Telugu Gateway
Andhra Pradesh

మార్కెట్ లో హెరిటేజ్ సంచలనం

మార్కెట్ లో హెరిటేజ్ సంచలనం
X

రాజకీయాల్లో..స్టాక్ మార్కెట్ లో అదృష్టం ఎప్పుడు కలిసి వస్తుందో చెప్పలేం. కానీ వస్తే అన్నీ ఒకేసారి వస్తాయి. టీడీపీ అధినేత చంద్రబాబు కు ఇప్పుడు అంతా కలిసి వచ్చే కాలం అనే చెప్పాలి. ఆంధ్ర ప్రదేశ్ లో టీడీపీ కూటమి ఎవరూ ఊహించని స్థాయిలో ఘన విజయాన్ని దక్కించుకుని సంచలనం సృష్టించింది. ఇది ఒక ఎత్తు అయితే ఏకంగా గత రెండు టర్మ్ లుగా కేంద్రంలో ఏకస్వామ్య విధానాలతో పాలన సాగించిన మోడీ ఇప్పుడు చంద్రబాబు తో పాటు నితీష్ కుమార్ లపై ఆధారపడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో ఢిల్లీ లో కూడా చంద్రబాబుకు ప్రాధాన్యత పెరిగింది. అంతే కాదు టీడీపీ కేంద్ర క్యాబినెట్ లో బెర్తులు కూడా దక్కించుకోనుంది. రాజకీయంగా ఇది ఒక అంశం అయితే గత కొన్ని రోజులుగా చంద్రబాబు ఫ్యామిలీకి చెందిన హెరిటేజ్ ఫుడ్స్ షేర్లు స్టాక్ మార్కెట్ లో దుమ్మురేపుతున్నాయి.

అది ఎంతగా అంటే గత ఐదు రోజుల్లో చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి సంపద 579 కోట్ల రూపాయల మేర పెరిగింది. హెరిటేజ్ ఫుడ్స్ లో భువనేశ్వరికి 24.37 శాతం వాటా ఉంది. గత ఐదు రోజుల్లో ఈ కంపెనీ షేర్లు 262 రూపాయల మేర లాభపడ్డాయి. మే 31 న 402 రూపాయలు ఉన్న ఈ షేర్ వరసగా పెరుగుతూ వచ్చింది. శుక్రవారం నాడు కూడా ఈ కంపెనీ షేర్లు ఏకంగా అరవై రూపాయల లాభంతో పది శాతం అప్పర్ సర్క్యూట్ బ్రేకర్ ను తాకి 662 రూపాయల వద్ద ముగిసింది. ప్రస్తుతం హెరిటేజ్ ఫుడ్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 6140 కోట్ల రూపాయలుగా ఉంది.

Next Story
Share it