Telugu Gateway
Andhra Pradesh

జ‌గ‌న్ వినతుల‌ను మోడీ ప‌ట్టించుకోరా?!

జ‌గ‌న్ వినతుల‌ను మోడీ ప‌ట్టించుకోరా?!
X

మ‌నీ మ‌నీ సినిమాలో కోటా శ్రీనివాస‌రావుది ఓ పాపుల‌ర్ డైలాగ్ ఉంటుంది. 'సేమ్ టైప్ ఆఫ్ కార్డ్ ప్రింటెడ్. బ‌ట్ నేమ్స్ డిఫ‌రెంట్' అని. ఏపీ సీఎం జ‌గ‌న్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లు చూస్తే మాత్రం దీనికి భిన్నంగా ఉంటాయి. ప‌ర్య‌ట‌న‌ల తేదీలు మార‌తాయి..ప్ర‌ధాని మోడీ, సీఎం జ‌గ‌న్ వంటి ప్ర‌ముఖుల డ్రెస్ లు మార‌తాయి. ఫోటోల్లో మాత్రం ఇంచుమించు అవే వెంక‌టేశ్వ‌ర‌స్వామి విగ్ర‌హాలు..అవే శాలువాలు. అంతే కాదు..ప్ర‌ధాని మోడీకి ఇచ్చే విన‌తిలోని అంశాలు మాత్రం పెద్ద‌గా ఏమీ మార‌వు. మ‌హా అయితే వాటిపై తేదీలు మార‌తాయి అంతే. మ‌రి ఏటా పదుల సంఖ్య‌లో ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లు చేసి..ప్ర‌ధాని మోడీతో ప‌దే ప‌దే స‌మావేశాలు జ‌రిపి ఏపీ సీఎం జ‌గన్ సాధిస్తున్న ఫ‌లితం ఏమిటి?. అంటే ఎన్ని సార్లు సీఎం జ‌గ‌న్ విన‌తిప‌త్రాలు ఇచ్చినా కూడా ప్ర‌ధాని మోడీ వీటిని ప‌ట్టించుకోవ‌టం లేద‌నుకోవాల్సిందేనా?. సీఎం జ‌గ‌న్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌ల వ‌ల్ల‌..ప్ర‌ధానికి సీఎం జ‌గ‌న్ ఇచ్చిన విన‌తిప‌త్రాల వ‌ల్ల ఏపీ ప్రజ‌ల‌కు ఇదిగో ఈ భారీ మేలు జ‌రిగింద‌ని ప్ర‌భుత్వం చెప్పే ప‌రిస్థితి ఉందా?. నిత్యం అవే అంశాలు పోల‌వ‌రం స‌వ‌రించిన అంచ‌నాలు..పెండింగ్ లో ఉన్న విభజ‌న హామీలు..తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బ‌కాయిలు...ప్ర‌త్యేక హోదా..క‌డ‌ప స్టీల్ ప్లాంట్ కు గ‌నులు. ప్ర‌తిసారి ఏజెండాలో ఇవే అంశాలు ఉంటాయి..కానీ ఫలితం మాత్రం ఏమీ ఉండ‌ద‌నే చెప్పుకోవాలి.

వైసీపీ బిజెపికి అవ‌స‌ర‌మైన ప్ర‌తిసారి పార్ల‌మెంట్ లోప‌లా..బ‌య‌టా సాయం చేస్తూనే ఉంది. అత్యంత కీల‌క‌మైన రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌లోనూ అడిగిందే త‌డ‌వుగా మ‌ద్ద‌తు ఇచ్చారు. అయినా స‌రే జ‌గ‌న్ ప్ర‌తిసారి మోడీకి ఇచ్చే విన‌తిప‌త్రంలోనూ అంశాల్లో మార్పులు ఎందుకు ఉండటం లేదు. దీంతో ప్ర‌తిప‌క్ష పార్టీలు ఆరోపిస్తున్న‌ట్లు సీఎం జ‌గ‌న్ ప్ర‌ధాని మోడీతో స‌మావేశం అవుతున్న అస‌లు ఏజెండా వేరు..బ‌య‌ట‌కు చెప్పే ఏజెండా అంశాలు వేరు అన్న చ‌ర్చ రాజ‌కీయ వ‌ర్గాల్లో సాగుతోంది. లేక‌పోతే కేంద్రంతో అత్యంత స‌న్నిహితంగా ఉన్న జ‌గ‌న్ కేంద్రంపై ఒత్తిడి చేసి కొన్నింటి కొన్ని పనులు కూడా చేయించ‌లేక‌పోతే ఇది రాజ‌కీయంగా వైసీపీకి న‌ష్టం జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని ఆ పార్టీ నేత‌లు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. నిత్యం ఒకే ఏజెండాతో వెళుతున్న‌ట్లు చెప్ప‌టం ప్ర‌భుత్వ వైఫ‌ల్యం కింద‌కే వ‌స్తుంద‌ని..అదే స‌మ‌యంలో వేరే ప‌నుల కోసమే ప్ర‌ధాని మోడీని క‌లుస్తూ..దీన్ని సాకుగా చూపెడుతున్నార‌ని విప‌క్ష పార్టీలు చేసే విమ‌ర్శ‌ల‌నూ ప్ర‌జ‌లు న‌మ్మే ఛాన్స్ ఉంద‌ని ఓ సీనియ‌ర్ నేత వ్యాఖ్యానించారు.

Next Story
Share it