పవన్ కళ్యాణ్ సమక్షంలో చేరికలు
వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతి శనివారం నాడు జనసేన లో చేరారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అసెంబ్లీ ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ పై ముద్రగడ పద్మనాభం చేసిన విమర్శలను తిప్పికొడుతూ ఆమె అప్పట్లో వార్తల్లో నిలిచారు. ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ను ఓడించలేకపోతే తన పేరు ముద్రగడ పద్మనాభరెడ్డి గా మార్చుకుంటానంటూ ఆయన సవాల్ విసిరిన విషయం తెలిసిందే. ముద్రగడ వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ అభిమానులకే కాకుండా ముద్రగడను ఇష్టపడే వాళ్లకు కూడా ఏ మాత్రం నచ్చటం లేదు అంటూ క్రాంతి అప్పటిలోనే కౌంటర్ ఇచ్చారు.
జగన్ ను ఎన్నడూ ప్రశ్నించని ముద్రగడకు పవన్ కళ్యాణ్ ను విమర్శించే అర్హత లేదు అన్నారు. చెప్పినట్లే ముద్రగడ తన పేరు మార్చుకున్నారు. ఆయన కుమార్తె మాత్రం జనసేనలో చేరిపోయారు. వాస్తవానికి ఎన్నికల సమయంలో ఆమె జనసేన లో చేరతారు అనే ప్రచారం జరిగింది. అయితే రాజకీయాల కోసం కుటుంబంలో చీలికలు తెచ్చాను అనే విమర్శలు ఎదురుకోవటం ఇష్టంలేకే పవన్ అప్పటిలో ఆమెను వరించినట్లు చెపుతున్నారు. ముద్రగడ కుమార్తె క్రాంతి తో పాటు గుంటూరుకు చెందిన కార్పొరేటర్లు, జగ్గయ్యపేటకు చెందిన నలుగురు మున్సిపల్ కౌన్సిలర్లు జనసేనలో చేరారు.