నాకు జరిగిన అవమానం ఎవరికీ జరగకూడదు
ఏపీ అసెంబ్లీలో చోటుచేసుకున్న పరిణామాలపై నారా భువనేశ్వరి తొలిసారి స్పందించారు. ఆమె ఈ మేరకు శుక్రవారం నాడు ఓ ప్రకటన విడుదల చేశారు. 'ఆంధ్రప్రదేశ్ శాసనసభలో నాపై చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల.. నిరసన వ్యక్తం చేసినవారందరికీ పేరు పేరునా ధన్యవాదాలు. నాకు జరిగిన అవమానాన్ని మీ తల్లికి, తోబుట్టువుకు, కూతురికి జరిగినట్లుగా భావించి నాకు అండగా నిలబడటం జీవితంలో మర్చిపోలేను. చిన్నతనం నుంచి మా అమ్మానాన్న విలువలతో పెంచారు. నేటికీ మేం వాటిని పాటిస్తున్నాం. విలువలతో కూడిన సమాజం కోసం అందరూ కృషి చేయాలి. కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలబడాలి. ఇతరుల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా.. గౌరవానికి భంగం కలిగించేలా వ్యవహరించకూడదు.
నాకు జరిగిన ఈ అవమానం ఎవరికీ జరగకూడదు'' అని భువనేశ్వరి తన బహిరంగ ప్రకటనలో పేర్కొన్నారు. ఏపీలో ఈ వ్యవహారం గత కొన్నిరోజులుగా దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. అధికార వైసీపీ సభ్యులు భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని చంద్రబాబు దగ్గర నుంచి టీడీపీ ఎమ్మెల్యేలు విమర్శలు చేస్తుంటే..వైసీపీ మాత్రం అలాంటిది ఏమీ లేదని కొట్టిపారేస్తోంది. రికార్డుల్లో భువనేశ్వరిని దూషించినట్లు ఎక్కడాలేదని చెబుతోంది. చంద్రబాబు ఇదే అంశంపై మీడియా సమావేశంలో కన్నీరుపెట్టుకోవటం కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై పలు వర్గాల నుంచి వైసీపీ ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొంది.