ఈ దూకుడు అక్కడ ఏదీ!

జనసేన అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నటించిన సినిమా హరి హర వీర మల్లు సినిమా గురువారం నాడు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పవన్ కళ్యాణ్ గతానికి భిన్నంగా ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటూ ఈ మూవీ పై అంచనాలు పెంచే పనిలో ఉన్నారు. ఈ విషయంలో ఆయన చాలా వరకు సక్సెస్ అయ్యారు అని చెప్పొచ్చు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ హరి హర వీర మల్లు మూవీ ఓపెనింగ్ బుకింగ్స్ కూడా బాగానే ఉన్నాయి. ఎందుకంటే కొద్ది రోజుల క్రితం వరకు ఈ సినిమా పై పెద్ద ఎత్తున నెగిటివ్ ప్రచారమే తప్ప...సానుకూల అంశాలు ఏమి పెద్దగా కనిపించలేదు. కాకపోతే ట్రైలర్ విడుదల తర్వాత నెగిటివ్ ప్రచారానికి బ్రేక్ పడింది. పవన్ కళ్యాణ్ నేరుగా రంగంలోకి దిగటంతో ఒకింత పాజిటివ్ బజ్ కూడా యాడ్ అయింది అనే చెప్పొచ్చు. అయితే ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుంది అనే విషయం తేలేది మాత్రం బుధవారం రాత్రి వేసే స్పెషల్ షోస్ తో పాటు గురువారం ఉదయం షోస్ తర్వాత అసలు టాక్ బయటకు వస్తుంది.
నిర్మాత ఏ ఎం రత్నం ఈ సినిమా కారణంగా ఆర్థికంగా భారీగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది 2020 సెప్టెంబర్ లో. కానీ కరోనా తో పాటు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ అయిపోవడంతో విపరీత జాప్యం జరిగి ఎట్టకేలకు ఇప్పుడు విడుదలకు నోచుకుంది. దీంతో నిర్మాత ఆర్థికంగా భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ కూడా పలు మార్లు ప్రస్తావించారు. ఏ హీరో అయినా కూడా తన సొంత సినిమా ప్రమోట్ చేసుకోవటం తప్పు కాదు. కానీ గత కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ హరి హర వీర మల్లు సినిమా ప్రమోషన్స్ విషయంలో చూపించిన జోష్ గత ఏడాది కాలంలో ఉప ముఖ్యమంత్రి గా ఉన్న ఆయన ఎప్పుడూ ప్రభుత్వ పరంగా చూపించలేదు అనే చర్చ ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ, అధికార వర్గాల్లో సాగుతోంది.
కూటమి అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో ఆయన నికరంగా పని చేసింది మూడు నుంచి నాలుగు నెలలు ఉంటే గొప్ప అనే అభిప్రాయాన్ని సొంత పార్టీ నేతలే చెపుతున్నారు. ఒక సారి రాష్ట్రమంతటా గ్రామ సభలు పెట్టడం...తర్వాత గిరిజన గ్రామాల్లో రహదారుల పనుల శంకుస్థాపనలు...ప్రారంబోత్సవాలో పాల్గొనటం తప్ప..ఆయన ఇప్పుడు చూపిస్తున్న జోష్ ప్రభుత్వంలో ఎప్పుడూ చూపించిన దాఖలాలు లేవు అని చెపుతున్నారు. ఆయన అత్యంత కీలకమైన అసెంబ్లీ సమావేశాలు..క్యాబినెట్ మీటింగ్ లు..కలెక్టర్ల సమావేశాల వంటి వాటికీ కూడా డుమ్మా కొట్టిన సందర్భాలు ఉన్నాయి.
మరో వైపు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఏడాది సెప్టెంబర్ లో బుడమేరు వరద ముంచెత్తి విజయవాడ లోని పలు ప్రాంతాలు మునిగిపోయిన సమయంలో కూడా చంద్రబాబు పడవల్లో ...బురదలో తిరిగి సహాయ పనులు పర్యవేక్షించారు..కానీ ఉప ముఖ్యమంత్రి గా ఉన్న పవన్ కళ్యాణ్ మాత్రం కాలు బయటపెట్ట లేదు. దీనిపై అప్పటిలో కూడా పెద్ద ఎత్తున విమర్శలు వినిపించాయి. ఇప్పుడు హరి హర వీర మల్లు సినిమా విషయంలో పవన్ కళ్యాణ్ చూపిస్తున్న జోష్ అటు ప్రభుత్వ కార్యక్రమాలు...పార్టీ వ్యవహారంలోనూ చూపిస్తే ఆయన ఎక్కడో ఉంటారు అని ఒక సీనియర్ నేత అభిప్రాయపడ్డారు. కానీ పవన్ కళ్యాణ్ కు అంత ఓపిక ..కసి ఉంది అని తాను అనుకోవటం లేదు అని ఆయనే వ్యాఖ్యానించారు.



