వ్యక్తిగత పర్యటన అయినా విమర్శలకు ఛాన్స్
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ల తో పాటు నారా బ్రాహ్మణి కూడా దావోస్ పర్యటనకు వెళ్ళటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రాష్ట్రానికి పెట్టుబడుల సాధనతో పాటు దావోస్ లో ఆంధ్ర ప్రదేశ్ గ్రోత్ స్టోరీ ని ప్రమోట్ చేయటం కోసం ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు చంద్రబాబు అధికారికంగా ప్రకటించారు. ప్రభుత్వం ఈ మేరకు వీరి పర్యటనల కోసం అధికారికంగా జీవో లు జారీ చేసింది. ఈ టీం లో స్వయంగా పారిశ్రామికవేత్త అయిన నారా బ్రాహ్మణి కూడా ఉండటం ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వ టీం తో సంబంధం లేకుండా ఆమె తన సొంత ఖర్చులతోనే ఈ పర్యటనకు వెళ్లి ఉండొచ్చు. కానీ ఒక వైపు స్వయంగా నారా బ్రాహ్మణి మామ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. భర్త నారా లోకేష్ ఐటి మంత్రి. పారిశ్రామికవేత్త అయిన నారా బ్రాహ్మణి వీళ్ళతో కలిసి వెళ్ళటం ప్రజలకు మంచి సంకేతం పంపదు అనే చర్చ అధికార వర్గాల్లో సాగుతోంది. నారా బ్రాహ్మణి హెరిటేజ్ ఫుడ్స్ లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ) గా ఉన్న విషయం తెలిసిందే.
ఒక వైపు రాష్ట్రానికి పెట్టుబడులు సాధించటం కోసం అని చెపుతూ...చంద్రబాబు, లోకేష్ లు తమ వెంట నారా బ్రాహ్మణి ని కూడా తీసుకెళ్లటం అంటే సొంత వ్యాపారాల అభివృద్ధి కోసం ....అక్కడకు వచ్చే దిగ్గజ పారిశ్రామికవేత్తలతో సమావేశాల్లో పాల్గొనేందుకే అనే విమర్శలు వచ్చే అవకాశం లేకపోలేదు అనే చర్చ సాగుతోంది. అయితే చంద్రబాబు నాయుడు తో పాటు నారా లోకేష్ లు ఇప్పుడు ఇలాంటివి ఆలోచించే పరిస్థితిలో లేరు అని ఒక టీడీపీ కీలక నేత వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే జ్యూరిచ్ ఎయిర్ పోర్ట్ లో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ భేటీలో మంత్రులు శ్రీధర్ బాబు, నారా లోకేష్ తో పాటు కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడు కూడా ఉన్నారు.