జిల్లా ఎస్పీపై ఎమ్మెల్యే నల్లపురెడ్డి ఫైర్
నెల్లూరు జిల్లా రాజకీయం మళ్ళీ వేడెక్కింది. ఒక్కోసారి ఒక్కో నేత ప్రభుత్వ అధికారులపై విమర్శలు చేస్తుండటంతో అధికార పార్టీలో కలకలం రేగుతోంది. తాజాగా సీనియర్ నేత, ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్‌పై బహిరంగ సభలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసులు ఫైల్ చేయవద్దని చెప్పడమే అందుకు కారణం. తాము చెప్పింది చేయలేదనే ఆగ్రహంతో ఎమ్మెల్యే తీవ్ర విమర్శలు చేశారు. అసలు ఆయన ఎవరనుకుంటున్నారో, ఏమనుకుంటున్నారో.. ఏ గవర్నమెంట్ అనుకుంటున్నారో.. కేసు ఫైల్ చేయొద్దని చెప్పడానికి ఆయన ఎవరని మండిపడ్డారు. ఇది పద్ధతికాదని, తమాషాలుపడొద్దని ఎస్పీని హెచ్చరించారు.
ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళతానని అన్నారు. ఎస్పీ అనుమతి లేనిదే ఎస్టీ, ఎస్సీ కేసులు పెట్టకూడదా? 13 జిల్లాల్లో ఇలాగే జరుగుతోందా? అని నల్లపురెడ్డి ప్రశ్నించారు. ఉన్నన్ని రోజులు మంచిగా ఉండాలని, జగ్రత్తగా ఉండాలని, తనతో పెట్టుకోవద్దని, ఎవరు కాపాడతారు.. డీజీపీ కాపాడతారని అనుకుంటున్నావా? ఎక్కడి నుంచో వచ్చావ్, ఒక్క రోజు ఉంటావో, రెండు రోజులు ఉంటావో.. నీ బతుకేంది అంటూ ఎమ్మెల్యే నల్లపురెడ్డి వ్యాఖ్యనించారు. టీడీపీ నేతలు చెప్పినట్లు కేసు పెట్టకుండా ఆపుతారా?. అని ప్రశ్నించారు. కేసు పెట్టాక డీఎస్పీ విచారణ జరిపి అందులో నిజం లేకపోతే కొట్టేస్తారని..అసలు కేసు పెట్టకుండా ఎలా ఆపుతారని ప్రశ్నించారు.