Telugu Gateway
Andhra Pradesh

టీడీపీకి కూడా మరో సహాయ మంత్రి ఛాన్స్!

టీడీపీకి కూడా మరో సహాయ మంత్రి ఛాన్స్!
X

ప్రధాని నరేంద్ర మోడీ త్వరలోనే కేంద్ర మంత్రి వర్గంలో భారీ మార్పులు చేయనున్నారు. కేంద్రంలో బీజేపీ మూడవసారి అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి అయిన సందర్భంగా పెద్ద ఎత్తున క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ చేయటంతో పాటు పరిపాలనలో వేగం పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే ఇటీవల కేంద్ర మంత్రులు అందరితో సమావేశం అయి పలు శాఖలకు చెందిన అంశాలపై ఆయన కీలక సూచనలు చేసిన సంగతి తెలిసిందే. జూన్ నెలలో జరిగే కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో ఈ సారి జనసేనకు కేంద్ర మంత్రి వర్గంలో సహాయ మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది అని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. జనసేన కు ఒక సహాయ మంత్రి పదవి తో పాటు ఇప్పటికే కేంద్ర క్యాబినెట్ లో భాగస్వామిగా ఉన్న తెలుగు దేశం పార్టీకి కూడా మరో సహాయ మంత్రి పదవి దక్కే అవకాశం ఉన్నట్లు సమాచారం.

జనసేన కు ఏపీలో ఇద్దరు ఎంపీలు ఉన్నారు. అందులో ఒకరు బాలశౌరి అయితే...మరొకరు తంగెళ్ల ఉదయ శ్రీనివాస్. ఈ సారి రాజ్య సభ లో కూడా జనసేన కు ప్రాతినిధ్యం దక్కనుంది. ఏపీలో ఖాళీ అవుతున్న నాలుగు సీట్లలో ఒక సీటు ను జనసేనకు ఇవ్వనున్నారు. ఈ సీటును జనసేన నుంచి లింగమనేని రమేష్ కు కేటాయిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెపుతున్నాయి. దీంతో జనసేన ఎంపీల సంఖ్య మూడుకు చేరనుంది. అయితే కేంద్ర మంత్రి వర్గంలో దక్కే ఛాన్స్ కు జనసేన అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎవరి పేరును ఎంపిక చేస్తారు అన్నది ఇప్పుడు కీలకంగా మారనుంది. అయితే ఉన్న వాళ్లలో కాస్త సీనియర్ ఎంపీ అంటే బాలశౌరి అనే చెప్పాలి. అయితే ఇక్కడ సీనియారిటీ అనే అంశం కంటే కూడా పవన్ కళ్యాణ్ ఛాయిస్ అన్నదే కీలకం కానుంది.

కేంద్ర క్యాబినెట్ లో టీడీపీ నుంచి ఇప్పటికే కె. రామ్మోహన్ నాయుడు పౌర విమానయాన శాఖ మంత్రి గా ఉన్న విషయం తెలిసిందే. ఆయనతో పాటు గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్ర శేఖర్ కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి గా ఉన్నారు. త్వరలో జరగనున్న విస్తరణలో టీడీపీ కి మరో సహాయ మంత్రి పదవి దక్కే ఛాన్స్ ఉన్నట్లు చెపుతున్నారు. టీడీపీ నుంచి ఈ ఛాన్స్ ఎవరికీ దక్కుతుందో చూడాలి. మరో వైపు టీడీపీలో ఇప్పుడు రాజ్య సభ ఛాన్స్ లు ఎవరికీ దక్కుతాయి అనేది కూడా ఉత్కంఠ రేపుతోంది. మహానాడు ముగిసిన తర్వాత కానీ చంద్రబాబు ఈ అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశాలు లేవు అని పార్టీ వర్గాలు చెపుతున్నాయి.

Next Story
Share it