Telugu Gateway
Andhra Pradesh

ఎవడు ఆపుతాడో చూద్దాం

ఎవడు ఆపుతాడో చూద్దాం
X

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్ర ప్రదేశ్ కు సంబంధించి సినిమా రాజకీయం వేడెక్కుతోంది. ఒక వైపు వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కోసం దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇప్పటికే రెండు సినిమాలు తెరకెక్కించారు. అందులో ఒకటి వ్యూహం. ఈ సినిమా నవంబర్ 10 న విడుదల కానుంది. మరో సినిమా శపధం వచ్చే ఏడాది జనవరి 25 న విడుదల కానుంది. అయితే ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన నందమూరి బాలకృష్ణ సినిమా వీరసింహ రెడ్డి లో కూడా ఆంధ్ర ప్రదేశ్ కు సంబంధించి పొలిటికల్ డైలాగ్ లు పెట్టడంతో అప్పట్లో ఇది పెద్ద దుమారం రేపింది. జగన్ సర్కారు ను టార్గెట్ చేసుకునే ఆ సినిమాలో బాలకృష్ణ తో డైలాగులు చెప్పించారు . తాజాగా బోయపాటి శ్రీను తెరకెక్కించిన స్కంద సినిమా లో కూడా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం టార్గెట్ గానే పలు డైలాగులు ఉన్నాయి. ఆహా ఓటిటి లో బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ షో సూపర్ సక్సెస్ అయిన విషయం తెలిసిందే. తాజాగా మళ్ళీ ఈ షో కి సంబంధించి చిన్న లిమిటెడ్ ఎడిషన్ వస్తోంది. దీనికి సంబంధించి తాజగా ఒక ప్రోమో విడుదల అయింది. ఇందులో బాలకృష్ణ చెప్పిన డైలాగులు ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల చుట్టూనే తిరిగాయి. అంతే కాదు...చంద్రబాబు అరెస్ట్ విషయాన్నీ కూడా ఇందులో ప్రస్తావించారు.

ఈ ప్రోమోలో బాలకృష్ణ పొలిటికల్ డైలాగులు ‘మేము తప్పు చేయలేదు అని మీకు తెలుసు. మేము తలవంచం అని మీకు తెలుసు. మనను ఆపడానికి ఎవడూ రాలేడు అని మీకు తెలుసు. అనిపించింది అందాం. అనుకున్నది చేద్దాం. ఎవడు ఆపుతాడో చూద్దాం. సినిమా అయినా...లైఫ్ లో అయినా అంతా బాగున్నప్పుడు ఒకడు దిగుతాడు. మొత్తం నాశనం చేయటానికి బయలుదేరుతాడు. మళ్ళీ సెట్ చేయటానికి హీరో లు జైలు నుంచి బయటకు రావాలి. ’ అంటూ బాలకృష్ణ డైలాగులు ఉన్నాయి ఇందులో. స్కిల్ డెవలప్ మెంట్ కేసు లో చంద్రబాబు అరెస్ట్ అయి జైలు లో ఉన్న విషయం తెలిసిందే. అన్‌స్టాపబుల్ లిమిటెడ్ ఎడిషన్ లో ఫస్ట్ షో ను బాలకృష్ణ తన కొత్త సినిమా భగవంత్ కేసరి ప్రొమోషన్స్ కోసం వాడుకున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే ఫస్ట్ షో లో దర్శకుడు అనిల్ రావి పూడి , హీరోయిన్లు కాజల్ అగర్వాల్, శ్రీ లీల లు పాల్గొన్నారు. ఈ సినిమా దసరా సందర్భంగా అక్టోబర్ 19 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. అన్‌స్టాపబుల్ షో ఈ సారి లిమిటెడ్ ఎడిషన్ అయినా అదే అల్లరి...అదే సందడి ఉంటుంది అని బాలకృష్ణ ప్రకటించారు.

Next Story
Share it