Telugu Gateway
Andhra Pradesh

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను సీఎం చేయ‌టానికి క‌ల‌సిరావాలి

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను సీఎం చేయ‌టానికి క‌ల‌సిరావాలి
X

ఏపీలో జ‌న‌సేన అడుగులు ఆస‌క్తిక‌రంగా మారుతున్నాయి. పొత్తుల‌పై శ‌నివారం నాడు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ మూడు ఆప్ష‌న్స్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఇది జ‌రిగిన మ‌రుస‌టి రోజే జ‌న‌సేన పీఏసీ ఛైర్మ‌న్ నాదెండ్ల మ‌నోహ‌ర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. జ‌న‌సేన పార్టీని గెలిపించుకుని పవన్ కళ్యాణ్ ను మఖ్యమంత్రి చేయడానికి అంతా కలసి రావాలన్నారు. ఈ ప్రయాణంలో ఎక్కడా బేధాభిప్రాయాలు లేకుండా కలసికట్టుగా ముందుకు సాగుదామని వ్యాఖ్యానించారు. ఆదివారం మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అఖిల భారత చిరంజీవి యువత, రాష్ట్ర చిరంజీవి యువత ప్రతినిధులు మనోహర్ తో సమావేశమయ్యారు. అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు రవణం స్వామి నాయుడు, ఇత‌ర నేతలు ఈ స‌మావేశంలో పాల్గొన్నారు. జనసేన పార్టీ విజయంలో తమవంతు పాత్ర పోషించేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. పార్టీపరంగా ఏ నిర్ణయం తీసుకున్నా వందసార్లు ఆలోచించి తీసుకుంటున్నామ‌ని, ఆ నిర్ణయం ఎంత మందికి ఉపయోగపడుతుంది. ఎంత మందికి ఇబ్బంది కలుగుతుంది అనే అంశాలపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నామ‌ని తెలిపారు. ఏ నిర్ణయం తీసుకున్నా బహిరంగంగా మాట్లాడాలి అనే స్థాయిలో పాలసీలు తీసుకువస్తున్నాం.

రాష్ట్రంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చారు కానీ...ఇటువంటి పాలన ఎప్పుడూ చూడలేద‌న్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ని లక్ష్యంగా చేసుకుని ఆయనకు నష్టం చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఎంతో మంది నష్టపోయారు.సినీ రంగాన్ని దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తున్నప్పుడు చాలా బలంగా ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యాం. ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పని చేస్తోందని విమ‌ర్శించారు. రాజకీయంగా జనసేన పార్టీ రూపంలో ఒక క్లీన్ ప్లాట్ ఫామ్ మనకు ఉందని దీన్ని ఉప‌యోగించుకోవాలన్నారు. "సమాజానికి ఏదో విధంగా సాయపడాలి అనే బలమైన కోరిక చిరంజీవి, పవన్ కళ్యాణ్ లో ఉంది. మంచి కార్యక్రమాలు చేయడంతోపాటు నిజాయతీగా ఉండాలి. సేవా కార్యక్రమాలు ఒక ఎత్తు అయితే రాజకీయ పార్టీగా ఎలా ముందుకు వెళ్లాలి... ఎలా బలపడాలి అనే అంశం మీద దృష్టి సారించడం ముఖ్యం. అభిమాన సంఘాలకు, రాజకీయాలకు తేడా ఉంటుంది. రాజకీయంగా ప్రతి రోజూ గొడవలు ఉంటాయి. దానికి సిద్ధపడాలన్నారు. అభిమాన సంఘాలుగా మీ ఆలోచనల్లో స్పష్టత అవసరం. 100 శాతం జనసేన జెండా మోసేందుకు సిద్ధంగా ఉండాలి. గ్రామ స్థాయి నుంచి వార్డు స్థాయి వరకు పార్టీని తీసుకువెళ్లాలి. పార్టీ కార్యవర్గంతో పూర్తి స్థాయి కలయిక ఏర్పడడానికి మీకు కొంత సమయం పడుతుంద‌ని అన్నారు.

Next Story
Share it