ఈ స్పెషల్ ట్రీట్ మెంట్ అందుకేనా!
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న ఐదేళ్లు ప్రభుత్వం తరపున ఇచ్చిన జాకెట్ యాడ్స్, ఫుల్ పేజీ ప్రకటనల్లో ఎక్కడా కనీసం మంత్రుల ఫోటో లు కూడా వేయలేదు. అసలు ప్రచారం అంటే ఎలా ఉంటదో తెలియదు అన్నట్లు మాట్లాడిన ఆయన ప్రకటనలకే వందల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టారు. ఆ ప్రకటనల్లో ఎక్కడా తాను తప్ప మరెవరూ కనిపించకుండా చూసుకున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారింది...టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి అమలు చేసింది పెన్షన్ పెంపు పథకమే. ఆ పథకం అమలు సమయంలో ఇచ్చిన ఫుల్ పేజీ. జాకెట్ యాడ్స్ లో ఎక్కడా సంబంధిత శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఫోటో కూడా వేయలేదు. దీంతో చంద్రబాబు కూడా జగన్ మోడల్ ఫాలో అవుతున్నారు అనే విమర్శలు ఎదుర్కొన్నారు. తాజాగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ దీపం స్కీం అమలు స్టార్ట్ చేసింది. దీపావళి సందర్భంగా ఈ పథకాన్ని అమల్లోకి తెచ్చారు.
అయితే ఇక్కడ విచిత్రం ఏమిటి అంటే ఈ ప్రకటనలో మాత్రం ఒక వైపు ప్రధాని నరేంద్ర మోడీ తో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, సివిల్ సప్లైస్ శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, ఐటి, మానవవనరుల శాఖ మంత్రి నారా లోకేష్ ఫోటో కూడా యాడ్ చేశారు. అసలు నారా లోకేష్ కు...ఈ స్కీం అమలుకు సంబంధం ఏమి ఉంది?. కేవలం మంత్రిగా అయితే మిగిలిన క్యాబినెట్ మంత్రుల ఫోటో లు కూడా పెట్టాలి కదా. అలా కాకుండా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు నారా లోకేష్ ఫోటో ను ప్రత్యేకంగా ఆ యాడ్ లో చేర్చటం హాట్ టాపిక్ గా మారింది. దీపం పథకానికి సంబంధించిన యాడ్ లో ప్రధాని మోడీ ఫోటో పెట్టారు అంటే సిలిండర్ పై కేంద్రం కాస్తో కూస్తో సబ్సిడీ ఇస్తుంది కాబట్టి అనుకోవచ్చు. కానీ ఇందులో అటు పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఫోటో లు పెట్టాల్సిన అవసరం ఏమి లేదు అన్నది కొంత మంది అధికారులు చెపుతున్న మాట.
గతంలో సుప్రీం కోర్ట్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం ముఖ్యమంత్రి, ఏ శాఖ కార్యక్రమం అయితే ఆ శాఖ మంత్రి ఫోటో లు మాత్రమే పెట్టాలని ఆదేశించినట్లు చెపుతున్నారు. ఇప్పుడు అలా కాకుండా ప్రభుత్వ ప్రకటనల్లో ఏదో ఫ్యామిలీ ఫంక్షన్ లాగా తమకు కావాల్సిన వాళ్ళ ఫోటోలు పెట్టుకోవటం సరికాదు అని ఒక అధికారి వ్యాఖ్యానించారు. ఇటీవల అమెరికా లో పర్యటించిన నారా లోకేష్ ను ఆంధ్ర ప్రదేశ్ భవిష్యత్ ముఖ్యమంత్రిగా అభివర్ణిస్తూ విమానానికి ఫ్లెక్సీ కట్టి ప్రచారం చేశారు. ఇప్పుడు ప్రభుత్వ ప్రకటనలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటో వేసినందుకే..నారా లోకేష్ ఫోటో ను ఇందులో పెట్టారా అన్న అనుమానాలు పార్టీ నాయకుల్లోనే వ్యక్తం అవుతున్నాయి. అమెరికాలో జరిగిన ప్రచారానికి..ఇక్కడ యాడ్ లో సంబంధము లేకపోయినా లోకేష్ ఫోటో యాడ్ చేయటానికి ఏమైనా లింక్ ఉందా అన్న చర్చ కూడా సాగుతోంది.