాలయాల నుంచే జూమ్ మీటింగ్ లోకి ఎంట్రీ ఇచ్చినట్లు చెబుతున్నారు. టీడీపీ ప్రతిదీ రాజకీయం చేస్తోందని..అందుకే తాము జూమ్ లోకి వచ్చామని దేవేందర్ రెడ్డి ఓ ఛానల్ తో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. స్క్రిప్ట్ ప్రకారమే లోకేష్ జూమ్ మీటింగ్ జరుగుతోందని ఆరోపించారు. కొడాలి నాని, వల్లభనేని వంశీలను చూసి సమావేశం కట్ చేశారన్నారు. ప్రతిదీ రాజకీయం చేయటం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు.