Telugu Gateway
Andhra Pradesh

నారా లోకేష్ యువగళం సాగుతుందా?!

నారా లోకేష్ యువగళం సాగుతుందా?!
X

యువ గళం పాదయాత్రను తిరిగి ప్రారంభించేందుకు రెడీ అవుతున్న తెలుగు దేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హై కోర్ట్ లో ముందస్తు బెయిల్ కోసం పిటీషన్ దాఖలు చేశారు. సిఐడి ఇటీవలే నారా లోకేష్ పేరును ఇన్నర్ రింగ్ రోడ్ కేసు లో చేర్చిన విషయం తెలిసిందే. ఇందులో నారా లోకేష్ ను ఏ 14 గా పేర్కొంటూ సిఐడి ఏసిబీ కోర్ట్ లో మెమో దాఖలు చేసింది. దీంతో నారా లోకేష్ ను కూడా అరెస్ట్ చేసేందుకు అధికార వైసీపీ రెడీ అయింది అనే చర్చ తెరపైకి వచ్చింది. గత కొన్ని రోజులుగా నారా లోకేష్ ఢిల్లీ లోనే ఉన్నారు. మరి అయన ఆంధ్ర ప్రదేశ్ కు వచ్చిన వెంటనే సిఐడి అరెస్ట్ చేస్తుందా లేదా అన్నది వేచిచూడాల్సిందే. ఈ తరుణంలో లోకేష్ ముందస్తు బెయిల్ కు కోర్ట్ లో పిటీషన్ వేశారు. ఇన్నర్ రింగ్ రోడ్ కేసు లో ఏ 14 గా చేర్చటం పై స్పందించిన లోకేష్ అసలు ఇన్నర్ రింగ్ రోడ్ తో తనకు ఏమి సంబంధం అని ప్రశ్నించారు.

ఇప్పటికే స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసు విషయంలో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయి గత పందొమ్మిది రోజులుగా జైలు లో ఉన్నారు. ఇప్పుడు రింగ్ రోడ్ కేసు లో లోకేష్ పేరు కూడా చేర్చటంతో ఇది అంతా రాజకీయ కుట్రలో భాగంగానే అధికార వైసీపీ చేస్తోంది అని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. సరిగ్గా ఎన్నికల ముందు వరసపెట్టి కేసు లను తెరపైకి తీసుకువస్తుండటంతో పార్టీ నేతలు కూడా పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కోర్టు లకు వరస సెలవలు వస్తున్న తరుణంలో లోకేష్ పిటీషన్ ఎప్పుడు విచారణకు వస్తుంది..ఆయనకు వెంటనే ఊరట దక్కుతుందా అన్నది వేచిచూడాల్సిందే.

Next Story
Share it